ఆ పాలసీలు సరికొత్తగా...

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రజాదరణ ఉన్న రెండు టర్మ్‌ పాలసీలు టెక్‌ టర్మ్‌, న్యూ జీవన్‌ అమర్‌ పాలసీలను సరికొత్తగా విడుదల చేసింది.

Published : 25 Nov 2022 00:10 IST

భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) ప్రజాదరణ ఉన్న రెండు టర్మ్‌ పాలసీలు టెక్‌ టర్మ్‌, న్యూ జీవన్‌ అమర్‌ పాలసీలను సరికొత్తగా విడుదల చేసింది. పాత పాలసీలను రద్దు చేసి, వాటి స్థానంలో కొత్త నిబంధనలతో తిరిగి అందుబాటులోకి తెచ్చినట్లు ఎల్‌ఐసీ తెలిపింది. ఇప్పటికే ఈ పాత పాలసీలు తీసుకున్న వారికి ఎలాంటి ఇబ్బందీ ఉండదని పేర్కొంది.

టెక్‌ టర్మ్‌: పూర్తి రక్షణకే పరిమితమయ్యే ఈ టర్మ్‌ పాలసీని ఆన్‌లైన్‌లో తీసుకునేందుకు వీలుంటుంది. పాలసీదారుడికి ఏదైనా జరిగినప్పుడు నామినీకి పరిహారం లభిస్తుంది. వ్యవధి తీరిన తర్వాత ప్రీమియం వెనక్కి లభించదు. లెవల్‌ సమ్‌ అస్యూర్డ్‌, ఇంక్రీజింగ్‌ సమ్‌ అస్యూర్డ్‌ ఆప్షన్లతో ఇది లభిస్తోంది. కనీస విలువ రూ.50లక్షలు. గరిష్ఠ పరిమితి లేదు. ఏక ప్రీమియం లేదా వ్యవధి మొత్తం, పరిమిత కాలానికి ప్రీమియం చెల్లించవచ్చు. యాక్సిడెంటల్‌ బెనిఫిట్‌ రైడర్‌ను జోడించుకునే వీలుంది.

న్యూ జీవన్‌ అమర్‌: ఇదీ పూర్తి రక్షణకే పరిమితమైన టర్మ్‌ పాలసీ. దీన్ని ఏజెంట్ల ద్వారా తీసుకోవచ్చు. కనీస బీమా విలువ రూ.25లక్షలు. గరిష్ఠ పరిమితి లేదు. పాలసీ వ్యవధి 10-40 ఏళ్లు. 18 నుంచి 65 ఏళ్ల లోపు వారు ఈ పాలసీని ఎంచుకోవచ్చు. యాక్సిడెంట్‌ బెనిఫిట్‌ రైడర్‌ను ప్రాథమిక పాలసీకి అనుబంధంగా తీసుకోవచ్చు.

ఈ రెండు పాలసీలూ.. 18-65 ఏళ్ల వారు తీసుకోవచ్చు. పాలసీల వ్యవధి 10 నుంచి 40 ఏళ్లు. మహిళలకు ప్రీమియంలో ప్రత్యేక రాయితీని అందిస్తోంది.


బోనస్‌ 5 రెట్ల వరకూ..

రోగ్య బీమా పాలసీలో వినూత్న ప్రయోజనాలను అందిస్తూ కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఈ కేర్‌ సుప్రీమ్‌ను పాలసీ వ్యక్తిగతంగానూ, కుటుంబం అంతటికీ వర్తించేలా తీసుకోవచ్చు. అయిదేళ్లలో క్యుములేటివ్‌ బోనస్‌ సూపర్‌ కింద పాలసీ విలువ 5 రెట్ల వరకూ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేసే వారికి వెల్‌నెస్‌ బెనిఫిట్‌ కింద పునరుద్ధరణ ప్రీమియంలో 30 శాతం వరకూ రాయితీనిస్తుంది. పాలసీలో ఉన్న వారందరికీ వార్షిక ఆరోగ్య పరీక్షలు చేయించుకునే వీలును కల్పిస్తుంది. ఈ పాలసీని 18 ఏళ్లు దాటిన వారెవరైనా సొంతంగా తీసుకోవచ్చు. పిల్లలను పాలసీల్లో చేర్పించేందుకు వారికి 90 రోజుల వయసు ఉండాలి. గరిష్ఠంగా పాలసీ ప్రవేశ వయసు 60. జీవితాంతం వరకూ పునరుద్ధరణకు వీలుంది. ఏడాది, 2, 3 ఏళ్ల వ్యవధికి పాలసీని తీసుకోవచ్చు. ముందస్తు వ్యాధులకు 48 నెలల పాటు మినహాయింపు ఉంటుంది. ఆయుష్‌తోపాటు ఇతర చికిత్సలకూ పరిహారం లభిస్తుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని