సైబర్ బీమా.. మోసపోయినా నష్టపోకుండా...

వ్యక్తిగత సమాచారం ఎంతో విలువైనది. ఎంతోమంది తమ ఫోన్లు, కంప్యూటర్లలో ఈ విలువైన సమాచారాన్ని దాచుకుంటున్నారు.

Updated : 31 Mar 2023 02:56 IST

వ్యక్తిగత సమాచారం ఎంతో విలువైనది. ఎంతోమంది తమ ఫోన్లు, కంప్యూటర్లలో ఈ విలువైన సమాచారాన్ని దాచుకుంటున్నారు. అనుకోని పరిస్థితుల్లో కొన్నిసార్లు మన విషయాలు సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కి, ఆర్థికంగా చిక్కులను తెచ్చిపెడుతున్నాయి. ఇలాంటి కష్టాలు ఎదురైనప్పుడు ఇబ్బంది పడకుండా ఉండాలంటే.. సైబర్‌ బీమా భరోసా తప్పనిసరి అవసరంగా మారింది.

సాంకేతికత పెరుగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త తరహా మోసాలతో దోచుకుంటున్నారు సైబర్‌ దొంగలు. ఫోన్లకు, కంప్యూటర్లకు సరైన సాఫ్ట్‌వేర్లను ఉపయోగించడంతోపాటు, ఒక సైబర్‌ ఇన్సూరెన్స్‌ పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దు. 18 ఏళ్లు నిండిన వారెవరైనా ఈ బీమా పొందేందుకు వీలుంది. రూ.లక్ష నుంచి రూ.కోటి వరకూ విలువైన పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీలను ఎంచుకునేటప్పుడు ఏ విషయాలను గమనించాలన్నది చూద్దాం..

* కార్డుల కోసం...: క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల వినియోగం లేదా క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసినప్పుడు ఏదైనా మోసం జరిగినప్పుడు సైబర్‌ సెక్యూరిటీ కవర్‌ వర్తిస్తుందా లేదా అని పరిశీలించాకే పాలసీని ఎంచుకోవాలి. ఉదాహరణకు.. కేవైసీ నిబంధనలు పూర్తి చేయలేదు కాబట్టి, బ్యాంకు ఖాతా/క్రెడిట్‌ కార్డు/డెబిట్‌ కార్డు బ్లాక్‌ చేస్తామని సందేశాలు వస్తుంటాయి. ఇ-మెయిల్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్‌ చేసినప్పుడు అది మోసపూరితం కావచ్చు. ఖాతా లేదా కార్డు నుంచి డబ్బు వెళ్లిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీమా పాలసీ ఆ ఆర్థిక నష్టాన్ని భర్తీ చేసేలా ఉండాలి.


* గుర్తింపును దొంగిలిస్తే..:  ఫోన్లు లేదా కంప్యూటర్‌లో నిక్షిప్తం అయిన వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించి, దాని ద్వారా మోసాలకు పాల్పడ్డారనుకోండి.. ఇలాంటి సందర్భాల్లోనూ సైబర్‌ పాలసీ రక్షణ కల్పించాలి. ఉదాహరణకు ఒక వ్యక్తి పాన్‌ లేదా ఆధార్‌ వివరాలను సైబర్‌ మోసగాళ్లు దుర్వినియోగం చేశారనుకుందాం. జరిగిన ఆర్థిక నష్టాన్ని బీమా సంస్థ భరించాలి. బీమా తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని తనిఖీ చేసుకోవాలి.

* సామాజిక వేదికల్లో...: సామాజిక వేదికల నుంచి గుర్తింపు వివరాలను తీసుకొని, సైబర్‌ దాడికి పాల్పడితే.. దీని నుంచి రక్షణను పొందేందుకు అయ్యే ఖర్చులను చెల్లించేలా బీమా పాలసీ ఉండాలి. వ్యక్తిగత వేధింపులకు గురైన సందర్భంలోనూ అయ్యే ఖర్చులకూ పరిహారం అందించాలి.

* మాల్వేర్‌ నుంచి రక్షణ: సంక్షిప్త సందేశాలు లేదా ఇ-మెయిల్‌ ద్వారా ఫోన్లు, కంప్యూటర్లలోకి వచ్చిన మాల్వేర్‌ ద్వారా మన పరికరాల్లో నుంచి సమాచారం ఇతరుల చేతిలోకి వెళ్లిపోవచ్చు. సాధారణంగా వినియోగదారుల పేర్లు, పాస్‌వర్డ్‌లు, క్రెడిట్‌ కార్డు వివరాలను సైబర్‌ దొంగలు తస్కరిస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో జరిగిన నష్టాన్నీ పాలసీ భరిస్తుంది. మీరు పాలసీ తీసుకునేటప్పుడు ఈ విషయాన్ని గమనించాలి. మాల్వేర్‌ దాడి జరిగినప్పుడు కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌, డేటాను పునరుద్ధరించేందుకు అయ్యే ఖర్చునూ సైబర్‌ బీమా చెల్లిస్తుంది.

ఇవే కాకుండా...

డిజిటల్‌ పరికరాల్లో ఉన్న మీ వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను బహిర్గతం చేయడం, అందువల్ల ఉత్పన్నమైన పరిణామాలకు పరిహారం చెల్లించడం, సైబర్‌ నేరాల వల్ల మీకు కలిగిన మానసిక, శారీరక ఇబ్బందులకు ఏదైనా చికిత్స చేసుకున్న సందర్భంలోనూ అందుకైన ఖర్చులను చెల్లించడంలాంటివీ సైబర్‌ బీమాలో భాగంగా ఉంటాయి.
టీఏ రామలింగం, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని