చిన్న కమతాలకూ మర యంత్రాలు

వ్యవసాయంలో కీలకం సస్యరక్షణ. అధిక మొత్తంలో ఖర్చయ్యేది ఇక్కడే. కలుపు తీయడం దగ్గర్నుంచి, పురుగు మందులు పిచికారీ చేయడం వరకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది.

Updated : 09 Apr 2023 08:55 IST

ఈనాడు - హైదరాబాద్‌

వ్యవసాయంలో కీలకం సస్యరక్షణ. అధిక మొత్తంలో ఖర్చయ్యేది ఇక్కడే. కలుపు తీయడం దగ్గర్నుంచి, పురుగు మందులు పిచికారీ చేయడం వరకు శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఇందుకు కూలీలను పెట్టుకోవాలంటే, అధికంగా చెల్లించాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న యంత్రాలనేమో చిన్న రైతులు వాడలేరు. చిన్న కమతాలకూ పనికివచ్చే యంత్రాలను రూపొందించాలన్న ఆలోచన నుంచి పుట్టిన అంకురమే ఎక్స్‌మెషీన్స్‌ అని సంస్థ వ్యవస్థాపకుడు త్రివిక్రమ్‌ కుమార్‌ ‘ఈనాడు’కు తెలిపారు. తమ సంస్థ గురించి ఆయన మాటల్లోనే..

‘నేను హాంకాంగ్‌లో మెకట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాను. చదువుకుంటున్న సమయంలో, మన దేశంలో రైతుల ఆత్మహత్య వార్తలు నన్ను బాగా ప్రభావితం చేశాయి. వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులు ఇందుకు కారణం. విత్తడం, కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగు మందు పిచికారీ చేసేందుకు కూలీల అవసరం ఉంటుంది. కొన్నిచోట్ల వీరి లభ్యతా కష్టంగా మారింది. ఈ కష్టాలకు పరిష్కారంగా రోబోలను రూపొందించాలని నిర్ణయించుకున్నాను. రోబోటిక్స్‌ తయారీలో అనుభవం సాధించేందుకు హాంకాంగ్‌లో ఒక కంపెనీలో రెండేళ్లు పనిచేసి, తర్వాత ఇక్కడికి వచ్చేశాను’ అని తెలిపారు.

చిన్న రైతుల కోసం..

‘వ్యవసాయానికి ఉపయోగపడే పరికరాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నా, అవన్నీ పెద్ద రైతులకు ఉపయోగపడేవే. ఎకరం, రెండెకరాలు ఉన్న రైతులు కలుపు తీయడం కోసం ట్రాక్టర్లను వినియోగించలేరు. ఇందుకోసమే చిన్న ట్రాక్టర్‌ రోబోను రూపొందించడం ప్రారంభించా. ఈ దశలోనే నాకు ధర్మతేజ, వినీల్‌ రెడ్డి తోడయ్యారు. మేం ముగ్గురం కలిసి 2017లో ఎక్స్‌మెషీన్స్‌ ప్రారంభించాం. పూర్తిగా దేశీయంగా దొరికే విడిభాగాలతోనే ఆ యంత్రాన్ని రూపొందించాం’ అన్నారు.

ఏం చేస్తుందంటే...

‘బ్యాటరీతో నడిచే ఈ విద్యుత్‌ యంత్రం పంటకు ఏమాత్రం నష్టం కలుగకుండా కలుపు తీయడం, ఎరువులు వేయడం, పురుగు మందు పిచికారీ చేయడం, గడ్డిని కోయడంలాంటి పనులన్నీ చేస్తుంది. ప్రధాన మైక్రో ట్రాక్టర్‌కు అనుబంధంగా ఆయా పరికరాలను బిగించుకుంటే సరిపోతుంది. పంట మధ్యలో రెండు అడుగుల ఖాళీ ప్రదేశం ఉంటే చాలు. కృత్రిమ మేధతో ఈ యంత్రాన్ని యాప్‌తో నియంత్రించొచ్చు. మిరప, పత్తి, పొగాకు తదితర పంటల్లో దీన్ని సులభంగా వినియోగించుకోవచ్చు. సౌర విద్యుత్‌ కేంద్రాల్లోనూ ఈ పరికరాన్ని వాడుకునేలా రూపొందించాం. పార్కులు, క్రీడా మైదానాల్లోనూ వాడుకోవచ్చు’ అని వివరించారు.

అద్దెకు ఇచ్చేలా..

‘ఈ యంత్రం ఖరీదు రూ.1.75 లక్షల (పన్నులు అదనం) వరకు ఉంటుంది. చిన్న రైతులు ఇంత పెట్టి కొనలేరు కనుక, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఎంపిక చేసుకుని, వారికి బ్యాంకు రుణాలతో దీన్ని అందిస్తున్నాం. వారు దీన్ని అద్దెకు తిప్పడం ద్వారా ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలవుతుంద’న్నారు.

ఐఎస్‌బీ నుంచి నిధులు..

‘తొలుత సొంత నిధులతోనే సంస్థను ప్రారంభించాను. తర్వాత బ్యాంకు నుంచి రుణం తీసుకున్నాం. మా ఆలోచన నచ్చిన ఐఐఐటీ హైదరాబాద్‌ నుంచి రూ.14 లక్షలు, ఐఎస్‌బీ హైదరాబాద్‌ నుంచి రూ.25 లక్షల పెట్టుబడి సంపాదించాం. మా యంత్రాన్ని ఒక విదేశీ యూనివర్సిటీ రోబోటిక్స్‌పై పరిశోధన కోసం తీసుకుంది. భారీ యంత్రాలను ఉత్పత్తి చేసే ఒక సంస్థ, మా యంత్రాన్ని పరిశీలించేందుకు కొనుగోలు చేసింది. రానున్న ఏడాది కాలంలో మొత్తం 100కు పైగా యంత్రాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నాం. కొత్తగా ఉద్యోగులనూ నియమించుకుంటాం. ఈ యంత్రాన్ని మరింత అభివృద్ధి చేయబోతున్నాం. చిన్న యంత్రాలతో వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించాలన్నదే మా లక్ష్యం’.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని