IPPB: రూ.396తో రూ.10 లక్షల బీమా

ప్రమాదం చెప్పి రాదు... త్రుటిలో తప్పితే మళ్లీ పుట్టినట్టే. కాని తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణహాని జరిగితే.. శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే... ఆ లోటు తీర్చడం ఎవరితరం కాదు. ప్రమాదానికి గురైన వ్యక్తిమీద ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుంది.

Updated : 24 Nov 2022 10:25 IST

ఐపీపీబీలో ప్రమాద బీమా పాలసీలు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రమాదం చెప్పి రాదు... త్రుటిలో తప్పితే మళ్లీ పుట్టినట్టే. కాని తప్పించుకోలేని పరిస్థితుల్లో ప్రాణహాని జరిగితే.. శాశ్వత అంగవైకల్యం ఏర్పడితే... ఆ లోటు తీర్చడం ఎవరితరం కాదు. ప్రమాదానికి గురైన వ్యక్తిమీద ఆధారపడిన కుటుంబం రోడ్డున పడుతుంది. ఇలాంటి సమయంలో ఆదుకునేందుకు రెండు పాలసీలున్నాయి. ఒక పాలసీ ప్రీమియం రూ.396 కాగా, మరో పాలసీ ప్రీమియం రూ.399. ఈ రెండింటిలో ఏది తీసుకున్నా రూ.10 లక్షల బీమా ఆ కుటుంబానికి అందుతుంది. ఐపీపీబీ (ఇండియా తపాలా పోస్టు పేమెంట్‌ బ్యాంకు)ద్వారా ఈ పాలసీలు పొందవచ్చు. టాటా గ్రూప్‌ యాక్సిడెంటల్‌ గార్డు పాలసీ, బజాజ్‌ అలియాంజ్‌ సంస్థలు అందజేస్తున్న ఈ పాలసీలను తపాలా శాఖ ద్వారా ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. 16 నుంచి 65 ఏళ్ల వయసు వరకూ ఈ పాలసీలో చేరవచ్చు. ఇండియన్‌ పోస్టు పేమెంట్‌ బ్యాంకులో ఖాతా ఉన్నవారు  అర్హులు. ఈ బీమాను తీసుకోవాలనుకుంటే.. నేరుగా ఐపీపీబీ శాఖలున్న తపాలా కార్యాలయాలకు గాని, లేదంటే గ్రూపుగా చేరాలనుకుంటే తపాలా సిబ్బందే నేరుగా వస్తారని తపాలా అధికారులు చెప్పారు.

* టాటా గ్రూప్‌ యాక్సిడెంటల్‌ గార్డు పాలసీ(రూ.399)లో పాలసీదారుడు ఏదైనా ప్రమాదంలో చనిపోయినా.. శాశ్వత అంగవైకల్యం వచ్చినా, పక్షవాతం సంభవించినా రూ.10 లక్షలు ఆ వ్యక్తి పేర్కొన్న నామినీకి అందుతుంది. చదువుకొనే ఇద్దరు పిల్లలుంటే రూ.లక్ష రుణం కూడా ఇస్తారు. 24 గంటలకు పైగా ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటే రూ.60 వేల వరకూ బిల్లు చెల్లిస్తారు. 24 గంటలలోపు ఆసుపత్రి నుంచి వైద్యం తీసుకుని బయటకు వచ్చేస్తే రూ.30 వేలు లేదా వాస్తవ బిల్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువ అయితే అది ఇస్తారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి లేదా ఆసుపత్రికి కుటుంబ సభ్యులు చేరుకోవడానికి గరిష్ఠంగా రూ.25 వేలు లేదా బిల్లు.. ఈ రెండింటిలో ఏది తక్కువైతే అది ఇస్తారు. ఒక వేళ మృతి చెందితే రూ.5 వేలు అంత్యక్రియలకు అందిస్తారు.

* రూ.396 చెల్లించి బజాజ్‌ అలియాంజ్‌ ద్వారా ప్రమాద బీమా తీసుకుంటే ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే వారి కుటుంబ సభ్యులకు రూ.10లక్షల బీమా సొమ్ము అందుతుంది. బజాజ్‌ అలియాంజ్‌లో అయితే ప్రమాదం ఎలా జరిగినా బీమా మొత్తం అందుతుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని