ఆరోగ్య బీమా తీసుకుందామిలా..

కొత్తరకం వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎప్పుడు  ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందన్న విషయం తెలియడం లేదు. మరోవైపు ఆరోగ్య బీమా ప్రీమియాలను  పెంచేందుకు బీమా సంస్థలు సిద్ధం అవుతున్నాయి.

Updated : 17 Mar 2023 01:28 IST

కొత్తరకం వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఎప్పుడు  ఆసుపత్రిలో చేరాల్సి వస్తుందన్న విషయం తెలియడం లేదు. మరోవైపు ఆరోగ్య బీమా ప్రీమియాలను  పెంచేందుకు బీమా సంస్థలు సిద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్య బీమాను ఎంచుకునేటప్పుడు ఏం చూడాలి అనేది  తెలుసుకుందాం.

జీవన శైలి వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో బాగా పెరుగుతోంది. 30 ఏళ్లు దాటితే చాలు బీపీ, మధుమేహంలాంటివి పలకరిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండె జబ్బులు వస్తున్నాయి. మూత్రపిండాలు దెబ్బతింటున్నాయి. పెరుగుతున్న వైద్య ఖర్చుల నేపథ్యంలో ఎంత మొత్తానికి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలన్నదే ఇప్పుడు చాలా కీలకంగా మారింది. ఇప్పటికే కార్యాలయంలో బృంద బీమా రక్షణ లభిస్తున్నా.. సొంతంగా మరో పాలసీ తీసుకోవడం మంచిది. వ్యక్తిగత పాలసీ తీసుకోవాలా.. కుటుంబం అంతటికీ వర్తించేలా ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీని ఎంచుకోవాలా అన్నది నిర్ణయించుకోవాలి. మీ వయసు, కుటుంబ ఆరోగ్య చరిత్ర, ముందస్తు వ్యాధుల్లాంటి వాటిని పరిగణనలోకి తీసుకోవాలి. వైద్య ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీన్నీ లెక్కలోకి చూసుకొని సరైన పాలసీ మొత్తాన్ని ఎంచుకోవాలి. జీవితాంతం పునరుద్ధరణకు అవకాశం ఉండే పాలసీలే మేలు. అదే సమయంలో మంచి చెల్లింపుల చరిత్ర ఉన్న సంస్థ నుంచి పాలసీ   తీసుకోవాలి.

ఎంచుకున్న పాలసీ నిబంధనలు ఒకటికి రెండుసార్లు చూసుకోండి. ఎలాంటి పరిమితులు, ఉప పరిమితులు ఉండకుండా పాలసీ చికిత్స ఖర్చును చెల్లించాలి. కొన్ని పాలసీలు ఆసుపత్రి గది అద్దె, ఐసీయూ, శస్త్ర చికిత్సలకు పాలసీ మొత్తంలో నిర్ణీత శాతాన్ని మాత్రమే చెల్లిస్తామని అంటుంటాయి. ఇలాంటి వాటి జోలికి వెళ్లకూడదు. క్లెయిం చేయని ఏడాదిలో ‘నో-క్లెయిం’ బోనస్‌ వర్తించేలా చూసుకోవాలి. ఆసుపత్రిలో చేరకముందు, ఇంటికి వెళ్లాక కొన్ని రోజులపాటు అయిన వ్యయాలనూ చెల్లించేలా పాలసీ ఉండాలి. ఆధునిక వైద్య విధానాలకూ పరిహారం లభించాలి. విదేశాల్లో చికిత్స చేయించుకునే వెసులుబాటూ ఉండాలి. నెట్‌వర్క్‌ ఆసుపత్రులు అధికంగా ఉండే పాలసీకి ప్రాధాన్యం ఇవ్వాలి.

చాలామంది తాము ఆరోగ్యంగానే ఉన్నాం.. ఇప్పుడే వైద్య బీమా పాలసీతో ఏం అవసరం అన్న ప్రశ్న వేస్తుంటారు. అనారోగ్యం ఎప్పుడూ చెప్పిరాదు. ఆసుపత్రిలో చేరిన తర్వాత చికిత్స కోసం ఎంత ఖర్చవుతుందో చెప్పలేం. అందుకే, వీలైనంత చిన్న వయసులో ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం మంచిది. 30 ఏళ్లలోపు పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు. వయసు పెరుగుతున్న కొద్దీ.. ఆరోగ్య బీమా పాలసీ ఇవ్వాలంటే.. ముందస్తు వైద్య పరీక్షలు తప్పనిసరి అంటాయి బీమా సంస్థలు. వయసుతోపాటు బరువు పెరగడం సహజం. దీంతోపాటు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే... సంస్థ పాలసీ ఇవ్వడానికి కాస్త వెనకాడవచ్చు. ఇచ్చినా అధిక ప్రీమియం వసూలు చేస్తాయి. ముందస్తు వ్యాధులకు మినహాయింపు ఉండే ఆస్కారం ఉంది. ముందస్తు వ్యాధుల చికిత్సకు వెంటనే పరిహారమూ లభించదు. కొన్ని పాలసీలు మూడు నుంచి   నాలుగేళ్ల వరకూ వీటికి రక్షణ కల్పించవు. కాబట్టి, పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఈ పాలసీని తీసుకోవడం మంచిది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని