పండగల వేళ.. ఆచితూచి..

దసరా వేడుకలు ముగిశాయి. త్వరలోనే దీపావళి వెలుగులు రానున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా కొనుగోళ్లపై  రాయితీలు, బహుమతులు ఆకర్షిస్తున్నాయి. అవసరం ఉన్న వస్తువులు కొనడానికి వీటిని వాడుకోవచ్చు. కానీ, అనవసరంగా ఖర్చు చేయడం మాత్రం ఆర్థిక ప్రణాళికకు ముప్పుగా మారుతుంది.

Published : 07 Oct 2022 00:53 IST

దసరా వేడుకలు ముగిశాయి. త్వరలోనే దీపావళి వెలుగులు రానున్నాయి. మరోవైపు ఎక్కడ చూసినా కొనుగోళ్లపై  రాయితీలు, బహుమతులు ఆకర్షిస్తున్నాయి. అవసరం ఉన్న వస్తువులు కొనడానికి వీటిని వాడుకోవచ్చు. కానీ, అనవసరంగా ఖర్చు చేయడం మాత్రం ఆర్థిక ప్రణాళికకు ముప్పుగా మారుతుంది.

కొత్త కారు కొనాలి.. ఇంటికి మరమ్మతు చేయించాలి. ఇలా పండగల వేళ ఎన్నో అనుకుంటాం. అదే సమయంలో ఇతరుల ప్రభావానికీ గురవుతుంటాం. మీకు అవసరం ఏమిటి అనేది ముందుగా గుర్తించి, దానికి తగ్గట్టుగా మీ ప్రణాళిక ఉండాలి. దాన్ని పూర్తిగా ఆచరణలో పెట్టాలి. అంతేకానీ, తాత్కాలిక ఆకర్షణలు, అవసరాల కోసం డబ్బును వృథా చేయరాదు. కారు కొనాలని అనుకుంటే దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఎంత రుణం తీసుకోవాలి? చేతి నుంచి ఎంత చెల్లించాలి? వాయిదాలు చెల్లించేందుకు వెసులుబాటు ఏ మేరకు ఉంది.. రుణం ఏ బ్యాంకులో తీసుకోవాలి.. ఇలా ఎన్నో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. కొత్త ఇల్లు కొనుగోలు నిర్ణయమూ అంతే. ఇప్పటికిప్పుడు సాధ్యం కాదనే వాస్తవాన్ని గుర్తించాలి.

‘అవసరం లేనివి ఇప్పుడు కొంటే.. అవసరమైనవి అమ్ముకోవాల్సి వస్తుంది’ వారెన్‌ బఫెట్‌ చెప్పిన ఈ మాటను ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కేవలం తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి, మనకు అవసరం లేని వస్తువులను కొంటే.. వాటితో ఇంటిలో స్థలం నిండటం తప్ప పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. మీకు నిజంగా అవసరం ఉన్న వస్తువును మీరు ఇప్పటికే తీసుకొని ఉంటారు. పాత వస్తువు పాడైనప్పుడు లేదా దాన్ని మార్పిడి చేసి, కాస్త మెరుగైన దాన్ని కొనడానికి ఈ రాయితీలను ఉపయోగించుకోవచ్చు. ఏది కొనాలి.. ఏది అవసరం లేదు అనేది మీరొక్కరే కాకుండా.. కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకోండి. దీనివల్ల అనవసర ఖర్చు చేయకుండా చూసుకోవచ్చు.

అడగడమే ఆలస్యం క్షణాల్లో అప్పులిస్తున్న ఫిన్‌టెక్‌ సంస్థలు ఎన్నో. అప్పు తీసుకోవడం సులభం. కానీ, దాన్ని తీర్చడానికి ఎన్నో లెక్కలు అవసరం. రూపాయి అవసరం లేకుండా కావాల్సినది కొనేందుకు వెసులుబాటునిచ్చే వాయిదాల పద్ధతులు, క్రెడిట్‌ కార్డులు ఉండనే ఉన్నాయి. వాస్తవంగా అవసరం ఉన్నవి కొనేందుకు వీటన్నింటిలో మనకు నచ్చిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. కానీ, ఏదో కొనాలి కాబట్టి.. అన్నట్లు వ్యవహరిస్తే.. చిక్కులు తప్పవు.

పండగల వేళ వచ్చే బోనస్‌లు, ఇతర బహుమతులను అర్థవంతంగా ఉపయోగించుకోండి. ఖరీదైన రుణాన్ని చెల్లించేందుకు వాడుకోవచ్చు. దీనివల్ల మీకు ఏడాదంతా ఆర్థిక ప్రశాంతత లభిస్తుంది. టర్మ్‌ పాలసీ లేదా ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేందుకు వీటిని వాడుకోవచ్చు. ఈ మొత్తాలను షార్ట్‌ టర్మ్‌ డెట్‌ మ్యూచువల్‌ ఫండ్ల లాంటి వాటిలో మదుపు చేయొచ్చు. వచ్చే ఏడాది ఇదే మొత్తంతో మీకు కావాల్సిన వస్తువు కొనుగోలు చేయొచ్చు. అత్యవసర నిధి తక్కువగా ఉంటే ఈ నిధిని దానికి మళ్లించండి. ఆర్థికంగా విజయం సాధించాలంటే.. వృథా వ్యయాలను నియంత్రించే మంత్రం నేర్చుకోవాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని