పదవీ విరమణ.. ప్రశాంతంగా సాగేలా

వెంకట్రావ్‌ 15 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. అప్పుడు వచ్చిన పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర పెట్టుబడులు ఆయనకు నెలనెలా మంచి మొత్తాన్నే అందించడం ప్రారంభించాయి. కాలక్రమేణా.. ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు తనకు

Updated : 19 Aug 2022 05:50 IST

వెంకట్రావ్‌ 15 ఏళ్ల క్రితం పదవీ విరమణ చేశారు. అప్పుడు వచ్చిన పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర పెట్టుబడులు ఆయనకు నెలనెలా మంచి మొత్తాన్నే అందించడం ప్రారంభించాయి. కాలక్రమేణా.. ఖర్చులు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు తనకు 75 ఏళ్లు వచ్చే నాటికి చూస్తే.. ఆ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదు. పెట్టుబడులపై వచ్చే వడ్డీ తగ్గడంతో రాబడి సరిపోవడం లేదు. ఇది ఒక్క వెంకట్రావ్‌ పరిస్థితే కాదు. పదవీ విరమణ చేసిన ఎంతో మంది ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులనే ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అనుభవాలు యువతకు ఒక ఆర్థిక పాఠం నేర్పుతున్నాయని చెప్పొచ్చు.

ఉద్యోగం నుంచి విరమణ పొందిన తర్వాత.. పెద్దగా ఖర్చులేముంటాయి.. చాలామంది అనుకునే ప్రశ్నే ఇది. ఉద్యోగం లేదా వ్యాపారం చేస్తూ సంపాదిస్తున్నన్ని రోజులూ అప్పటి గురించి ఆలోచించేవారే చాలామంది ఉంటారు. ఒక్కసారి ఆ ఆదాయం ఆగిపోయాక పరిస్థితులు ఎలా ఉంటాయన్న అంచనా కొంతమందికే ఉంటుంది. ఇలా ఊహించిన వారే విశ్రాంత జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు అవకాశం ఉంటుంది. 

తొందరగా ప్రారంభిస్తేనే..

60 ఏళ్లకు పదవీ విరమణ చేసేముందు దాదాపు 35 ఏళ్లపాటు ఎంతో కష్టించి డబ్బు ఆర్జిస్తారు. పెరుగుతున్న వైద్య ప్రమాణాల నేపథ్యంలో ఒక వ్యక్తి సులువుగా 90 ఏళ్లకు పైగానే జీవిస్తారని అంచనా. అంటే.. పదవీ విరమణ తర్వాత మరో 30 ఏళ్లపాటు క్రమం తప్పకుండా వేతనం రాదు. కానీ, ఆర్థిక అవసరాలు తీరాలి. మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్నీ గమనిస్తూ ఉండాలి. 40 ఏళ్ల వ్యక్తికి నెలకు రూ.లక్ష ఖర్చవుతుందనుకుంటే.. అతనికి 60 ఏళ్లు వచ్చే నాటికి 5 శాతం ద్రవ్యోల్బణంతో లెక్కిస్తే.. రూ.2.65 లక్షలు కావాలి. 80 ఏళ్ల నాటికి రూ.7 లక్షలు, 90 ఏళ్ల నాటికి రూ.11.5 లక్షలు అవసరం. అంటే.. 50 ఏళ్ల కాలంలో ఖర్చులు 11 రెట్లు పెరిగే ఆస్కారం ఉందన్నమాట. చూడ్డానికి ఇవి కాస్త అధిక మొత్తం అనిపించవచ్చు. కానీ, ఏటా ద్రవ్యోల్బణం 5 శాతానికి మించే పెరుగుతుందన్న వాస్తవాన్ని మనం ఇక్కడ మర్చిపోవద్దు. 

దీర్ఘకాలంలో..

తొందరగా పెట్టుబడులు ప్రారంభించడంతోపాటు, వాటిని దీర్ఘకాలం కొనసాగించడమూ ముఖ్యమే. అప్పుడే చక్రవడ్డీ ప్రభావం వల్ల మీ డబ్బు ద్రవ్యోల్బణాన్ని అధిగమిస్తూ వృద్ధి చెందుతుంది. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి నెలకు క్రమం తప్పకుండా రూ.10వేలు పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్లాడనుకుందాం. వార్షిక సగటు రాబడి 12 శాతం అంచనాతో.. అతనికి 60 ఏళ్లు వచ్చే నాటికి చేతిలో దాదాపు రూ.5 కోట్ల నిధి ఉండేందుకు అవకాశం ఉంది. ఒకవేళ ఏటా ఈ క్రమానుగత పెట్టుబడిని 5శాతం చొప్పున పెంచుకుంటూ వెళ్తే రూ.8 కోట్లు జమ అవుతాయి. 

పదవీ విరమణ నాటికి చేతిలో కావాల్సినంత మొత్తం ఉండేలా ఏర్పాటు చేసుకోవడమే ఆర్థిక ప్రణాళికలో ముఖ్యం. సంపాదన ఆగిపోయినప్పటి నుంచి ఈ మొత్తం కనీసం 30 ఏళ్లపాటు మనకు భరోసానివ్వాలి. వచ్చిన రాబడికి పన్ను భారం లేకుండా.. ఆదాయం పొందే మార్గాలను అనుసరించాలి. క్రమానుగతంగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం వల్ల రాబడి అందుకుంటూనే.. అవసరాలు తీర్చుకునే వీలు కలుగుతుంది.

- సతీశ్‌ ఫ్రభు, ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు