Budget 2023: అమృతకాలంలో సప్తమంత్ర
అమృతకాలంలో ఏడు అంశాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.
‘సప్తర్షి’ పేరుతో 7 ప్రాధాన్య అంశాల ప్రస్తావన
దిల్లీ: అమృతకాలంలో ఏడు అంశాలకు కేంద్రం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఆ విషయాన్ని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రధానంగా యువతకు మరిన్ని అవకాశాలు, ఉద్యోగాల కల్పనకు పెద్దపీట వేస్తామని తెలిపారు. అవకాశాలను వినియోగించుకుని ఆర్థిక సాధికారత సాధించగలమని ఆమె తెలిపారు. సప్తర్షి పేరుతో ఆర్థికమంత్రి చెప్పిన ఏడు అంశాలివే..
సమ్మిళిత అభివృద్ధి
అన్నివర్గాలకూ అభివృద్ధి ఫలాలు అందించాం. గ్రామీణ ప్రాంతాల్లో 9 కోట్ల తాగునీటి కనెక్షన్లు ఇచ్చాం. స్వచ్ఛభారత్ మిషన్ కింద 11.7 కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్ల నిర్మాణం, పీఎం-కిసాన్ పథకం కింద 11.4 కోట్ల మంది రైతులకు రూ.2.2 లక్షల కోట్ల అందజేత, 44.6 కోట్ల మంది పీఎంఎస్‌బీవై, పీఎంజేజేవైల కింద బీమా కవరేజి, 47.8 కోట్ల పీఎం జన్‌ధన్ బ్యాంకుఖాతాలు, ఉజ్వల పథకం కింద 9.6 కోట్ల ఎల్‌పీజీ కనెక్షన్లు, 102 కోట్ల మంది ప్రజలకు 220 కోట్ల కొవిడ్ టీకాలు అందించాం.
చిట్టచివరి వ్యక్తికీ లబ్ధి
అన్నివర్గాల ప్రజల్నీ కలుపుకొని చిట్టచివరి వ్యక్తికీ ప్రయోజనం చేకూర్చే పనులు చేపడుతున్నాం. గిరిజనుల అభ్యున్నతి నుంచి మొదలుపెట్టి.. పురాతన శాసనాల డిజిటైజేషన్ వరకూ అన్నివర్గాలకూ అభివృద్ధిని అందిస్తున్నాం. ప్రధానమంత్రి పీవీటీజీ (నిర్దిష్ట దుర్బల గిరిజన తెగల) అభ్యున్నతి మిషన్ ప్రారంభిస్తాం. పురాతన శాసనాలను డిజిటల్ రూపంలో భద్రపరిచేందుకు భారత్ శ్రీ అనే వ్యవస్థను నెలకొల్పుతాం. 50 అదనపు విమానాశ్రయాలు, హెలిపోర్టులు, నీటి ఏరోడ్రోమ్‌లు, అత్యాధునిక ల్యాండింగ్ గ్రౌండ్లను పునరుద్ధరిస్తాం. పీఎంజీకేఏవై కింద ఏడాది పాటు ఉచితంగా ఆహారధాన్యాలు ఇస్తాం. పీఎం ఆవాస్ యోజనకు 66% అధిక కేటాయింపులు చేశాం.
మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు
మౌలిక సదుపాయాలు, ఉత్పాదక సామర్థ్యాన్ని పెంచే రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహకాలు అందిస్తాం. వృద్ధిరేటు పెరగడంతో పాటు కొత్త ఉద్యోగాలూ వస్తాయి. మూలధన పెట్టుబడులను 33.4% పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చాం. మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణం కొనసాగిస్తాం. రైల్వేలకు గతంలో ఎన్నడూ లేనంతగా రూ.2.40 లక్షల కోట్ల కేటాయించాం. ఓడరేవులు, బొగ్గు, ఉక్కు, ఎరువుల్లాంటివి చిట్టచివరి వరకు అందేందుకు వీలుగా 100 రవాణా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను గుర్తించాం. ద్వితీయ, తృతీయశ్రేణి నగరాల్లో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి ఏర్పాటు ద్వారా సదుపాయాలను కల్పిస్తాం.
సామర్థ్యాల వెలికితీత
స్వదేశీ సామర్థ్యం మరింత మెరుగుపడుతుంది. విద్యాసంస్థల్లో మూడు ప్రత్యేక కృత్రిమమేధ కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నాం. దానివల్ల వ్యవసాయం, వైద్యం, సుస్థిర నగరాల్లో ఏఐ ఆధారిత పరిష్కారాలు వస్తాయి. జాతీయ డేటా గవర్నెన్స్ విధానం అమలుతో అంకురసంస్థలు, విద్యాసంస్థలకు పరిశోధన కోసం కావాల్సినంత డేటా ఉంటుంది. వివాద్ సే విశ్వాస్ 1 కింద.. కొవిడ్ సమయంలో ప్రభావితమైన ఎంఎస్‌ఎంఈలకు సరళంగా కాంట్రాక్టుల అమలుతో ఊరట. వివాద్ సే విశ్వాస్ 2 కింద సులభమైన, ప్రామాణిక సెటిల్‌మెంట్ పథకం వల్ల ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థల్లోని కాంట్రాక్టు వివాదాలను త్వరగా సెటిల్ చేసుకోవచ్చు. ఈ-కోర్టుల మూడో దశ ప్రారంభంతో మరింత సమర్థమైన న్యాయవ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. వ్యాపార, వాణిజ్య సంస్థలు, ఛారిటబుల్ ట్రస్టుల కోసం సంస్థల డిజిలాకర్‌తో వ్యాపారాలకు అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా భద్రపరచుకోడానికి, పంపడానికి వీలవుతుంది.
హరిత వృద్ధి
పీఎం ప్రణామ్ ద్వారా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఎరువుల వినియోగానికి ప్రోత్సాహకాలు అందిస్తాం. తీరప్రాంతాల్లో మడఅడవుల పెంపకానికి ‘మిష్ఠీ’ పథకం, చిత్తడినేలల సమర్థ వినియోగానికి ‘అమృత్ ధరోహర్’ అమలు చేస్తాం. రైతులు ప్రకృతిసేద్యం అందిపుచ్చుకునేలా 10వేల బయో ఇన్‌పుట్ వనరుల కేంద్రాలు వస్తాయి. బ్యాటరీల్లో ఇంధన నిల్వవ్యవస్థలను ప్రోత్సహిస్తాం. ఇంధన సామర్థ్య రవాణా కోసం నౌకారవాణాకు ప్రోత్సాహమిస్తాం. పాత, కలుషిత వాహనాలను మార్చేందుకు నిధులు కేటాయిస్తాం. సుస్థిర చర్యలకు ప్రోత్సాహకాల కోసం గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం ప్రారంభిస్తాం.
యువశక్తికి ప్రోత్సాహం
కోడింగ్, కృత్రిమ మేధ, రోబోటిక్స్, 3డి ప్రింటింగ్ తదితర అంశాలతో కూడిన కొత్త కోర్సులను ప్రవేశపెడతాం. స్వదేశీ, విదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు 50 ప్రాంతాలను ఎంపికచేసి, ప్యాకేజిగా అభివృద్ధి చేస్తాం. సమైక్యమాల్స్ ఏర్పాటుకు రాష్ట్రాలకు ప్రోత్సాహాన్ని అందిస్తాం. జిల్లాలవారీ ఉత్పత్తుల అమ్మకాలను, జీఐ, హస్తకళా ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఇవి ఉపయోగపడతాయి. మూడేళ్లలో 47 లక్షల మంది యువతకు స్టైపెండ్ అందించేందుకు జాతీయ అప్రెంటిస్‌షిప్ ప్రోత్సాహ పథకం. కృత్రిమ మేధ, రోబోటిక్స్, మెకట్రానిక్స్, 3డి ప్రింటింగ్, డ్రోన్ల లాంటి వాటికోసం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0ను అమలుచేస్తాం. స్కిల్ ఇండియా డిజిటల్ ప్లాట్‌ఫాం కింద నైపుణ్యాభివృద్ధి కోర్సులు ప్రవేశపెడతాం.
ఆర్థిక రంగం బలోపేతం
దేశ ఆర్థికరంగాన్ని బలోపేతం చేసేందుకు పలు చర్యలు చేపడుతున్నాం. జాతీయ ఆర్థిక సమాచార రిజిస్ట్రీ ఏర్పాటుద్వారా రుణవితరణను మరింత సమర్థవంతం చేస్తాం. కేంద్రీకృత డేటా ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటుతో కంపెనీల చట్టం కింద పాలనా వ్యవహారాలను వేగవంతం చేస్తాం. ఎంఎస్‌ఎంఈలకు క్రెడిట్ గ్యారంటీ పథకం ద్వారా తనఖా అవసరం లేకుండా రుణాలిచ్చేందుకు అదనంగా రూ.2 లక్షల కోట్ల కార్పస్‌ఫండ్ ఏర్పాటుచేస్తాం. మహిళల కోసం రెండేళ్ల కాలానికి రూ.2లక్షల చొప్పున ఆదా చేసుకునేందుకు మహిళా సమ్మాన్ బచత్‌పత్ర పేరుతో చిన్నమొత్తాల పొదుపు పథకం. వయోవృద్ధులు సేవింగ్స్ పథకాల్లో గరిష్ఠంగా డిపాజిట్ చేయగల మొత్తాన్ని రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచుతున్నాం. సెక్యూరిటీల మార్కెట్లలో విద్యార్హత ధ్రువపత్రాలు అందించడం ద్వారా మరింతమంది సుశిక్షితులైన నిపుణులను రూపొందిస్తాం..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Supreme Court: రాహుల్‌పై అనర్హత వేళ.. సుప్రీంలో కీలక పిటిషన్
-
India News
Missile misfire: పొరపాటున పేలిన మూడు క్షిపణులు..!
-
Politics News
2024లో రాజకీయ సునామీ.. వైకాపా శాశ్వతంగా డిస్మిస్ అవుతుంది : కోటంరెడ్డి
-
General News
AP CID : తెదేపా నేత చింతకాయల విజయ్‌కు సీఐడీ నోటీసులు
-
Movies News
Bhanushree: సినీ పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య ఇదే.. ‘వరుడు’ హీరోయిన్ కామెంట్స్
-
India News
Rahul Gandhi: నేడు మీడియా ముందుకు రాహుల్ గాంధీ.. ఏం చెప్పనున్నారు..?