అద్దెకు విద్యుత్‌ వాహనాలు

విద్యుత్తు వాహన మోడళ్లు సరికొత్తగా విపణిలోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్‌ బైక్‌ను వదిలేసి, విద్యుత్తు మోడల్‌ కొందామన్నా, ఒకేసారి డబ్బు పెట్టి కొనలేని స్థితి ఎందరిదో.

Updated : 01 May 2023 09:12 IST

ఈనాడు, హైదరాబాద్‌: విద్యుత్తు వాహన మోడళ్లు సరికొత్తగా విపణిలోకి వస్తున్నాయి. ప్రస్తుతం వాడుతున్న పెట్రోల్‌ బైక్‌ను వదిలేసి, విద్యుత్తు మోడల్‌ కొందామన్నా, ఒకేసారి డబ్బు పెట్టి కొనలేని స్థితి ఎందరిదో. పనుల నిమిత్తం వారం, పది రోజుల పాటు ద్విచక్ర వాహనం కావాలనుకునేవారు మరికొందరు.. ఇలాంటి వారికి పరిష్కారం చూపాలనే ఆలోచనతో వచ్చిన అంకురమే హాలా మొబిలిటీ. విద్యుత్‌ వాహనాలను కొనక్కర్లేకుండా.. కావాల్సినన్ని రోజులకు అద్దెకు తీసుకునే వెసులుబాటు కల్పించడమే తమ లక్ష్యం అని చెబుతున్నారు ఈ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీకాంత్‌ రెడ్డి కలకొండ. తమ సంస్థ గురించి ఇలా వివరిస్తున్నారు.

‘బీటెక్‌ పూర్తయ్యాక విదేశాలకు వెళ్లాను. మాస్టర్స్‌ పూర్తయ్యాక షేర్డ్‌ మొబిలిటీ అంశంపై పీహెచ్‌డీ చేశాను. అప్పుడే పలు సంస్థలతో కలిసి పని చేశాను. ఈ సమయంలో వాహనాల అవసరం ఎలా ఉంటోంది? అద్దెకు తీసుకుంటున్న వారి పరిస్థితులేమిటి.. అనే అంశాలు పరిశీలించా. మంచి మార్కెట్‌ ఉన్న మన దేశంలోని అవకాశాలనూ అధ్యయనం చేశా. ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకున్నాకే, మా అంకురాన్ని మొదలుపెట్టాం. నాతోపాటు ఆనంద్‌ పరీక్‌, స్నేహిత్‌ రెడ్డి మేడ సహ వ్యవస్థాపకులుగా 2019లో హాలా మొబిలిటీని ప్రారంభించాం. హాలా అంటే స్పానిష్‌లో అద్భుతం అని అర్థం. 2020 నవంబరులో మా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభంలో సొంత డబ్బులతోనే సంస్థను ప్రారంభించాం. మొదట మెట్రో స్టేషన్ల వద్ద ఇ-స్కూటర్లను అందుబాటులో పెట్టి, అద్దెకు ఇవ్వాలని అనుకున్నాం.  కొన్ని ఇబ్బందులు ఎదురైనందున, మా వ్యాపారాన్ని మార్చుకున్నాం. 150 మందికి పైగా డెలివరీ బాయ్స్‌ను తీసుకుని, వారికి ఇ-స్కూటర్లను ఇచ్చి, కొన్ని ఇ-కామర్స్‌ సంస్థలతో కలిసి పనిచేశాం. కానీ, ఇది మా లక్ష్యానికి దూరంగా వెళ్తున్నట్లు గమనించాం. సొంతంగా సిబ్బందిని తీసుకోకుండా ఇ-కామర్స్‌ సంస్థల దగ్గర ఉన్న డెలివరీ సిబ్బందికి వాహనాలు అందించాలని అనుకున్నాం. ఇలా మా పంథాను మరోసారి మార్చుకున్నాం.

వినియోగదారులు ఇలా చేయాలి

మా మొబైల్‌ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని, కేవైసీ పూర్తి చేయాలి. డ్రైవింగ్‌ లైసెన్సు ఉన్న వారికి, లేని వారికి వేర్వేరు వాహనాలు కనిపిస్తాయి. సమీపంలో ఉన్న మా స్టేషన్‌ నుంచి వాహనాన్ని తీసుకుని, వాడుకోవచ్చు. కనీసం వారం రోజుల నుంచి 11 నెలల కాలానికి వాహనాలను అద్దెకు తీసుకోవచ్చు. సొంతంగా కొనాలని అనుకుంటే, రుణం అందిస్తున్నాం. విద్యుత్‌ వాహనాల్లో వారానికో కొత్త సాంకేతికత వస్తున్న రోజులివి. కాబట్టి, చాలామంది అద్దెకు తీసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

పెట్టుబడులూ వచ్చాయి..

వాహనాలను అద్దెకు ఇవ్వడం ప్రారంభించాక, టి-హబ్‌కు చెందిన టి-ఏంజెల్స్‌ నుంచి రూ.8 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇటీవలే మరో రూ.8 కోట్లను సమీకరించాం. సెప్టెంబరు నాటికి రూ.65 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. సరకు రవాణా విభాగంలో విద్యుత్‌ ఆటోలను ప్రవేశ పెట్టాలి. అద్దె కార్లను అందుబాటులోకి తీసుకురావాలి. ఇవీ మేము నిర్ణయించుకున్న భవిష్యత్‌ లక్ష్యాలు.


20 వాహనాలతో మొదలు

టి-హబ్‌ కేంద్రంగా మా సంస్థను ప్రారంభించినప్పుడు తొలుత 20 వాహనాలు కొనుగోలు చేశాం. క్రమంగా ఈ సంఖ్య పెంచుకుంటూ వచ్చాం. ప్రస్తుతం మా దగ్గర 2000కు పైగా వాహనాలున్నాయి. మరో ఏడాదిలో ఈ సంఖ్యను 5000కు చేర్చాలనేది లక్ష్యం. మా దగ్గర ప్రస్తుతం 78 మంది ఉద్యోగులున్నారు. ఏడాదిలో వీరి సంఖ్య రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు విశాఖపట్నం, చెన్నై, ముంబయి, పుణెల్లో సేవలందిస్తున్నాం. త్వరలోనే ఇతర నగరాలకు విస్తరిస్తాం. కార్పొరేట్‌ సంస్థలతోనూ కలిసి పనిచేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నాం.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని