Published : 29 Jul 2022 01:00 IST

మహిళలకూ బీమా రక్ష

ఆర్థిక ప్రణాళికలో జీవిత బీమాకు ప్రథమ స్థానం ఉంటుంది. ఆర్జించే ప్రతి వ్యక్తీ తనపై ఆధారపడిన వారికి ఆర్థిక భరోసా కల్పించేలా తగిన మొత్తానికి జీవిత బీమా రక్షణ తీసుకోవాలి. ఇందులో పురుషులు, మహిళలు అనే వ్యత్యాసం ఉండదు. వాస్తవంగా చూసినప్పుడు.. మహిళలు బీమా పాలసీలను తీసుకునేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదనే చెప్పాలి. దీనికి ప్రధాన కారణం.. కుటుంబంలో ఒకరికి బీమా ఉంటే చాలు అనే అపోహ. మారుతున్న ఆర్థిక అవసరాల నేపథ్యంలో కుటుంబంలోని రెండు కళ్లకూ బీమా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తక్కువ ప్రీమియానికే..

మహిళలకు అందించే బీమా పాలసీలకు బీమా సంస్థలకు కాస్త తక్కువ ప్రీమియాన్ని వసూలు చేస్తుంటాయి. మగవారితో పోలిస్తే మహిళల జీవితకాలం అధికం. ఈ కారణంతోనే బీమా సంస్థలు  మహిళలు- పురుషుల పాలసీల ప్రీమియానికి వ్యత్యాసం ఉంటుంది. టర్మ్‌ పాలసీ తీసుకోవడం వల్ల తక్కువ ప్రీమియానికి ఎక్కువ రక్షణ వచ్చేలా చూసుకోవచ్చు. చిన్న వయసులోనే బీమా పాలసీ తీసుకుంటే.. మరింత తక్కువ ప్రీమియానికే పాలసీ లభిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ ప్రీమియమూ అధికమవుతుందన్న విషయం తెలిసిందే.
అనుకోని సంఘటనలు జరిగినప్పుడు.. వారి కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు జీవిత బీమా పాలసీలు అక్కరకొస్తాయి. కుటుంబ నిర్వహణలో మహిళల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కుటుంబ ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారారు. అందుకే, ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న వారైనా.. గృహిణిగా ఇంటిని నిర్వహిస్తున్నా. వారికీ బీమా పాలసీ రక్షణ అవసరం ఉంది.

పెట్టుబడిగానూ..
చిన్న మొత్తాలను పొదుపు చేయడం, వాటిని అవసరాలకు ఉపయోగించుకోవడం భారతీయ మహిళలకు అలవాటే. బీమా పాలసీలు కేవలం రక్షణకే ఉపయోగపడకుండా.. పొదుపు, పెట్టుబడుల కోసమూ తీసుకునే వీలుంది. యూనిట్‌ ఆధారిత బీమా పాలసీలు (యులిప్‌), సంప్రదాయ ఎండోమెంట్‌, మనీ బ్యాక్‌ పాలసీల్లాంటివీ పరిశీలించవచ్చు. యులిప్‌లు.. బీమాతో పాటు, పెట్టుబడికీ ఉపయోగపడతాయి. సంప్రదాయ పాలసీలతో పోలిస్తే కాస్త మంచి రాబడినీ అందిస్తాయి. ఇలాంటి పాలసీలు దీర్ఘకాలంలో మంచి మొత్తాన్ని పొదుపు చేసేందుకు వీలు కల్పించడంతోపాటు, ఆర్థిక స్వేచ్ఛ సాధనలోనూ తోడ్పడతాయి. కేవలం ఉద్యోగం, వ్యాపారం చేస్తూ ఆర్జించే వారికే బీమా ఇస్తారనుకోవడం అపోహ. ఒంటరి మహిళలు, గృహిణులూ బీమా పాలసీను తీసుకునేందుకు వీలవుతుంది.

వారసత్వంగా ఇచ్చేందుకు..
ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో మహిళలు ఎంతో చురుకుగా ఉంటారు. వారి వారసులకు తమ వంతుగా ఏదైనా ఇవ్వాలనే కోరికా వారికి ఉంటుంది. ఇలాంటి వారు... హోల్‌ లైఫ్‌ పాలసీలను ఎంచుకోవచ్చు. దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఉపయోగపడటంతోపాటు, తర్వాత తరాలకు తన వంతుగా కొంత ఆస్తిని అందించేందుకు ఇవి తోడ్పడతాయి. ముఖ్యంగా ఒంటరి తల్లులు ఈ తరహా పాలసీలను ఎంచుకోవడం అవసరమనే చెప్పాలి. పాలసీ వ్యవధి తీరాక వచ్చే మొత్తంతో పిల్లలకు స్థిరమైన ఆదాయం లభించే ఏర్పాటు చేసుకొని, పిల్లల ప్రస్తుత, భవిష్యత్‌ ఖర్చులకు ఉపయోగపడేలా చూసుకోవచ్చు.
ఆర్జించే మహిళలు తమ కుటుంబ ఆదాయానికి తమ వంతు భాగస్వామ్యం అందిస్తూనే.. తమ ఆర్థిక ప్రణాళికలను ప్రత్యేకంగా సిద్ధం చేసుకోవాలి. పెట్టుబడులకు కొంత మొత్తం కేటాయించాలి. బీమా పాలసీలను ఎంచుకునేటప్పుడు దీర్ఘకాలంలో సంపదను సృష్టించడం, మంచి రాబడి రావడం, పన్ను పరమైన ప్రయోజనాలు తదితరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. దీనికోసం పొదుపు ఆధారిత పాలసీలను పరిశీలించాలి. ఒంటరి మహిళలు.. పొదుపు, పన్ను ప్రయోజనాలతోపాటు వ్యవధి తీరిన తర్వాత స్థిరమైన రాబడిని అందించే పాలసీలపై దృష్టి పెట్టాలి. రుణాలు, పిల్లల బాధ్యతలకు సరిపోయే మొత్తానికి బీమా పాలసీ ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వ్యక్తిగత అవసరాలు, ఆరోగ్య పరిస్థితులు, ఆర్థిక లక్ష్యాలు.. ఇవీ పాలసీ మొత్తాన్ని నిర్ణయించడంలో కీలకం. సరైన మొత్తానికి, తక్కువ ప్రీమియంతో పాలసీ ఇవ్వడంతోపాటు, మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న కంపెనీ నుంచి బీమా పాలసీని ఎంచుకోవాలి.

- అనుప్‌ సేత్‌, చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌, ఎడిల్‌వైజ్‌ టోకియో లైఫ్‌ ఇన్సూరెన్స్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని