లాభాలను కోల్పోవద్దు...

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, స్థిరాదాయం అందించే పథకాలు.. ఒకప్పుడు పెట్టుబడి పథకాలు అనగానే గుర్తుకొచ్చేవి ఇవే. కానీ, కాలం మారింది. ఆధునిక తరానికి స్థిరంగా రాబడినిచ్చే పథకాలపై అంతగా ఆసక్తి ఉండటం లేదు. అలా మదుపు చేస్తే... ఇలా లాభాలు కనిపించాలని అనుకుంటున్నారు.

Published : 07 Oct 2022 00:53 IST

ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బంగారం, స్థిరాదాయం అందించే పథకాలు.. ఒకప్పుడు పెట్టుబడి పథకాలు అనగానే గుర్తుకొచ్చేవి ఇవే. కానీ, కాలం మారింది. ఆధునిక తరానికి స్థిరంగా రాబడినిచ్చే పథకాలపై అంతగా ఆసక్తి ఉండటం లేదు. అలా మదుపు చేస్తే... ఇలా లాభాలు కనిపించాలని అనుకుంటున్నారు. అందుకే దూకుడుగా పెట్టుబడులు పెడుతున్నారు. అదే సమయంలో పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ.. సమతౌల్యం చేసుకోవడం మర్చిపోతున్నారు. ఫలితంగా ఆశించిన స్థాయిలో లాభాలను అందుకోలేకపోతున్నారు.

కొవిడ్‌ తర్వాత స్టాక్‌ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్న కొత్త మదుపరులు బాగా పెరిగారు. డీమ్యాట్‌ ఖాతాల సంఖ్యా ఈ రెండేళ్ల కాలంలో విపరీతంగా పెరిగింది. యువత ఆర్థిక లక్ష్యాలు వారి తల్లిదండ్రులతో పోలిస్తే భిన్నంగా ఉంటున్నాయి. వారు తొందరగా ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నారు. దీంతో నష్టభయం ఉన్నప్పటికీ.. అధిక రాబడులను అందించే పథకాలవైపే వారు మొగ్గు చూపిస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా తమ పెట్టుబడులు ఉండాలని అనుకోవడంలో తప్పు లేదు. అదే సమయంలో వీటిలో మదుపు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది.

పరిమితం చేసుకుంటూ..
చిన్న వయసులో ఉన్న మదుపరులు అధిక నష్టభయం భరించగలరు. కాబట్టి, ఈక్విటీ మార్కెట్లే లక్ష్యంగా తమ పెట్టుబడులను కేటాయిస్తుంటారు. స్టాక్‌ మార్కెట్లో ఉండే అనిశ్చితిని దృష్టిలో పెట్టుకొని, ఈక్విటీలతోపాటు ఇతర పెట్టుబడి పథకాలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మొత్తం పెట్టుబడులు ఈక్విటీల్లోనే ఉన్నప్పుడు.. మార్కెట్‌ పతనం అయితే.. పెద్ద మొత్తంలో నష్టాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది. కాబట్టి, నష్టభయం ఉన్న వాటితోపాటు, కాస్త సురక్షిత పథకాల్లోనూ కొంత మదుపు చేయడం ఎప్పుడూ మేలు. దీనికోసం కొన్ని చిట్కాలు పాటించాలి.

* మీ ఆర్థిక లక్ష్యాలేమిటి అనేది నిర్ణయించుకోండి. అందుకు అనుగుణంగా పెట్టుబడి పథకాలను ఎంపిక చేసుకోండి.
* ఈక్విటీ, డెట్‌, స్థిరాదాయ పథకాలు, బంగారం ఇలా వైవిధ్యం పాటిస్తూ పెట్టుబడులను నిర్వహించండి.
* దీర్ఘకాలిక వ్యూహంతో.. క్రమం తప్పకుండా పెట్టుబడులను కొనసాగించండి.
* మీ పెట్టుబడుల్లో కొంత వెంటనే నగదుగా మార్చుకునే వీలుండేలా ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో ఇది ఉపయోగపడాలి.
* పెట్టుబడుల పనితీరును ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండాలి. కనీసం ఏడాదికోసారైనా అవి అందిస్తున్న రాబడిని పరిశీలించాలి.
* మీరు ఆశించిన రాబడిని ఆర్జించినప్పుడు వాటిలో నుంచి పాక్షికంగా కొంత మేరకు వెనక్కి తీసుకోవాలి. మీ పెట్టుబడుల కేటాయింపు శాతాలకు అనుగుణంగా వాటిని సమతౌల్యం చేయాలి.

పెట్టుబడులను సమీక్షించుకోవడం ద్వారా ఆర్థిక లక్ష్యాల సాధనకు సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు. ‘మదుపు చేయడం- మర్చిపోవడం’ అని కాకుండా.. కాలానుగుణంగా పథకాల్లో మార్పులు, చేర్పులు చేసినప్పుడే మంచి ఫలితాలు సాధించగలం.

- అమిత్‌ జైశ్వాల్‌, చీఫ్‌-డైరెక్ట్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని