ఆరోగ్య బీమా మినహాయింపులు చూసుకోండి

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా పాలసీ ‘వర్తించని’ సందర్భాలు తెలుసుకోవాలి.

Updated : 19 May 2023 09:04 IST

ఊహించని అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు రాకుండా ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తుంది. నానాటికీ పెరుగుతున్న వైద్య ద్రవ్యోల్బణం, జీవన శైలి వ్యాధుల కారణంగా సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ అవసరం అధికంగా ఉంటోంది. ఈ పాలసీని తీసుకునేటప్పుడు నిబంధనలు, షరతులపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా మినహాయింపుల సంగతి పట్టించుకోవాలి.

ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి అంశాన్నీ నిశితంగా పరిశీలించాలి. ముఖ్యంగా పాలసీ ‘వర్తించని’ సందర్భాలు తెలుసుకోవాలి. సమగ్ర బీమా పాలసీని ఎంచుకున్నప్పుడూ, కొన్నిసార్లు కచ్చితమైన మినహాయింపులు, తగ్గింపులు ఉండే అవకాశం ఉంది. చికిత్స మొత్తంలో కొంత మొత్తాన్ని పాలసీదారుడు భరించాల్సి వస్తుంది. మిగతాదాన్ని బీమా పాలసీ చెల్లిస్తుంది. లేదా చికిత్స ఖర్చు నిర్ణీత పరిమితికి మించినప్పుడు, ఆ పై మొత్తానికే పరిహారం ఇస్తుంది. ఉదాహరణకు మీ పాలసీలో రూ.3 వేల వరకూ పరిమితి ఉందనుకుందాం. మీ చికిత్స ఖర్చు రూ.20వేలు అయ్యింది. అప్పుడు రూ.3వేలు మీరు, రూ.17వేలు పాలసీ చెల్లించాలన్నమాట. అదే సమయంలో రూ.3వేలకు లోపు ఖర్చయినప్పుడు బీమా సంస్థ పరిహారం ఇవ్వదు. ఇందులోనూ రెండు రకాలున్నాయి.

* కచ్చితంగా: బీమా సంస్థ కొంత పరిమితి తర్వాతే చికిత్స ఖర్చును చెల్లిస్తుంది. పాలసీ తీసుకునేటప్పుడే దీన్ని నిర్ణయించుకోవాలి. ఆ పరిమితి వరకూ పాలసీదారుడే ఖర్చును భరించాలి. అది దాటినప్పుడే బీమా సంస్థ ఖర్చులను చెల్లిస్తుంది. 

* స్వచ్ఛందంగా: బీమా ప్రీమియం తగ్గాలని కోరుకున్నప్పుడు పాలసీదారుడు స్వచ్ఛందంగా మినహాయింపు పరిమితిని ఎంచుకునే అవకాశం ఉంటుంది. క్లెయింలో ఎంత భాగాన్ని పాలసీదారుడు భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి, పాలసీ ప్రీమియాన్ని బీమా సంస్థ నిర్ణయిస్తుంది. ఇది పాలసీదారుల వయసును బట్టి, మారుతూ ఉంటుంది. మీ దగ్గర డబ్బు ఉంది, ఇబ్బందేమీ లేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ మినహాయింపును ఎంచుకోవాలి. స్వల్ప ప్రీమియం ఆదా కోసం దీన్ని తీసుకుంటే.. తర్వాత ఆర్థికంగా భారం కావచ్చు.

టాపప్‌ ప్లాన్‌ తీసుకున్నారా?

టాపప్‌ పాలసీలు కొంచెం భిన్నంగా పనిచేస్తాయి. ఒక పరిమితి వరకూ పాలసీదారుడు లేదా సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ చికిత్స ఖర్చును చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అధికంగా అయ్యే మొత్తానికే టాపప్‌ పాలసీ వర్తిస్తుంది.

ఇప్పటికే ఒక ఆరోగ్య బీమా పాలసీ ఉన్నవారు ఈ టాపప్‌ పాలసీలను ఎంచుకోవచ్చు. ఇందులోనూ టాపప్‌, సూపర్‌ టాపప్‌ అనే రకాలున్నాయి. సాధారణ టాపప్‌ పాలసీ తీసుకున్నప్పుడు పాలసీదారుడు ప్రతి క్లెయిం కోసం ముందుగా మినహాయింపు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. సూపర్‌ టాపప్‌ పాలసీలో ఏడాది కాలంలో మినహాయింపు పరిమితిని లెక్కించి, బీమా సంస్థలు పరిహారాన్ని చెల్లిస్తాయి.

ఒక ఉదాహరణ చూద్దాం..

మీరు రూ.3 లక్షల విలువైన ఆరోగ్య బీమా పాలసీ తీసుకున్నారనుకుందాం. టాపప్‌, సూపర్‌ టాపప్‌ పాలసీలు రూ.3లక్షల పైన ఖర్చయినప్పుడు వర్తించేలా తీసుకున్నారు. ఒక పాలసీ ఏడాదిలో రూ.2లక్షల విలువైన రెండు క్లెయింలు చేశారు. ఇప్పుడు మీ ప్రాథమిక పాలసీ.. మొదటిసారి క్లెయింకు రూ.2 లక్షలు పాలసీ చెల్లిస్తుంది. మరో క్లెయింకు రూ. లక్ష చెల్లిస్తుంది. ఇప్పుడు టాపప్‌ పాలసీ రూ.3లక్షల పరిమితి దాటాకే వర్తిస్తుంది. ఒకసారి రూ. 2లక్షలు, మరోసారి రూ. లక్ష ఖర్చయ్యింది. కాబట్టి, సాధారణ టాపప్‌ పాలసీ ద్వారా ఉపయోగం ఉండదు.

ఇదే ఉదాహరణలో సూపర్‌ టాపప్‌ పాలసీ ఉందనుకుంటే.. మొదటి క్లెయింకు రూ.2లక్షలు ప్రాథమిక పాలసీ చెల్లిస్తుంది. రెండోసారి రూ.లక్ష ప్రాథమిక పాలసీ భరిస్తే.. మరో రూ.లక్ష సూపర్‌టాపప్‌ పాలసీ చెల్లిస్తుంది.

మినహాయింపుల వల్ల కొన్నిసార్లు ఆర్థిక భారం పడినప్పటికీ.. చిన్న మొత్తాలకూ ఆరోగ్య బీమా క్లెయిం చేసుకోకుండా అడ్డుకుంటుంది. ఫలితంగా నో క్లెయిం బోనస్‌ ద్వారా పాలసీ విలువ పెరిగేందుకు అవకాశం ఉంటుంది. క్లెయిం చేసుకున్నప్పుడు కొన్ని బీమా సంస్థలు అదనపు ప్రీమియాన్నీ వసూలు చేస్తుంటాయి. దీన్ని నివారించేందుకూ మినహాయింపులు ఉపయోగపడతాయి.
భాస్కర్‌ నెరూర్కర్‌, హెడ్‌, హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని