ఆరోగ్య బీమా.. అపరిమితంగా!

కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా అవసరం పెరిగింది. మారుతున్న ఈ కొత్త అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఒకేసారి మూడు కొత్త పాలసీలను గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది.

Updated : 24 Mar 2023 03:25 IST

రోనా మహమ్మారి తర్వాత ఆరోగ్య బీమా అవసరం పెరిగింది. మారుతున్న ఈ కొత్త అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఒకేసారి మూడు కొత్త పాలసీలను గో డిజిట్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది. డిజిట్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీల కింద వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో డిజిట్‌ డబుల్‌ వ్యాలెట్‌ ప్లాన్‌, డిజిట్‌ ఇన్‌ఫినిటీ వ్యాలెట్‌ ప్లాన్‌, డిజిట్‌ వరల్డ్‌వైడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాన్‌లు ఉన్నాయి. ఈ మూడు పాలసీల్లోనూ గది అద్దె, ఐసీయూలాంటి వాటిపై ఎలాంటి ఉప పరిమితులూ ఉండవని సంస్థ పేర్కొంది.

ఇన్ఫినిటీ వ్యాలెట్‌ ప్లాన్‌లో ఎన్ని సార్లయినా పాలసీని వినియోగించుకోవచ్చు. ఒకసారి పాలసీ పరిమితి పూర్తికాగానే తిరిగి భర్తీ అవుతుంది. ఇలా ఎన్నిసార్లయినా పాలసీని వినియోగించుకోవచ్చు. డబుల్‌ వ్యాలెట్‌లో ఒకసారి పాలసీ మొత్తం పూర్తయిన తర్వాత రెండోసారి మళ్లీ పాలసీ విలువ మేరకు రక్షణ లభిస్తుంది. వరల్డ్‌ వైడ్‌ ట్రీట్‌మెంట్‌ పాలసీ తీసుకున్న వారికి ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా సరే చికిత్స పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ పాలసీలన్నీ నెలకు రూ.628 కనీస ప్రీమియంతో ప్రారంభం అవుతాయి. ముందస్తు వ్యాధుల కవరేజీకి వేచి ఉండే సమయం తగ్గించుకోవడంలాంటి రైడర్లు అందుబాటులో ఉన్నాయి. పునరుద్ధరణ సమయంలో ఆరోగ్య పరీక్షలు, వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీలు తదితర ప్రయోజనాలూ ఉన్నాయి.


సూచీ ఫండ్లలో...

యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ పథకం అందుబాటులోకి వచ్చింది. ‘యాక్సిస్‌ ఎస్‌అండ్‌పీ 500 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 5. ఇది ఎఫ్‌ఓఎస్‌ ఓవర్సీస్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ ఫండ్‌. ఎన్‌ఎఫ్‌ఓ ద్వారా కనీసం రూ.500 మదుపు చేయొచ్చు. ‘ఎస్‌అండ్‌పీ 500 టీఆర్‌ఐ’ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. ఈ సూచీలోని షేర్లపై పెట్టుబడి పెట్టే ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్ల (ఈటీఎఫ్‌)లో ప్రధానంగా ‘యాక్సిస్‌ ఎస్‌అండ్‌పీ 500 ఈటీఎఫ్‌ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌’ ఈ పథకం పెట్టుబడులు పెడుతుంది. విదేశీ మార్కెట్లలో ప్రధానంగా యూఎస్‌లో ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెట్టడం ద్వారా తమ పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యం ఉంటుందని భావించే మదుపరులకు ఇది అనువైనదిగా ఉంటుంది. అదే సమయంలో నష్టభయమూ అధికంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.


ఆకర్షణీయమైన రాబడినిచ్చేలా

క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ‘క్వాంట్‌ డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) చివరి తేదీ వచ్చే నెల 6. ఇది డైెనమిక్‌ అసెట్‌ అలకేషన్‌-బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఎన్‌ఎఫ్‌ఓ సమయంలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ఎస్‌ఐపీ (క్రమానుగత పెట్టుబడి విధానం)లో నెలకు రూ.1,000 చొప్పున కనీసం 12 నెలలు మదుపు చేయాల్సి ఉంటుంది. ఈ పథకం పనితీరుకు ‘క్రిసిల్‌ హైబ్రిడ్‌ 50+ 50 మోడరేట్‌ ఇండెక్స్‌’ను కొలమానంగా తీసుకుంటారు. డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ కింద పెట్టుబడులను దాదాపు 65 శాతం ఈక్విటీ విభాగానికి, మిగిలిన సొమ్మును రుణ పత్రాల్లో పెట్టుబడికి కేటాయిస్తారు. ఈక్విటీ, రుణ మార్కెట్లో అవకాశాల ప్రకారం పెట్టుబడులను అటూఇటూ మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది. తద్వారా అధిక ప్రతిఫలాన్ని రాబట్టేందుకు ప్రయత్నించవచ్చు. ఆదాయపు పన్ను విషయానికి వస్తే, ఈ పథకాలపై వచ్చిన లాభాలకు ఈక్విటీ పెట్టుబడులకు వర్తించే మూలధన పన్ను నిబంధనలు వర్తించటం ఒక సానుకూలత. గత రెండేళ్ల కాలంలో డైనమిక్‌ అసెట్‌ అలకేషన్‌-బ్యాలెన్స్‌డ్‌ అడ్వాంటేజ్‌ ఫండ్లు మదుపరులకు ఆకర్షణీయమైన రాబడులనే అందించాయి.


స్థిరాదాయం వచ్చేలా..

యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నూతన ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ (ఎఫ్‌ఎంపీ)ని  ఆవిష్కరించింది. ఈ పథకం కింద సమీకరించిన పెట్టుబడులను ప్రధానంగా రుణ పత్రాలు, మనీ మార్కెట్‌ పత్రాల్లో పెడతారు. పేరులోనే ఉన్నట్లుగా ఇది 1114 రోజుల కాల వ్యవధి డెట్‌-ఎఫ్‌ఎంపీ తరగతికి చెందిన క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. అంటే ఒకసారి పెట్టుబడి పెట్టిన తర్వాత కాల పరిమితి తీరిపోయే వరకూ పెట్టుబడిని వెనక్కి తీసుకోవడం కష్టం. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 28. కనీస పెట్టుబడి రూ.5,000. ఈ పథకం పనితీరుకు ‘క్రిసిల్‌ మీడియం డ్యూరేషన్‌ ఫండ్‌ బిల్‌ ఇండెక్స్‌’ను కొలమానంగా తీసుకుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని