Budget 2023: ఆకర్షణీయంగా కొత్త పన్ను విధానం!

Budget 2023: పన్ను వర్తించే ఆదాయ పరిమితిని పెంచడంతోపాటు, శ్లాబులనూ సవరిస్తారని రెండు మూడేళ్లుగా ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎదురు చూస్తున్నారు.

Updated : 23 Jan 2023 14:17 IST

బడ్జెట్‌లో కీలక మార్పులు ప్రతిపాదించే అవకాశాలు

ఈనాడు, హైదరాబాద్‌: పన్ను వర్తించే ఆదాయ పరిమితిని పెంచడంతోపాటు, శ్లాబులనూ సవరిస్తారని రెండు మూడేళ్లుగా ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారులు ఎదురు చూస్తున్నారు. అయితే స్వల్ప మార్పులు మినహా పెద్దగా ప్రయోజనాలు కల్పించలేదు. ఎలాంటి మినహాయింపులూ చూపించకుండా.. ఆదాయాన్ని బట్టి, పన్ను చెల్లించే కొత్త పన్ను విధానాన్ని 2020లో ప్రకటించినా, దీనిని ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య తక్కువే. ఈసారి బడ్జెట్లో (Budget 2023) మాత్రం ఆదాయపు పన్ను (Income Tax) విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చే ప్రతిపాదనలు ఉండొచ్చని ఆదాయపు పన్ను (Income Tax) నిపుణులు పేర్కొంటున్నారు.

ఇవీ కారణాలు: ధరలు పెరిగినందున, ప్రజల వద్ద నగదు నిల్వ తగ్గుతోంది. వారికి ఉపకరించేలా, ఆదాయపు పన్ను (Income Tax) వర్తించే పరిమితిని పెంచడం లేదా, పన్ను శ్లాబులను సవరించడం లాంటివి చేయొచ్చని పేర్కొంటున్నారు. మినహాయింపుల అవసరం లేని, కొత్త విధానాన్ని, ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారులకు అలవాటు చేసేందుకు ఆర్థిక శాఖ ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఈ విధానంలో గరిష్ఠ పన్ను శ్లాబు 30 శాతంగా ఉండగా, దీన్ని 25 శాతానికి సవరించొచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు.

సులభమే అయినా..: పన్ను చెల్లింపుదారులు పాత/కొత్త పన్ను విధానాల్లో ఏదో ఒకటి ఎంచుకునే వీలుంది. పాత పన్ను విధానంలో వివిధ సెక్షన్ల కింద మినహాయింపులు క్లెయిం చేసుకోవచ్చు. కొత్త పన్ను విధానంలో.. వచ్చిన ఆదాయానికి వర్తించే శ్లాబుల ప్రకారం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. కొత్త విధానంలో పన్ను గణన చాలా సులభమే. కానీ చాలామంది గృహరుణం వాయిదాలు, బీమా పాలసీలకు ప్రీమియం చెల్లిస్తూ ఉంటారు. ఈపీఎఫ్‌, పిల్లల ట్యూషన్‌ ఫీజుల్లాంటివీ మినహాయింపు జాబితాలోకి వస్తాయి. కొత్త పన్నుల విధానంలో ఈ వెసులుబాట్లేమీ లేవు కనుకే, దీన్ని ఎంచుకునే వారి సంఖ్య తక్కువగా ఉంది. ఏ పన్ను విధానంలో ఎంత మంది రిటర్నులు దాఖలు చేశారనే సమాచారం ప్రభుత్వం అందుబాటులో ఉంచదు. కానీ, కొత్త పన్ను విధానం వల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరలేదనే సంగతి అర్థమవుతోంది. అందుకే దీన్ని మరింతమందికి చేరువ చేసేందుకు ప్రభుత్వం చూస్తోందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

* గృహరుణం తీసుకోని, పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయని వారికి కొత్త పన్ను విధానం వల్ల పన్ను భారం తగ్గితే, చాలామంది దీనివైపే మొగ్గు చూపే అవకాశం ఉంది.

మరిన్ని బడ్జెట్‌ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని