ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా...

పెరుగుతున్న ద్రవ్యోల్బణం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. గత కొన్నాళ్లుగా మన దేశంలో ఇది 6 శాతానికి మించే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులు ద్రవ్యోల్బణానికి మించి రాబడి సాధించేలా చూసుకోవాలి.

Published : 30 Sep 2022 00:35 IST

పెరుగుతున్న ద్రవ్యోల్బణం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. గత కొన్నాళ్లుగా మన దేశంలో ఇది 6 శాతానికి మించే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మదుపరులు తమ పెట్టుబడులు ద్రవ్యోల్బణానికి మించి రాబడి సాధించేలా చూసుకోవాలి. అప్పుడే మున్ముందు పెరిగే ఖర్చులను తట్టుకునేందుకు వీలవుతుంది. మరి, ఇందుకోసం ఏం చేయాలి?

చాలామంది రాబడిని సాధించే క్రమంలో ఎదురైన పథకాలన్నింటిలో మదుపు చేస్తుంటారు. దీర్ఘకాలిక ప్రయోజనాలకన్నా.. స్వల్పకాలిక లాభాలనే నమ్ముతారు. దీనివల్ల బలహీనమైన పెట్టుబడుల జాబితా తయారవుతుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే పెట్టుబడులను ఎంచుకునేందుకు ఒక నిర్ణీత మార్గం అంటూ ఏమీ లేదు. కానీ, పెట్టుబడులను దాని ప్రభావం నుంచి తప్పించుకునేందుకు మాత్రం కొన్ని వ్యూహాలను అనుసరించాలి.
వైవిధ్యమే రక్ష.. ఒక్కో పెట్టుబడి పథకంపై ద్రవ్యోల్బణ ప్రభావం ఒక్కో రీతిన ఉంటుంది. మదుపరులు దీన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. మార్కెట్లో హెచ్చుతగ్గులు తీవ్రంగా ఉన్నప్పుడు భిన్న రకాల పెట్టుబడులను ఎంచుకోవడం ద్వారా నష్టభయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు. ఒకే భౌగోళిక ప్రాంతంలో కాకుండా.. వివిధ దేశాల మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టాలి. ఏదైనా సరే.. ద్రవ్యోల్బణ ఒత్తిడిని తగ్గించి, తగిన రాబడిని అందించేలా ఉండాలి. అదే సమయంలో మదుపరులు నష్టభయాన్ని భరించే సామర్థ్యం, ఆర్థిక లక్ష్యాలను విస్మరించకూడదు. నష్టభయం అధికంగా ఉండే పథకాలు అందరికీ ఒకే విధంగా సరిపోకపోవచ్చు.

విలువైన లోహాల్లో... చరిత్రను గమనిస్తే.. బంగారం, వెండి వంటి లోహాలు ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని నిలబడతాయని గమనించవచ్చు. ఈ రెండింటికీ భారతీయ సమాజంతో మానసికంగానూ, ఆర్థికంగానూ విడదీయలేని బంధం ఉంది. మదుపరులు గోల్డ్‌, సిల్వర్‌ ఈటీఎఫ్‌లను తమ పెట్టుబడుల్లో భాగంగా పరిశీలించవచ్చు. ఈక్విటీ, డెట్‌ పథకాల పనితీరుతో సాధారణంగా వీటికి సంబంధం ఉండదు. ఆర్థిక వ్యవస్థ పనితీరు సరిగా లేనప్పుడూ ఈ లోహాలను పరిశీలించవచ్చు.

ఈక్విటీ మార్గంలో.. అధిక రాబడి ఆర్జించినప్పుడే ద్రవ్యోల్బణాన్ని తట్టుకోగలం. దీనికి ఈక్విటీలు ఒక మార్గం. స్టాక్‌ మార్కెట్ల పనితీరు గురించి పూర్తి అవగాహన ఉండి, ఎప్పటికప్పుడు గమనిస్తూ, పెట్టుబడులను మార్చగలిగే వీలున్నప్పుడు నేరుగా షేర్లను ఎంపిక చేసుకోవచ్చు. కేవలం కొన్ని కంపెనీల షేర్లను ఎంచుకొని, వాటిని పోర్ట్‌ఫోలియోకు జత చేస్తూ వెళ్తామంటే కుదరదు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకొని పెట్టుబడులను కొనసాగించాలి. ప్రత్యామ్నాయంగా మ్యూచువల్‌ ఫండ్లను పరిశీలించవచ్చు. క్రమానుగత విధానంలో మదుపు చేయడం ద్వారా దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆర్జించేందుకు వీలవుతుంది. ఖర్చులను నియంత్రణలో ఉంచుకోవడం, కుటుంబ బడ్జెట్‌ను పాటించడం, పొదుపు, మదుపు పెంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అనుసరించాల్సిన వ్యూహం. అప్పుడే ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి కాస్తయినా తప్పించుకోవచ్చు.

- అశ్విన్‌ పత్ని, హెడ్‌ ప్రొడక్ట్స్‌, యాక్సిస్‌ ఏఎంసీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని