New scheme: ఆర్థిక సేవలపై నమ్మకం ఉంటే..

బీమా, చెల్లింపుల సేవలు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, స్టాక్‌ బ్రోకింగ్‌లాంటి ఆర్థిక సేవలను అందించే సంస్థల్లో మదుపు చేసేలా ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈటీఎఫ్‌ అనే కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. దీని ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 27. కనీస పెట్టుబడి రూ.500.

Updated : 23 Jul 2022 15:51 IST

బీమా, చెల్లింపుల సేవలు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, స్టాక్‌ బ్రోకింగ్‌లాంటి ఆర్థిక సేవలను అందించే సంస్థల్లో మదుపు చేసేలా ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఈటీఎఫ్‌ అనే కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. దీని ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 27. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టీఆర్‌ఐ ఆధారంగా ఈ ఫండ్‌ పనితీరును లెక్కిస్తారు. ఈటీఎఫ్‌ పథకాలు ‘ప్యాసివ్‌ పెట్టుబడి’ తరగతికి చెందినవి. ఇందులో ఫండ్‌ మేనేజర్‌ పాత్ర పరిమితంగా ఉంటుంది. ఫండ్‌ నిర్వహణ వ్యయాలూ తక్కువే. నిర్ణీత పెట్టుబడుల ప్రణాళిక ప్రకారం పోర్ట్‌ఫోలియో నిర్మాణం జరుగుతుంది. మానవ తప్పిదాలకు అవకాశం తక్కువ. ఈటీఎఫ్‌ పథకాలు కాబట్టి లిక్విడిటీ ఎక్కువే. వచ్చే కొన్నేళ్ల పాటు ఆర్థిక సేవల రంగం మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దీన్ని విశ్వసించే మదుపరులు ఈ ఫండ్‌ను పరిశీలించవచ్చు. నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టీఆర్‌ఐ, పీఈ రేషియో (ప్రైస్‌ ఎర్నింగ్స్‌ నిష్పత్తి) ప్రస్తుతం దాదాపు 18 వద్ద ఉంది. పీబీ నిష్పత్తి (ప్రైస్‌ టు బుక్‌ రేషియో) 3.40, డివిడెండ్‌ ఈల్డ్‌ 0.83 ఉన్నాయి. అంటే చౌక కాదు, అలాగని ఖరీదూ కాదు. ‘రీజనబుల్‌ వాల్యుయేషన్‌’ వద్ద ఉన్నట్లు భావిస్తున్నారు.

తక్కువ నష్ట భయంతో..

విభిన్నమైన పెట్టుబడి వ్యూహం, తక్కువ నష్టభయంతో ప్యాసివ్‌ పద్ధతిలో మదుపు చేసేలా క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ విడుదలయ్యింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 1తో ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.500. ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ‘నిఫ్టీ 50 ఇండెక్స్‌’తో ఈ పథకం పనితీరును పోలుస్తారు. హితేంద్ర పరేఖ్‌ ఈ పథకానికి ఫండ్‌ మేనేజర్‌. 14 ఏళ్లుగా క్వాంటమ్‌ నిఫ్టీ 50 ఈటీఎఫ్‌ను నిర్వహిస్తున్నారు. ఈ పథకం ‘12- 20- 80 పెట్టుబడి విధానాన్ని’ అనుసరిస్తుంది. అంటే 12 శాతం నగదు, నగదు సమాన పథకాల్లో భద్రంగా ఉంటుంది. మిగిలిన సొమ్ములో 20 శాతం సొమ్ము బంగారంపై పెట్టుబడికి, 80 శాతం ఈక్విటీకి కేటాయిస్తారు. ఇది ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఒక రకమైన ‘ప్యాసివ్‌ పెట్టుబడి’ విధానం. దీని వల్ల నష్టభయం తక్కువగా ఉండటంతో పాటు మదుపరులకు స్థిరమైన ప్రతిఫలం లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని