స్థిర రాబడి కోసం

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఇటీవలి కాలంలో వరుసగా ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ పథకాలు (ఎఫ్‌ఎంపీ) తీసుకొస్తోంది. ఈ కోవలోనే 366 రోజుల కాల వ్యవధితో మరో ఎఫ్‌ఎంపీ పథకాన్ని తాజాగా ఆవిష్కరించింది.

Updated : 06 Jan 2023 02:16 IST

స్థిర రాబడి కోసం

ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్‌ ఇటీవలి కాలంలో వరుసగా ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ పథకాలు (ఎఫ్‌ఎంపీ) తీసుకొస్తోంది. ఈ కోవలోనే 366 రోజుల కాల వ్యవధితో మరో ఎఫ్‌ఎంపీ పథకాన్ని తాజాగా ఆవిష్కరించింది. ఎస్‌బీఐ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎంపీ) సిరీస్‌ -75 (366 రోజులు) అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 9. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. అందువల్ల ఈ పథకంలో పెట్టిన పెట్టుబడిని కాల పరిమితి ముగిసే వరకూ వెనక్కి తీసుకోవడానికి కుదరదు. ఈ పథకం పనితీరును ‘క్రిసిల్‌ షార్ట్‌ టర్మ్‌ బాండ్‌ ఫండ్‌ ఇండెక్స్‌’తో పోల్చి చూస్తారు. రంజనా గుప్తా ఫండ్‌ మేనేజర్‌. వడ్డీ రేట్లు ప్రస్తుతం కొంత ఆకర్షణీయంగా ఉన్న విషయం విదితమే. అందువల్ల ఎఫ్‌ఎంపీ పథకాల్లో గతం కన్నా మెరుగైన ప్రతిఫలం కనిపిస్తోందని పెట్టుబడి నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందుకోవాలని అనుకునే మదుపరులకు ఈ తరహా పథకాలు సరిపోతాయి. నష్టభయం లేని, స్థిరమైన ప్రతిఫలం లభించే పథకంగా దీన్ని భావించవచ్చు.



అధిక వడ్డీ లభించేలా

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ ‘యాక్సిస్‌ క్రిసిల్‌ ఐబీఎక్స్‌ 50-50 గిల్ట్‌ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ జూన్‌ 2028 ఇండెక్స్‌ ఫండ్‌’ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. పేరులోనే ఉన్నట్లు క్రిసిల్‌ ఐబీఎక్స్‌ 50-50 గిల్ట్‌ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ ఇండెక్స్‌ ఉన్న పత్రాలపై ఈ పథకం సమీకరించిన నిధులను పెట్టుబడి పెడుతుంది. ఇందులో ప్రధానంగా జీ-సెక్‌లు, ఇతర ప్రభుత్వ రుణ పత్రాలు ఉంటాయి. అధిక వడ్డీ రేటు లభించడంతోపాటు, తక్కువ క్రెడిట్‌ రిస్కు ఉన్న పథకంగా దీన్ని యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అభివర్ణిస్తోంది. ఈ పథకం గడువు 2028 జూన్‌ 30 నాటికి తీరిపోతుంది. దీనికి ఫండ్‌ మేనేజర్లుగా కౌస్తుభ్‌ సూలే, హార్దిక్‌ షా వ్యవహరిస్తారు. ఈ తరహా పెట్టుబడులపై 7.5 శాతం వరకూ ప్రతిఫలం కనిపిస్తోంది. ఫండ్‌ నిర్వహణ వ్యయాలు స్వల్పంగానే ఉంటాయి. ప్యాసివ్‌ మేనేజ్‌మెంట్‌ పథకం కాబట్టి, ఫండ్‌ మేనేజర్‌ విచక్షణ తక్కువగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని