తొలి జీతం.. తీసుకుందాం ఓ టర్మ్‌ పాలసీ

చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో చేరడం, తొలి వేతనం బ్యాంకులో జమ కావడం ఇవన్నీ ఒక మధురానుభూతులుగా మిగిలిపోతాయి

Updated : 19 May 2023 09:01 IST

చదువు పూర్తి చేసి, ఉద్యోగంలో చేరడం, తొలి వేతనం బ్యాంకులో జమ కావడం ఇవన్నీ ఒక మధురానుభూతులుగా మిగిలిపోతాయి. జీవిత లక్ష్యాలను సాధించే క్రమంలో డబ్బును ఎలా వినియోగించాలి అనే ప్రణాళికా సంపాదన ప్రారంభమైన క్షణం నుంచే మొదలవ్వాలి. ఇందులో కీలకమయ్యింది జీవిత బీమా పాలసీ. మీపై ఆధారపడిన వారికి ఆర్థిక రక్షణ కల్పించే ఏర్పాటు చేయడం మీ బాధ్యతగా భావించాలి. అందుకే, తొలి జీతం అందుకున్న వేళ మీరు చేయాల్సిన పని ఇదే.

మంచి అలవాటును ప్రారంభించేందుకు నిర్ణీత సమయం అంటూ ఏమీ ఉండదు. మీకు ఆలోచన వచ్చిణ క్షణమే దాన్ని ఆచరణలో పెట్టాలి. ఆర్థిక విషయాల్లో ఇది మరింత ముఖ్యం. పొదుపు, పెట్టుబడులను ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత త్వరగా ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు. తొలి జీతంతో టర్మ్‌ పాలసీ తీసుకుంటే.. ఎక్కువ కాలం బీమా రక్షణ పరిధిలో ఉంటారు.

టర్మ్‌ పాలసీని ముందుగానే తీసుకోవడం వల్ల నామమాత్రపు ప్రీమియంతో, గణనీయమైన జీవిత బీమా రక్షణ లభిస్తుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. రిస్కు తక్కువ. అందుకే, బీమా సంస్థలు తక్కువ ప్రీమియాన్ని వసూలు చేస్తాయి. ఫలితంగా పాలసీ కొనసాగుతున్నన్ని రోజులూ అదే ప్రీమియం ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది మీకు ఎంతో విలువను జోడిస్తుంది. ఇతర ఆర్థిక వ్యవహారాలను సులభంగా సాధించేందుకు ఇది ఉపకరిస్తుంది.

ఆదాయాన్ని ఆర్జించడం మొదలు పెట్టారు కాబట్టి, ఆదాయపు పన్ను ప్రణాళికలను వేసుకోవాల్సిన అవసరమూ ఉంటుంది. ఆదాయ పన్ను మినహాయింపు పొందేందుకు జీవిత బీమా పాలసీలనూ ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా చెల్లించాల్సిన పన్ను తగ్గుతుంది. ఆదాయపు పన్ను చట్టం-1961, సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. పాత పన్ను విధానం ఎంచుకున్నప్పుడే ఇది వర్తిస్తుందని మర్చిపోవద్దు.

తొలి వేతనాన్ని ఎందుకు ఖర్చు చేశారు అన్న విషయం ఎప్పుడూ గుర్తుండాలి. పాలసీ వ్యవధి తీరే వరకూ ప్రీమియం చెల్లిస్తూనే ఉంటారు కాబట్టి, తర్వాత పెరిగే ప్రీమియాలు మీపై ప్రభావాన్ని చూపించవు. ఇది మీకు మేలు చేసే అంశమే.

వేతనం రాగానే మీరు చేయాల్సిన ప్రణాళికల గురించి మీ ఆలోచనలు వేరేగా ఉండొచ్చు. టర్మ్‌ పాలసీ అనేది ఒక బలవంతపు కొనుగోలుగా ఉండొద్దు. మీ ఇష్టపూర్తిగా ఉండాలి. ఆర్థిక లక్ష్యాల సాధనలో భాగంగా ఎప్పటికైనా ఒక పాలసీ తీసుకోవాల్సిందే. ఆ పనిని ఈ రోజే పూర్తి చేయండి. పెరిగిన ఆదాయం, బాధ్యతలకు అనుగుణంగా పాలసీ మొత్తాన్ని పెంచుకోవడం మర్చిపోవద్దు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని