అన్ని రకాల షేర్లలో

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మల్టీక్యాప్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 20. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000.

Updated : 07 Oct 2022 06:38 IST

ఎల్‌ఐసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక కొత్త మల్టీక్యాప్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ఎల్‌ఐసీ ఎంఎఫ్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 20. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం కింద సమీకరించిన నిధుల్లో 25 శాతం చొప్పున లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లలో పెట్టుబడికి కేటాయిస్తారు. మిగిలిన 25 శాతం సొమ్ము ఫండ్‌ మేనేజర్‌ విచక్షణ మేరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పత్రాల్లోనే పెట్టుబడులు పెడతారు. నిఫ్టీ 500 మల్టీ క్యాప్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకానికి ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ పథకానికి యోగేశ్‌ పటేల్‌ ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. బుల్‌ మార్కెట్‌లో సహజంగానే మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరగతులకు చెందిన షేర్లు ఆకర్షణీయమైన ప్రతిఫలాన్ని ఆర్జిస్తాయి. ఆ కోణంలో చూస్తే మల్టీ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఆకర్షణీయమే. సమీప భవిష్యత్తులో లార్జ్‌క్యాప్‌ షేర్లుగా పెరిగే అవకాశం ఉన్న మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ కంపెనీలను గుర్తించి, పెట్టుబడులు పెట్టే అవకాశం ఇలాంటి పథకాలకు ఉంటుంది.


రవాణా సేవల రంగాల్లో..

ఐడీఎఫ్‌సీ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఫండ్‌ అనే థీమ్యాటిక్‌ తరగతికి చెందిన పథకాన్ని ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 18న ముగుస్తుంది. కనీస పెట్టుబడి రూ.5,000. మన దేశంలో ఎంతో వేగంగా విస్తరిస్తున్న రవాణా, సరకు నిర్వహణ-పంపిణీ విభాగాలకు చెందిన కంపెనీలపై పెట్టుబడులు పెట్టడం ద్వారా అధిక లాభాలు ఆర్జించడం ఈ పథకం ప్రధాన మదుపు వ్యూహం. దాదాపు 16 రకాలైన రవాణా, సరకు రవాణా అనుబంధ విభాగాలకు చెందిన కంపెనీలను ఎంపిక చేసుకొని, పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. నిఫ్టీ ట్రాన్స్‌పోర్టేషన్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఇండెక్స్‌ గత 11 ఏళ్ల కాలంలో ఎనిమిదేళ్లపాటు నిఫ్టీ 500 సూచీకంటే మెరుగైన పనితీరు ప్రదర్శించింది. ఈ కొత్త పథకానికి డేలిన్‌ పింటో ఫండ్‌ మేనేజర్‌గా ఉంటారు. ‘బాటమ్‌-అప్‌’ పద్ధతిలో కంపెనీలను ఎంచుకొని, పోర్ట్‌ఫోలియో సిద్ధం చేస్తారు. దేశీయ మార్కెట్‌కు చెందిన కంపెనీలకే మెజార్టీ పెట్టుబడులు కేటాయిస్తారు. దాదాపు 20 శాతం నిధులను విదేశాల్లోని కంపెనీలపై పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని