అధిక లాభాలనిచ్చేలా...

శాంకో మ్యూచువల్‌ ఫండ్‌ దేశంలోని తొలిసారిగా యాక్టివ్‌ మొమెంటమ్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. ‘శాంకో యాక్టివ్‌ మొమెంటమ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 15 ప్రారంభం అవుతుంది.

Published : 09 Jun 2023 00:30 IST

శాంకో మ్యూచువల్‌ ఫండ్‌ దేశంలోని తొలిసారిగా యాక్టివ్‌ మొమెంటమ్‌ ఫండ్‌ను తీసుకొచ్చింది. ‘శాంకో యాక్టివ్‌ మొమెంటమ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ (న్యూ ఫండ్‌ ఆఫర్‌) ఈ నెల 15 ప్రారంభం అవుతుంది. ఈ నెల 29 ముగింపు తేదీ. ‘నిఫ్టీ 500 ఇండెక్స్‌ టీఆర్‌ఐ’ ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా తీసుకుంటారు. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌)  కింద ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి.

మొమెంటమ్‌ ఫండ్‌, అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉందనే విషయం వివిధ విభాగాలకు చెందిన మొమెంటమ్‌ సూచీలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ‘నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఇండెక్స్‌’ గత 18 ఏళ్ల కాలంలో 17.79 శాతం సగటు వార్షిక ప్రతిఫలాన్ని నమోదు చేసింది. ఇది నిఫ్టీ 50, నిఫ్టీ 500 సూచీల కంటే మించిన ప్రతిఫలం కావటం గమనార్హం. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 150 మొమెంటమ్‌ 50 ఇండెక్స్‌ దీనికంటే అధికంగా 21.28 శాతం సగటు వార్షిక ప్రతిఫలాన్ని ఆర్జించింది. ఎంఎస్‌సీఐ వరల్డ్‌ ఇండెక్స్‌ కంటే, ఎంఎస్‌సీఐ వరల్డ్‌ మొమెంటమ్‌ ఇండెక్స్‌ రెట్టింపు వార్షిక ప్రతిఫలాన్ని సాధించటం ప్రత్యేకత.

ఈ గణాంకాల ఆధారంగా శాంకో మ్యూచువల్‌ ఫండ్‌, యాక్టివ్‌ మొమెంటమ్‌ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ పథకం కింద పెట్టుబడి కోసం కంపెనీలను ఎంచుకోవటానికి మొమెంటమ్‌ లక్షణాలైన బ్రేక్‌ అవుట్‌, ప్రైస్‌ లీడర్‌షిప్‌, ప్రైస్‌ ట్రెండ్స్‌.... తదితర అంశాలను విశ్లేషిస్తారు. మొమెంటమ్‌ను నిర్దేశించే ఆల్గోరిథమ్‌ను వినియోగిస్తారు. పోర్ట్‌ఫోలియో రీ-బ్యాలెన్సింగ్‌, హెడ్జింగ్‌ విషయాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. తద్వారా అధిక ప్రతిఫలాన్ని ఆర్జించేందుకు ప్రయత్నిస్తారు. ఈ పథకానికి పరస్‌ మటాలియా ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. యాక్టివ్‌ మేనేజ్‌మెంట్‌ తరగతికి చెందిన ఈ పథకంలో రిస్కు కొంత ఎక్కువే. అదే సమయంలో లాభాలూ ఎక్కువగా నమోదు కావచ్చు. అధిక రిస్కు తీసుకోవటానికి సిద్ధపడే మదుపరులకు ఇది అనువుగా ఉంటుంది. తమ పెట్టుబడుల్లో కొంత భిన్నత్వం ఉండాలని కోరుకునే మదుపరులు ఈ యాక్టివ్‌ మొమెంటమ్‌ ఫండ్‌ను పరిశీలించవచ్చు.


అన్ని విభాగాల్లో మదుపు..

డిల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ను రూపొందించింది. ‘ఎడిల్‌వైజ్‌ మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 19. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. ఇది హైబ్రీడ్‌- మల్టీ అసెట్‌ అలకేషన్‌ తరగతికి చెందిన పథకం. దీనికింద ప్రధానంగా రుణ పత్రాల్లో పెట్టుబడి పెడతారు. కొంత పెట్టుబడిని ఈక్విటీ, బంగారం, వెండికి కేటాయిస్తారు. మల్టీ అస్సెట్‌ పథకాలు కనీసం 10 శాతం సొమ్మును ఒక్కో తరగతికి కేటాయించాల్సి ఉంటుంది. ఈక్విటీ షేర్లలో కొంత సొమ్ము పెట్టుబడి పెడుతున్నందున ఈ పథకంలో పెట్టుబడి ద్వారా ఆర్జించిన లాభాలపై దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను (ఎల్‌టీసీజీ) ఇండెక్సేషన్‌ తర్వాత 20 శాతం మాత్రమే ఉంటుంది.


ఆర్థిక సేవల రంగాల్లో...

క్వాంట్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా బీఎఫ్‌ఎస్‌ఐ విభాగానికి చెందిన ఒక పథకాన్ని ఆవిష్కరించింది. ‘క్వాంట్‌ బీఎఫ్‌ఎస్‌ఐ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 14. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.5,000. బ్యాంకింగ్‌, బీమా, ఆర్థిక సేవల రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టటం ద్వారా ఏటా స్థిరమైన లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీనికి ఫండ్‌ మేనేజర్లుగా అంకిత్‌ పాండే, సందీప్‌ టాండన్‌ వ్యవహరిస్తారు. ‘నిఫ్టీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ టీఆర్‌ఐ’ సూచీతో క్వాంట్‌ బీఎఫ్‌ఎస్‌ఐ ఫండ్‌ పనితీరును పోల్చి చూస్తారు.

ప్రస్తుతం ఇతర మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థలకు చెందిన బీఎఫ్‌ఎస్‌ఐ విభాగానికి చెందిన పథకాలూ అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌, టాటా బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌, బరోడా బీఎన్‌పీ పారిబస్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌, సుందరమ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఫండ్‌ ఈ తరగతికి చెందిన పథకాలే. వీటిపై గత అయిదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైగా వార్షిక ప్రతిఫలం లభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని