పంచ వ్యూహాలతో ఫండ్లలో మదుపు..

స్టాక్‌ మార్కెట్లో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టినప్పుడు మంచి రాబడికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈక్విటీ ఫండ్లలో మదుపు చేస్తూ.. చిన్న మొత్తాలతోనూ మంచి ఫలితాలు సాధించవచ్చు.

Updated : 17 Mar 2023 10:22 IST

స్టాక్‌ మార్కెట్లో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టినప్పుడు మంచి రాబడికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా క్రమానుగత పెట్టుబడి విధానంలో ఈక్విటీ ఫండ్లలో మదుపు చేస్తూ.. చిన్న మొత్తాలతోనూ మంచి ఫలితాలు సాధించవచ్చు. ఆర్థిక లక్ష్యాల సాధనకు ఈక్విటీ ఫండ్లను ఎంచుకునేటప్పుడు కొన్ని వ్యూహాలను అనుసరించాల్సి ఉంటుంది. అవేమిటో తెలుసుకుందాం.

ర్థిక అవసరాలు, నష్టభయం భరించే    సామర్థ్యం, వ్యవధి ఇలా పలు అంశాలు పెట్టుబడిపై ప్రభావం చూపిస్తాయి. ఈక్విటీ ఫండ్లు స్వల్ప కాలంలో వచ్చే స్టాక్‌ మార్కెట్‌ హెచ్చుతగ్గులకు ప్రభావితం అవుతాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు మంచి రాబడిని అందించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఈ ఫండ్లలో మదుపు చేసేవారు, ఇప్పటికే పెట్టుబడులు ఉన్నవారు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి.

లక్ష్యానికి అనుగుణంగా..

ప్రతి పెట్టుబడికీ ఒక లక్ష్యం ఉండాల్సిందే. అప్పుడే మనం మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తాం. ప్రతి లక్ష్యానికీ ద్రవ్యోల్బణ విలువనూ గుర్తించాలి. దీనికి అనుగుణంగా క్రమానుగత పెట్టుబడి విధానం(సిప్‌)లో ఎంత మొత్తాన్ని మదుపు చేయాలన్నది తెలుస్తుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు, అవివాహితులు వీలైనంత తొందరగా పెట్టుబడిని ప్రారంభించాలి. దీనివల్ల మున్ముందు వచ్చే ఖర్చుల కోసం ఒక నిధిని ఏర్పాటు చేసుకోవడంతోపాటు, ఆర్థిక క్రమశిక్షణ అలవాటు అవుతుంది. క్రమం తప్పకుండా మదుపు చేయడం ద్వారా మార్కెట్‌ హెచ్చుతగ్గుల నుంచి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు.

‘సిప్‌’ చేయండి..

ఉద్యోగులకు ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి. ఇందులో కొంత భాగాన్ని ఆర్థిక లక్ష్యాల సాధనకు కేటాయించడం ఇతరులతో పోలిస్తే సులభమే. వేతనం ద్వారా ఆదాయాన్ని ఆర్జించే వ్యక్తులు మార్కెట్‌ పరిస్థితులను పట్టించుకోకుండా క్రమం తప్పకుండా ‘సిప్‌’ చేస్తూనే ఉండాలి. మార్కెట్‌ అస్థిరతలను పట్టించుకోకుండా, నిర్ణీత కాలం పాటు మదుపు చేసేందుకు ఇది తోడ్పడుతుంది.

స్థిరంగా ఉండే పథకాల్లో..

‘సిప్‌’ అనేది ఒక పెట్టుబడి విధానం. సరైన ఫండ్లను ఎంచుకొని, ఈ విధానంలో మదుపు చేసినప్పుడే మంచి ఫలితాలు ఆశించగలం. దీర్ఘకాలంలో ప్రామాణిక సూచీలకు మించి స్థిరంగా రాబడిని అందించిన పథకాలను ఎంచుకోవాలి. స్వల్పకాలాన్ని చూసి, ఫండ్ల పనితీరుపై ఒక అంచనాకు రాకూడదు. ముఖ్యంగా ఒకే రంగానికి పరిమితమయ్యే సెక్టోరియల్‌ ఫండ్ల  విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పోర్ట్‌ఫోలియోను బలోపేతం చేసేలా 2-3 పథకాలను ఎంచుకోండి. మీ నష్టభయాన్ని భరించే సామర్థ్యం, లక్ష్యం, వ్యవధిని బట్టి, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌ క్యాప్‌ పథకాలను పరిశీలించండి. ముఖ్యంగా ప్రభుత్వ విధానాల వల్ల లాభం చేకూరే ఫండ్లలో మదుపు చేసేలా చూసుకోవాలి. ఫండ్‌ లక్ష్యాన్ని అర్థం చేసుకొని, వాటి ఫ్యాక్ట్‌షీట్లను ఎప్పటికప్పుడు పరిశీలించడం అలవాటు చేసుకోవాలి.

నిపుణుల సలహాలతో...

కొత్తగా మదుపు ప్రారంభించేవారు, లేదా ఇప్పటికే కొంత అనుభవం ఉన్నవారూ.. ఫండ్ల ఎంపికలో నిపుణుల సలహాలు పాటించాలి. దీర్ఘకాలంపాటు పెట్టుబడిని కొనసాగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పవు. అదే సమయంలో డైరెక్ట్‌, రెగ్యులర్‌ ప్లాన్‌లలో దేన్ని ఎంచుకోవాలన్నదీ చూసుకోవాలి. అప్పుడే సరైన పథకంలో మదుపు చేసి, అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు వీలవుతుంది.
చివరగా, మీ పెట్టుబడులకు తగిన సమయం ఇవ్వండి. వారం లేదా నెలల వ్యవధిలో మీ పోర్ట్‌ఫోలియోలో నష్టాలు కనిపించవచ్చు. ఇది తాత్కాలికమే. ఈక్విటీలు దీర్ఘకాలిక పెట్టుబడి సాధనాలు. అందువల్ల కనీసం ఏడు నుంచి పదేళ్లపాటు మదుపు చేయడానికి సిద్ధంగా ఉండండి. కనీసం రెండు-మూడేళ్లకోసారి మీ పెట్టుబడుల జాబితాను సమీక్షిస్తూ ఉండాలి.


సూచీ ఫండ్లలో..

మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల పనితీరును బట్టి, పాసివ్‌ ఫండ్లు, యాక్టివ్‌ ఫండ్లుగా వర్గీకరిస్తారు. పాసివ్‌ ఫండ్లు సాధారణంగా సూచీల ప్రామాణికంగా పనిచేస్తుంటాయి. యాక్టివ్‌ ఫండ్లు ప్రామాణిక బెంచ్‌మార్క్‌కు మంచి రాబడిని ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇటీవల కాలంలో యాక్టివ్‌ ఫండ్లతో పోలిస్తే పాసివ్‌ ఫండ్లే మంచి రాబడిని అందిస్తున్న సంగతిని చూస్తున్నాం. ఆర్థిక లక్ష్యాలు, నష్టభయం భరించే శక్తిని బట్టి, ఏ ఫండ్లను ఎంచుకోవాలన్నది మదుపరులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు