స్థిరమైన ప్రతిఫలం వచ్చేలా

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా మిరే అసెట్‌ ‘నిఫ్టీ 100 లో ఓలటాలిటీ 30 ఈటీఎఫ్‌’ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ తరగతికి చెందిన ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) పథకం.

Updated : 17 Mar 2023 01:32 IST

మిరే అసెట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా మిరే అసెట్‌ ‘నిఫ్టీ 100 లో ఓలటాలిటీ 30 ఈటీఎఫ్‌’ అనే పథకాన్ని ఆవిష్కరించింది. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ తరగతికి చెందిన ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) పథకం. దీని ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ముగింపు తేదీ ఈ నెల 21. కనీస పెట్టుబడి రూ.5,000
ఈ పథకం పేరులోనే ఉన్నట్లు ‘నిఫ్టీ 100 లో ఓలటాలిటీ 30’ సూచీలో ఉన్న షేర్లపై ప్రధానంగా పెట్టుబడి పెడుతుంది. మార్కెట్లో హెచ్చుతగ్గులు అధికంగా ఉన్నప్పుడు ఈ సూచీ కాస్త స్థిరంగా, తక్కువ హెచ్చుతగ్గులతో కనిపించడం ప్రత్యేకత. దీర్ఘకాలం పాటు స్టాక్‌ మార్కెట్లో మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా మదుపు చేయాలనుకునే మదుపరులకు ఈ తరహా పథకాలు అనువుగా ఉంటాయి. తద్వారా తమ పెట్టుబడుల్లో కొంత మేరకు స్థిరత్వాన్ని సాధించడానికి, నష్టభయాన్ని, హెచ్చుతగ్గులను ఒక స్థాయికి పరిమితం చేయడానికి వీలవుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలంలో స్థిరమైన ప్రతిఫలాన్ని ఆశించవచ్చు. ఈ పథకానికి ఏక్తా గలా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు


వెండిలో పెట్టుబడికి..

కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ వెండిలో పెట్టుబడి కోసం ‘కోటక్‌ సిల్వర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 27. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఆర్థిక సంక్షోభం, మాంద్యం పరిస్థితుల్లో వెండిపై పెట్టుబడి అధిక రాబడిని అందిస్తుందనేది ఇప్పటి వరకూ అనుభవంలోకి వచ్చిన విషయమే. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం చూపినప్పుడు నిఫ్టీ 50 సూచీ 10 శాతం క్షీణించింది. అదే సమయంలో వెండి ధర 12 శాతం పెరిగింది. అందువల్ల పెట్టుబడులన్నీ ఈక్విటీ షేర్లకే కేటాయించకుండా కొంత వైవిధ్యం, భద్రత కోసం వెండిపై పెట్టడం మంచిదని ఆర్థిక నిపుణుల విశ్లేషణ. ఇటువంటి ఆలోచన ఉన్న మదుపరులు కోటక్‌ స్విలర్‌ ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌లో మదుపు చేసే అంశాన్ని పరిశీలించవచ్చు.


ఆదాయపు పన్ను ఆదా కోసం..

ఎన్‌జే మ్యూచువల్‌ ఫండ్‌ అనే సంస్థ కొత్తగా ఒక ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాన్ని ఆవిష్కరించింది. ఈ ‘ఎన్‌జే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ట్యాక్స్‌ సేవర్‌’ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ జూన్‌ 9. సాధారణంగా ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న సందర్భంలో ఆదాయపు పన్ను రాయితీ కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకాల్లో మదుపరులు పెట్టుబడులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో ఎన్‌జే మ్యూచువల్‌ ఫండ్‌ ఈ పథకాన్ని తీసుకురావడమే కాకుండా ఎన్‌ఎఫ్‌ఓను ఎక్కువ రోజుల పాటు నిర్వహిస్తోంది. అంతేకాకుండా ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.500 నుంచి పెట్టుబడి పెట్టే అవకాశాన్ని కల్పించింది. ఈ పథకానికి వైరల్‌ షా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. నిఫ్టీ 500 టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80సీలో రూ.1,50,000 వరకూ వివిధ పెట్టుబడి పథకాల్లో మదుపు చేసేందుకు వీలుంటుంది. ఇందులో ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలూ (ఈఎల్‌ఎస్‌స్‌) భాగమే. ఈ పథకాల్లో మూడేళ్ల వరకూ లాకిన్‌ అమల్లో ఉంటుంది. అంటే, మూడేళ్ల వరకూ పెట్టుబడిని వెనక్కి తీసుకునేందుకు వీలుండదు. ఇప్పటికే మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలు నిర్వహిస్తున్న అనేక ఈఎల్‌ఎస్‌ఎస్‌లు అందుబాటులో ఉన్నాయి. గత మూడేళ్ల కాలంలో ఇవి దాదాపు 20 శాతం వరకూ రాబడిని అందించాయి. కొత్తగా పన్ను ఆదా పథకాల్లో మదుపు చేయాలనుకునే వారు వీటిని పరిశీలించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు