ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు..ఫారం 16 లేకున్నా...

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఈ నెల 31. గత ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు.. ఆదాయం లభించిన మార్గాలను బట్టి సంబంధిత ఫారాల్లో రిటర్నులను సమర్పించాలి.

Updated : 29 Jul 2022 09:48 IST

ITR Filing: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేదీ ఈ నెల 31. గత ఆర్థిక సంవత్సరంలో పరిమితికి మించి ఆదాయం ఉన్నవారు.. ఆదాయం లభించిన మార్గాలను బట్టి సంబంధిత ఫారాల్లో రిటర్నులను సమర్పించాలి.

ఉద్యోగం చేస్తున్న వారికి యాజమాన్య సంస్థలు ఫారం-16ను జారీ చేస్తాయి. దీని ఆధారంగా రిటర్నులు సులభంగా దాఖలు చేయొచ్చు. కొంతమందికి ఈ ఫారం-16 అందకపోవచ్చు. ఇలాంటి వారు రిటర్నులు దాఖలు చేసేందుకు అవకాశం లేదా అనే అనుమానాలున్నాయి. రిటర్నులు సమర్పించేందుకు ఈ ఫారం అవసరం. అందులో పేర్కొన్న వివరాలు, 26ఏఎస్‌, ఐఏఎస్‌ తదితరాలను పోల్చి చూసుకొని, రిటర్నులు దాఖలు చేయాలి. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఫారం-16 లేకున్నా రిటర్నులను దాఖలు చేయొచ్చు.
వేతన వివరాలతో..
ఫారం-16 అందుబాటులో లేనప్పుడు యజమాని నుంచి అందుకున్న వేతన ధ్రువీకరణ ఆధారంగా ఐటీఆర్‌-1లో రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఆదాయంలో మీరు వాస్తవంగా చేసిన సెక్షన్‌ 80సీ పరిధిలోని పెట్టుబడులు, ఇంటి అద్దె, ఆరోగ్య బీమా పాలసీకి చెల్లించిన ప్రీమియం తదితర మినహాయింపులను క్లెయిం చేసుకోవచ్చు.
* ఆదాయపు పన్ను పోర్టల్‌ నుంచి ఫారం 26ఏఎస్‌, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మీ ఆదాయానికి సంబంధించిన వివరాలు అందులో కనిపిస్తున్నాయా చూసుకోండి.
ఈ అంశాలతో జాగ్రత్త...
ప్రస్తుతం ఐటీఆర్‌ ఫారాలు ముందే నింపి అందుబాటులో ఉంటున్నాయి. వీటిని ఒకసారి పరిశీలించడం తప్పనిసరి.
*పేరు, పుట్టిన తేదీ వివరాలను పాన్‌లోని సమాచారం ఆధారంగా తీసుకుంటారు. వీటిని మార్చడం సాధ్యం కాదు. చిరునామా, ఇ-మెయిల్‌, ఫోన్‌ నెంబరును మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. గతంలో మీరు దాఖలు చేసిన వివరాలు ఈసారీ ఇక్కడ కనిపిస్తాయి. మార్పులుంటే అప్‌డేట్‌ చేయాలి.
* వేతనం వివరాలకు సంబంధించి.. యాజమాన్యం వివరాలు, చిరునామా, టాన్‌ తదితరాలన్నీ కనిపిస్తాయి. ఫారం-16లో ఉన్న వివరాలతో ఇవి సరిపోవాలి. కొన్నిసార్లు ఇది కనిపించకపోవచ్చు. ఇలాంటప్పుడు మీరు సొంతంగా వీటిని నమోదు చేయాల్సి ఉంటుంది.
* ఇంటి రుణానికి చెల్లించే వడ్డీని నమోదు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంటిని అద్దెకు ఇచ్చి, మీరు వేరే చోట అద్దెకు ఉంటున్నప్పుడు.. ఇంటి రుణం వడ్డీతోపాటు, హెచ్‌ఆర్‌ఏనూ క్లెయిం చేసుకునే వీలుంటుంది. ఇలాంటప్పుడు మీ సొంతింటికి లభించిన ఇంటి అద్దెను ఆదాయంలో కలిపి చూపించాలి.
* ఇతర ఆదాయాలను ఒకసారి సరిగా చూసుకోండి. ముఖ్యంగా డివిడెండ్లు, పొదుపు ఖాతా, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ మొత్తాలను జాగ్రత్తగా నమోదు చేయండి. మీరు వాస్తవంగా పొందిన మొత్తానికీ, ఆదాయపు పన్ను రిటర్ను ఫారంలో చూపిస్తున్న దానికీ వ్యత్యాసం లేకుండా చూసుకోండి.
* కొన్నిసార్లు మీరు మినహాయింపు ధ్రువీకరణలు ఇచ్చినా.. ఫారం-16లో అవి నమోదు కాకపోవచ్చు. ముఖ్యంగా సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000లు ఐటీఆర్‌లో కనిపిస్తుందా చూసుకోండి. మీరు ఇచ్చిన మొత్తం మినహాయింపులన్నీ నమోదు కాలేదని అనుమానం ఉంటే.. సరైన మొత్తాన్ని ఐటీఆర్‌లో నమోదు చేయొచ్చు. అయితే, అవన్నీ మార్చి 31, 2022లోపు చేసిన పెట్టుబడులై ఉండాలి.
ఆదాయపు పన్ను రిటర్నులలో ప్రతి చిన్న విషయమూ ఎంతో కీలకం. చిన్న పొరపాటు చేసినా.. రిటర్నులను ఆమోదించకపోయే అవకాశం ఉంది.

గడువు తీరినా..
ఆదాయపు పన్ను రిటర్నుల గడువును పొడిగించే అవకాశం లేదని ఇప్పటికే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, గడువు తీరిన తర్వాత డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసే అవకాశం ఉంది. కానీ, దీనికి సెక్షన్‌ 234 ఎఫ్‌ ప్రకారం కొంత అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5లక్షల లోపు ఉన్న వారికి ఇది రూ.1,000. అంతకు మించి ఉన్నవారికి రూ.5,000 జరిమానా వర్తిస్తుంది. ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేని వారు.. స్వచ్ఛందంగా వాటిని సమర్పించవచ్చు. ఇలాంటివారికి గడువు దాటిన తర్వాతా ఎలాంటి అపరాధ రుసుము ఉండదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు