ఆరోగ్య బీమా.. అనుబంధాలతో అదనపు రక్ష

అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆర్థికంగా ఆదుకునే బీమా ఉంటే పెద్ద ఊరటను ఇస్తుంది. చాలామంది ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేప్పుడు తక్కువ ప్రీమియం గురించే ఆలోచిస్తుంటారు.

Published : 09 Jun 2023 00:33 IST

అనుకోకుండా ఆసుపత్రిలో చేరినప్పుడు, ఆర్థికంగా ఆదుకునే బీమా ఉంటే పెద్ద ఊరటను ఇస్తుంది. చాలామంది ఆరోగ్య బీమా పాలసీని తీసుకునేప్పుడు తక్కువ ప్రీమియం గురించే ఆలోచిస్తుంటారు. ప్రస్తుత అవసరాల్లో తగిన మొత్తానికి బీమా పాలసీ ఉండాలి. సమగ్ర ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో దాని ప్రయోజనాలు పరిమితంగానే ఉండొచ్చు. ఇలాంటప్పుడే అనుబంధ పాలసీలు మనకు తోడ్పడతాయి.

రోగ్య బీమా పాలసీని ఎంచుకునేటప్పుడు బీమా మొత్తం కీలకమైన అంశం. దీనికి అవసరమైన యాడ్‌ ఆన్‌లు, రైడర్లనూ తీసుకోవాలి. ఇప్పుడు చాలా బీమా సంస్థలు సమగ్ర ఆరోగ్య బీమా పాలసీకి అదనపు భద్రతను అందిస్తున్నాయి.

ప్రాథమిక ఆరోగ్య బీమా పాలసీతో పాటు ఐచ్ఛికంగా ఎంచుకోవాల్సిన కొన్ని ప్రత్యేక పాలసీలను అనుబంధ పాలసీలు (యాడ్‌-ఆన్‌) అంటారు. బీమా చేసిన వ్యక్తికి కొన్ని అవసరాలు ఉన్నప్పుడే ఈ పాలసీలు ఉపయోగపడతాయి. వీటికోసం అదనంగా కొంత ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలున్న వారెవరైనా ఈ యాడ్‌-ఆన్‌ కవరేజీలను తీసుకోవచ్చు.

ఐఆర్‌డీఏఐ నిబంధనల ప్రకారం అనుబంధాలు లేదా రైడర్లకు వసూలు చేసే ప్రీమియం ప్రామాణిక పాలసీలో 30 శాతానికి మించి ఉండకూడదు. కొన్ని ప్రధాన అనుబంధ పాలసీలను గమనిస్తే..

క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌: సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీలు అన్ని రకాల చికిత్సలకూ పరిహారం ఇస్తాయి. ఇలాంటప్పుడు ప్రత్యేకంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ ఎందుకు అనే ప్రశ్న వస్తుంది. ప్రామాణిక పాలసీలు వైద్య ఖర్చులను మాత్రమే భరిస్తాయి. తీవ్రమైన అనారోగ్యం వచ్చినప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బును అందించవు. క్రిటికల్‌ ఇల్‌నెస్‌ కవర్‌ తీసుకున్నప్పుడు పాలసీదారుడికి ఏదైనా తీవ్ర అనారోగ్యాన్ని గుర్తిస్తే.. వెంటనే పాలసీ విలువ మేరకు పరిహారాన్ని అందిస్తుంది. పాలసీలో పేర్కొన్న వ్యాధుల బారిన పడినప్పుడే ఇది వర్తిస్తుంది.

వ్యక్తిగత ప్రమాద బీమా: ప్రమాదాలకు ఎలాంటి వేచి ఉండే సమయం లేకుండానే ఆరోగ్య బీమాలో రక్షణ లభిస్తుంది. ఆసుపత్రిలో చేరినప్పుడు అయిన ఖర్చులు మాత్రమే ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తాయి. పాలసీదారుడు పాక్షిక లేదా శాశ్వత వైకల్యం పొందినప్పుడు అతనికి ఆర్థిక భద్రత లభించదు. ఇలాంటి సందర్భాల్లోనే వ్యక్తిగత ప్రమాద బీమా రైడర్‌ తోడ్పడుతుంది. దురదృష్టవశాత్తూ మరణిస్తే.. నామినీకి పాలసీ విలువ లభిస్తుంది.

రోజు ఖర్చుల కోసం: పాలసీదారుడు ఆసుపత్రిలో చేరిన రోజు నుంచి ఖర్చుల కోసం నగదును చెల్లించేలా హాస్పిటల్‌ క్యాష్‌ కవర్‌ పాలసీని తీసుకోవచ్చు. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే బీమా చేసిన వ్యక్తి కనీసం 24 గంటల పాటు ఆసుపత్రిలో ఉండాలి. ఆసుపత్రిలో చేరినప్పుటి నుంచి వరుసగా 14 రోజుల పాటు, పాలసీ ఏడాదిలో గరిష్ఠంగా 30 రోజుల వరకూ రోజుకు రూ.1,000 చొప్పున పరిహారం లభిస్తుంది.

ప్రసూతి సమయంలో: కొన్ని ఆరోగ్య బీమా సంస్థలు ఫ్యామిలీ ఫ్లోటర్‌ పాలసీలో ప్రసూతి ఖర్చులనూ చెల్లిస్తున్నాయి. ప్రసవానికి సంబంధించిన అన్ని ఖర్చులు, నవజాత శిశువుకు ఏదైనా ఇబ్బంది వస్తే చికిత్స వ్యయంలాంటివి చెల్లిస్తాయి. ఇందుకోసం మెటర్నటీ కవర్‌ను తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పాలసీలు వేచి ఉండే వ్యవధి నిబంధన విధిస్తాయి. గమనించండి.

టాపప్‌ చేసుకోవచ్చు: ఇప్పటికే ఉన్న ఆరోగ్య బీమా పాలసీ పరిమితి పూర్తయినప్పుడు.. అదనపు మొత్తాన్ని చెల్లించేలా టాపప్‌ పాలసీని తీసుకోవచ్చు. టాపప్‌ పాలసీ బీమా మొత్తాన్ని పెంచుకునేందుకు ఉపయోగపడుతుంది. దీనికి ప్రీమియం కాస్త తక్కువగా ఉంటుంది.

ఓపీడీ చికిత్సలకూ: ఔట్‌ పేషెంట్‌ సంప్రదింపులను వైద్య బీమా పాలసీలు కవర్‌ చేయవు. నిర్ణీత చికిత్సలకు మాత్రమే డే కేర్‌ ప్రయోజనాన్ని అందిస్తాయి. వైద్య ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో డాక్టర్‌ కన్సల్టేషన్‌ ఫీజు, వైద్య పరీక్షల ఖర్చు, మందుల వంటి వాటికీ పరిహారం ఇచ్చేలా ఓపీడీ కేర్‌ అనుబంధ పాలసీని తీసుకోవచ్చు.

అనుబంధ పాలసీలను ఎంచుకునేటప్పుడు మీ అవసరాలు ఏమిటో గుర్తించండి. అన్ని పాలసీలనూ జోడించుకునే ప్రయత్నం మంచిది కాదు. ఇది ఆర్థికంగా భారమవుతుంది. కాబట్టి, పూర్తి అవగాహనతో సరైన నిర్ణయం తీసుకోండి.

కొత్త కార్తీక్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని