తొలి జీతంతో... ఓ పాలసీ

విద్యాభ్యాసం పూర్తి చేసి, కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు ఎంతో  ఆనందంగా ఉంటుంది. తొలి జీతం అందుకున్న క్షణాలు అపురూపంగా ఉంటాయి. ఈ డబ్బుతో మీకు ప్రత్యేకమైన వారికి బహుమతులు ఇవ్వొచ్చు.

Updated : 17 Mar 2023 10:20 IST

విద్యాభ్యాసం పూర్తి చేసి, కొత్తగా ఉద్యోగంలో చేరినపుడు ఎంతో  ఆనందంగా ఉంటుంది. తొలి జీతం అందుకున్న క్షణాలు అపురూపంగా ఉంటాయి. ఈ డబ్బుతో మీకు ప్రత్యేకమైన వారికి బహుమతులు ఇవ్వొచ్చు. స్నేహితులతో సంబరాలు చేసుకోవచ్చు. ఇలా విలాసవంతమైన ఖర్చులకు అంతు ఉండదు. కానీ, జీవితంలో సాధించాల్సిన ఎన్నో లక్ష్యాలకు ఇది ఆరంభం. భవిష్యత్‌లో మీకు పెద్ద ప్రణాళికలు ఉంటాయి. వీటన్నింటినీ చేరుకునే క్రమంలో ఎన్నో దశలు దాటాల్సి ఉంటుంది. కాబట్టి, మొదటి వేతనం మీ బ్యాంకు ఖాతాలో జమ కాగానే మీరు చేయాల్సిన పనేమిటో తెలుసా? ఒక సాధారణ టర్మ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవడం.

ప్పుడే బీమా ఎందుకు? ఉద్యోగంలో చేరిన యువత నుంచి సాధారణంగా ఎదురయ్యే ప్రశ్న ఇదే. కానీ, చిన్న వయసులోనే బీమా పాలసీ తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం లభిస్తుందనేది వాస్తవం.

ఆర్థిక క్రమశిక్షణ...

మంచి అలవాటును ప్రారంభించేందుకు ప్రత్యేక సమయం అంటూ ఏమీ ఉండదు. ఆర్థిక విషయాల సంగతికి వస్తే.. ఎంత త్వరగా ప్రారంభిస్తే.. అంత తొందరగా ఆర్థిక స్వేచ్ఛ లభిస్తుంది. మీ మొదటి జీతాన్ని టర్మ్‌ ప్లాన్‌పై పెట్టుబడి పెట్టడం ద్వారా ఆర్థిక భద్రత దిశగా తొలి అడుగు వేసినట్లు. ముందుగానే ప్రారంభిస్తే.. ఎక్కువ కాలం బీమా రక్షణ పరిధిలో ఉంటారు.

తక్కువ ప్రీమియంతో..

చిన్న వయసులో ఉన్నవారికి సాధారణంగా మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ కారణంతో తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ బీమా రక్షణ లభిస్తుంది. ఫలితంగా దశాబ్దాల పాటు తక్కువ ప్రీమియం ప్రయోజనాన్ని పొందేందుకు వీలవుతుంది. మీ ఆర్థిక వ్యవహారాలను మరింత సమర్థంగా ప్రణాళిక వేసుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ అనారోగ్య సమస్యలు రావచ్చు. దీనివల్ల ప్రీమియం భారం అవుతుంది. టర్మ్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియం వెనక్కి రాదనే సంగతి ఇక్కడ గుర్తుంచుకోవాలి. కాబట్టి, తక్కువ ప్రీమియంతోనే ఎక్కువ రక్షణ లభించేలా ప్రణాళిక వేసుకోవాలి.

పన్ను ఆదాకూ..

ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు కాబట్టి, పన్నుల గురించీ ఆలోచించాలి. ఉద్యోగంలో చేరిన వెంటనే కొంతమంది పన్ను పరిధిలోకి రాకపోవచ్చు. కొందరు పన్ను చెల్లించాల్సి వస్తుంది. బీమా పాలసీని ఎప్పుడూ పన్ను ఆదా కోసం అనే కోణంలో చూడొద్దు. చెల్లించిన ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్‌ 80సీ పరిమితి (రూ.1,50,000) మేరకు మినహాయింపు లభిస్తుంది. ఇది మీకు లభించే ఒక అదనపు ప్రయోజనమే. కేవలం టర్మ్‌ పాలసీతోనే ఆగిపోకుండా.. కనీసం రూ.5లక్షల విలువైన ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమూ మంచిది.

గుర్తుండిపోయేలా...

మీరు మొదటి జీతంతో ఏమి చేశారన్న సంగతి ఎప్పుడూ గుర్తుంచుకునేలా ఉండాలి. టర్మ్‌ పాలసీ అంటే మీకు మీరు ఇచ్చుకునే ఒక బహుమతి. మీ కుటుంబ సభ్యులకు ఇచ్చే ఒక ఆర్థిక భరోసాగా భావించాలి. టర్మ్‌ పాలసీని తీసుకునేటప్పుడు మీ బాధ్యతలను గుర్తు చేసుకోండి. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల విలువైన పాలసీని తీసుకోండి. ఆన్‌లైన్‌లో కొన్ని క్షణాల్లోనే బీమా సంస్థలు పాలసీని అందిస్తున్నాయి. బీమా సలహాదారుల నుంచీ పాలసీని తీసుకోవచ్చు.

పాలసీని మొత్తం ఒకే చోట నుంచి కాకుండా మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న రెండు బీమా పాలసీల నుంచి తీసుకోవడం మేలని నిపుణుల సూచన. ప్రీమియం చెల్లించేందుకు ఆటో డెబిట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకున్నప్పుడు నామినీ, కుటుంబ సభ్యులకు ఆ వివరాలు తెలియజేయడం మర్చిపోవద్దు.


నామినీ ఉన్నారా?

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు ఆధార్‌-పాన్‌ కార్డును జత చేయాల్సిందే. లేకపోతే ఏప్రిల్‌ 1 నుంచి పాన్‌ చెల్లుబాటు కాకుండా పోతుంది. పాన్‌ చెల్లకపోతే.. దానికి అనుసంధానంగా ఉన్న అన్ని రకాల ఆర్థిక లావాదేవీలూ ఆగిపోయే ప్రమాదం ఉంది. దీంతోపాటు మ్యూచువల్‌ ఫండ్‌ పెట్టుబడిదారులు మరో నిబంధననూ మార్చి 31లోగా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదే వారి పెట్టుబడులకు నామినీ పేరును నమోదు చేయడం.
చాలామంది మ్యూచువల్‌ ఫండ్‌ మదుపరులు తాము పెట్టుబడులు పెట్టేటప్పుడు నామినీ పేరును పేర్కొనరు. ఫండ్లలో మదుపు చేసిన వ్యక్తికి అనుకోనిదేమైనా జరిగితే.. ఆ ఫండ్‌ యూనిట్లను నామినీకి బదిలీ చేస్తారు. ఎవరికి బదిలీ చేయాలన్నది పేర్కొనకపోతే కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది.

గత ఏడాది జూన్‌ 15న సెబీ విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. ప్రతి మ్యూచువల్‌ ఫండ్‌ పోర్ట్‌ఫోలియోకి నామినీ తప్పనిసరి. ఇప్పటికే ఫండ్లలో మదుపు చేస్తున్న వారు నామినీ పేరు తెలియజేయకపోతే మార్చి 31లోగా నమోదు చేయాలని పేర్కొంది. అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు (ఏఎంసీ) ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ విధానంలో నామినీని నమోదు చేసేలా ఏర్పాట్లు చేయాలని సెబీ సూచించింది. ఒక పెట్టుబడిదారుడు గరిష్ఠంగా ముగ్గురి పేర్లను నామినీగా పేర్కొనేందుకు అవకాశం ఉంటుంది.

* ఇప్పటికే మీరు ఫండ్లలో మదుపు చేస్తుంటే.. మీ పెట్టుబడులకు నామినీ ఉన్నారా లేదా ఒకసారి చూసుకోండి. అవసరమైతే మార్పులు చేర్పులు చేయొచ్చు.

* కొత్తగా డీమ్యాట్‌ ఖాతా ప్రారంభించడం, ఫండ్లలో మదుపు చేస్తుంటే.. కచ్చితంగా నామినీ పేరును నమోదు చేయండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు