ఆదాయం తక్కువున్నాఆర్థిక విజయం సాధించేలా..

‘నా జీతం చాలా తక్కువ. ఇక ఆర్థిక ప్రణాళికలు ఎలా వేసుకోవాలి?’ చాలామంది అడిగే ప్రశ్నే ఇది. ఆర్థిక ప్రణాళికలు అధిక ఆదాయం ఉన్న వారికే అని చాలామంది అనుకుంటారు

Updated : 12 May 2023 00:17 IST

‘నా జీతం చాలా తక్కువ. ఇక ఆర్థిక ప్రణాళికలు ఎలా వేసుకోవాలి?’ చాలామంది అడిగే ప్రశ్నే ఇది. ఆర్థిక ప్రణాళికలు అధిక ఆదాయం ఉన్న వారికే అని చాలామంది అనుకుంటారు. కానీ, వాస్తవం వేరు. వచ్చిన ఆదాయాన్ని ఎలా వినియోగిస్తున్నారు అనేదే ఇక్కడ ప్రధానం. అందుకోసం ఏం చేయాలి? తెలుసుకుందాం.

అర్థం చేసుకోండి..

ఇప్పుడు రూ.100తోనూ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు ప్రారంభించే వీలుంది. పీపీఎఫ్‌లో ఏడాదికి రూ.500లు చెల్లించినా చాలు. ముందుగా పెట్టుబడి పథకాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. వార్తా పత్రికల్లో వచ్చే సమాచారాన్ని చదవండి. అందుబాటులో ఉన్న వివిధ పెట్టుబడి పథకాలు, అందులో ఉండే నష్టభయం గురించి అర్థం చేసుకోండి. చిన్న మొత్తంతోనైనా మదుపు ప్రారంభించి, క్రమంగా పెంచుకుంటూ వెళ్లండి. మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండండి.
మనమంతా డబ్బు ఆర్జించేందుకు కష్టపడుతూనే ఉంటాం. ఇందులో తక్కువ, ఎక్కువ అనేది సమస్య కాదు. నెలకు రూ.10వేలు సంపాదించే వ్యక్తి రూ.లక్షలు కూడబెట్టే అవకాశం ఉంది. అదే రూ.లక్ష సంపాదించే వ్యక్తి దగ్గర అవసరానికి రూ.10వేలూ ఉండకపోవచ్చు. ఇదంతా ఆర్థిక క్రమశిక్షణపైనే ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. అందుకే, ఆర్థిక ప్రణాళిక అధిక ఆదాయం ఉన్న వారికే కాదు.. తక్కువ మొత్తం ఆర్జిస్తున్న వారికీ ముఖ్యమే.

ఖర్చులను గమనిస్తూ..

జీతం లేదా వ్యాపారంలో ఆదాయం రావడానికి ఎంతో ఓపికగా వేచి చూస్తాం. కానీ, ఖర్చును మాత్రం క్షణాల్లో ఆలోచించకుండా చేస్తాం. నిత్యావసరాలు, వైద్య ఖర్చులు, పిల్లల ఫీజులు మొదలైన తప్పనిసరి అవసరాల మాట వేరు. కానీ, అనవసరమైన ఖర్చుల గురించీ ఆలోచించాలి. ఆదాయం వచ్చినప్పుడు ఒక లెక్క ఉంటుంది. అలాగే ఖర్చులకూ లెక్క రాయాలి. అప్పుడే చేతిలో డబ్బు నిలుస్తుంది.

బడ్జెట్‌ వేసుకోండి..

మన పరిధిలోనే ఖర్చు చేయడానికి అనుసరించాల్సిన పద్ధతులను బడ్జెట్‌ తెలియజేస్తుంది. ఖర్చులకు ప్రాధాన్యం, లక్ష్యాలను నిర్దేశించడం, వాటిని సాధించేందుకు వ్యవధిని నిర్ణయించడంలో ఇది సాయపడుతుంది. క్రెడిట్‌ కార్డు వంటి స్వల్పకాలిక రుణాలను నివారించేందుకు ఇది తోడ్పడుతుంది. విలాసాలను వాయిదా    వేసేందుకూ ఇది ఉపకరిస్తుంది.

రుణాలకు దూరంగా..

తప్పనిసరి పరిస్థితుల్లోనూ రుణం తీసుకోవాలి. ఇస్తున్నారు కదా.. అని డిజిటల్‌ వ్యక్తిగత రుణాలను తీసుకోవద్దు. దీనికి అధిక వడ్డీ రేటు ఉంటుంది. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. క్రెడిట్‌ కార్డు తీసుకున్నా, పూర్తి విచక్షణతో దాన్ని వినియోగించేందుకు ప్రయత్నించాలి.

మదుపు చేశాకే..

ఎంత సంపాదిస్తున్నామన్నది కాదు.. అందులో ఎంత పొదుపు, పెట్టుబడి పెడుతున్నామన్నదే ముఖ్యం. ఆదాయంలో నుంచి పెట్టుబడులు తీసిన తర్వాతే ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీ ఆర్థిక లక్ష్యాలను సాధించే శక్తి వస్తుంది. ముందే ఖర్చు చేస్తే.. పెట్టుబడులు పెట్టేందుకు డబ్బు మిగలదు. ఎప్పటికీ ఆర్థికంగా ముందుకెళ్లలేరు. పెట్టుబడులు ఒక సుదీర్ఘ ప్రయాణం అని మర్చిపోవద్దు.

లక్ష్యాలకు తగ్గట్టుగా..

ఆర్థిక లక్ష్యాలు వాస్తవ రూపంలోకి రావాలంటే.. కొన్ని త్యాగాలు తప్పవు. పిల్లల ఉన్నత చదువులు, పదవీ విరమణ ప్రణాళికలాంటివి ఇందులో కీలకం. వీటికోసం దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టాలి. కాబట్టి, సంపాదన ప్రారంభమైన రోజు నుంచే పెట్టుబడులు ప్రారంభించాలి.

ధీమాగా ఉండేలా...

వైద్య ఖర్చులు పెరిగిపోతున్నాయి. వీటిని తట్టుకునేందుకు ఆరోగ్య బీమా తప్పనిసరి. ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ కల్పించండి. దీనికోసం తక్కువ ప్రీమియంతో ఎక్కువ రక్షణ కల్పించే టర్మ్‌ బీమా పాలసీలను ఎంచుకోండి. ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ బీమా రక్షణ ఉండాల్సిందే.

అత్యవసర నిధి...

ఆరు నెలల ఖర్చులకు సరిపోయే మొత్తాన్ని అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోవాలి. ఉద్యోగం కోల్పోవడం, వ్యాపారంలో నష్టం లాంటి సందర్భాల్లో ఇది ఆదుకుంటుంది. ఈ మొత్తాన్ని బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో జమ చేయొచ్చు.
ఆర్థిక ప్రణాళికలను ప్రారంభించేందుకు సరైన సమయం ఇప్పుడే. కాబట్టి, ఆదాయం పెరిగేంత వరకూ వేచి చూడకుండా.. ఇప్పటి నుంచే క్రమశిక్షణ పాటిస్తూ.. ప్రణాళికలు వేసుకోవాలి. అప్పుడే ఆర్థిక విజయం సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని