కొత్త మదుపరులకు 5 సూత్రాలు

దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక మార్గం.

Updated : 22 Sep 2023 07:05 IST

మ్యూచువల్‌ ఫండ్లు

దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టడం ఒక మార్గం. పెట్టుబడుల తొలి అడుగు ప్రారంభించేందుకూ ఇవి ఉత్తమం. ఎంతోమందికి మదుపు చేయాలనే ఆలోచన ఉంటుంది. కానీ, అంత డబ్బు తమ దగ్గర లేదంటూ వెనకడుగు వేస్తుంటారు. తక్కువ మొత్తంతో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికీ ఇవి ఎంతో అనుకూలమే. ఈ నేపథ్యంలో క్రమానుగత పెట్టుబడి విధానంతో తమ
పెట్టుబడులను మొదలు పెట్టే వారు పాటించాల్సిన కొన్ని అంశాలను చూద్దాం.

మ్యూచువల్‌ ఫండ్లలో ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేందుకు వీలుంది. నెలకు నిర్ణీత మొత్తం చొప్పున క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేయొచ్చు. కొద్ది మొత్తంతో ప్రారంభించి, కాలం గడుస్తున్న కొద్దీ పెట్టుబడి మొత్తాన్ని పెంచుకోవచ్చు. తక్కువ నష్టభయంతో దీర్ఘకాలంలో అధిక మొత్తాన్ని పోగు చేసేందుకు ఇవి సహాయపడతాయి. ఆదాయం, ఆర్థిక లక్ష్యాలను బట్టి, మీరు అనుకున్నంత కాలంపాటు ప్రతి వారం, నెల, త్రైమాసికం లేదా ఆరు నెలలకోసారి నిర్ణీత మొత్తాన్ని మదుపు చేయొచ్చు. ఇందులో రూ.500తోనూ పెట్టుబడులు ప్రారంభించవచ్చు.  

పెట్టుబడి లక్ష్యాలను గుర్తించండి

మీరు సిప్‌ ప్రారంభించడానికి ముందు దీర్ఘకాలమా, స్వల్పకాలమా అనే స్పష్టత ఉండాలి. ఈ పెట్టుబడి ద్వారా మీరు ఏ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నారు అనేది గుర్తించడం చాలా అవసరం. ఇలా లెక్కలు వేసుకున్నప్పుడే మీకు కావాల్సిన నిధి, పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం, వ్యవధి విషయాల్లో కొంత అవగాహన వస్తుంది.

కారు కొనడం, ఇల్లు కట్టడం, పిల్లల చదువులు, వివాహం మొదలైన ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వీటిని సాధించేందుకు ఒక సిప్‌ సరిపోకపోవచ్చు. కాబట్టి, ఆర్థిక లక్ష్యాల సంఖ్యపై ఆధారపడి, మీరు మీ లక్ష్యాలను తీర్చేందుకు ప్రతిదానికో ప్రత్యేక సిప్‌ను ప్రారంభించాలి.

పథకం ఎంపికలో...

మార్కెట్లో ఎన్నో మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఈక్విటీ, డెట్‌, హైబ్రిడ్‌ ఇలా రకరకాల విభాగాలూ ఉన్నాయి. మీ నష్టభయం భరించే సామర్థ్యం, రాబడి అంచనాలు, ఆర్థిక లక్ష్యాలు, వ్యవధి ఇలా పలు అంశాలను పరిశీలించాకే తగిన మ్యూచువల్‌ ఫండ్‌ను ఎంచుకోవాలి. ఉదాహరణకు నష్టం వచ్చినా ఇబ్బంది లేదు.. అధిక రాబడిని ఆశిస్తే.. దీర్ఘకాలిక వ్యవధికి ఈక్విటీ పెట్టుబడులను ఎంచుకోవచ్చు. తక్కువ నష్టభయం ఉండాలి అనుకుంటే డెట్‌ పథకాలు అందుబాటులో ఉంటాయి. కాస్త మధ్యస్థంగా నష్టభయం ఉండాలి అనుకున్నప్పుడు హైబ్రిడ్‌ ఫండ్లు ఎంచుకోవాలి.

సరైన పథకం, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ ఎంపికా చాలా ముఖ్యం. మార్కెట్లో అనేక మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు విభిన్నమైన పెట్టుబడి పథకాలను అందిస్తున్నాయి. మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీ అన్ని ఫథకాలకూ ఆకర్షణీయమైన రాబడిని అందించే సామర్థ్యం ఉండకపోవచ్చు. సరైన మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీని ఎంచుకునేందుకు కంపెనీ చరిత్ర, పెట్టుబడి వ్యయం, పథకం గత పనితీరు, అధిక రాబడిని సాధించగల ఫండ్‌ మేనేజర్‌ సామర్థ్యం మొదలైన అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి.

వైవిధ్యంగా ఉండేలా..

పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవడం ఎప్పుడూ మంచి మదుపు వ్యూహం. ముందే చెప్పినట్లు నష్టభయం భరించే సామర్థ్యం, రాబడి అంచనాల ప్రకారం పలు రకాల పథకాలను ఎంచుకోవాలి. వయసు, ఆర్థిక బాధ్యతలు, పెట్టుబడి వ్యవధి, ఆదాయం, బాధ్యతలు తదితర అంశాలు పెట్టుబడిదారుడి నష్టభయాన్ని ప్రభావితం చేస్తాయి. వైవిధ్యమైన పెట్టుబడులు నష్టాలను తగ్గించడంలో సహాయం చేస్తాయి. ఈ వైవిధ్యం సాధించేందుకు రకరకాల పథకాలు, ఫండ్‌ కంపెనీలలో మీ పెట్టుబడులు ఉండేలా చూసుకోవాలి. అదే సమయంలో మితి మీరిన వైవిధ్యం పెట్టుబడులపై రాబడిని తగ్గిస్తుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా

పెట్టుబడి పెట్టేటప్పుడు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. సిప్‌ను ఎంచుకునేటప్పుడు ఇప్పటికే ఉన్న ద్రవ్యోల్బణాన్ని తప్పనిసరిగా పరిగణించాలి. భవిష్యత్తులో ఏ మేరకు ఉంటుందో పరిశీలించాలి. మీరు ఇప్పుడు పెట్టుబడి పెట్టే లక్ష్యాలు భవిష్యత్‌లో మారిపోవచ్చు. మీ అవసరాలను తీర్చేందుకు అధిక మొత్తంలో డబ్బు అవసరం కావచ్చు. చాలామంది అనేక పెట్టుబడి పథకాల్లో మదుపు చేస్తుంటారు. కానీ, లక్ష్య సాధనకు కావాల్సిన మొత్తం వారికి అందకపోవడం కనిపిస్తుంది. పెట్టుబడి వ్యవధిలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయకపోవడం వల్లే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి, ఇలాంటి పొరపాటు చేయొద్దు. ఆర్థిక లక్ష్యం చేరుకునే నాటికి ఎంత మేరకు ద్రవ్యోల్బణం ఉంటుంది, దానివల్ల ఎంత అధికంగా కావాల్సి వస్తుందన్న లెక్కలు వేసుకోవాలి. దానికి అనుగుణంగా సిప్‌ మొత్తాన్ని నిర్ణయించుకోవాలి.

సమీక్షిస్తూ ఉండండి

పెట్టుబడి అంటే మీరు మీ డబ్బును కొన్ని పథకాల్లో మదుపు చేసి మర్చిపోవడం కాదు. మీ పెట్టుబడి పనితీరును క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉండాలి. ఒక్కోసారి పెట్టుబడి ఆశించిన స్థాయిలో పనిచేయకపోవచ్చు. ఇది ఫండ్ల ఎంపికలో పొరపాటు లేదా మార్కెట్‌ పరిస్థితి వల్ల కావచ్చు. పెట్టుబడిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటేనే ఈ విషయాన్ని కనిపెట్టేందుకు వీలవుతుంది. లక్ష్యాలను సకాలంలో సాధించేందుకు ఆశించిన రాబడి రావాల్సిందే అని మర్చిపోవద్దు. పనితీరు బాగాలేని పథకాల నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకొని, మెరుగైన రాబడి అవకాశాలను అందించే పథకాల్లోకి మార్చుకోవాలి. సిప్‌ దీర్ఘకాలంలో రూపాయి సగటు ప్రయోజనాన్ని అనుమతిస్తుంది. కాబట్టి, మీరు ఎంత ఎక్కువ కాలం మార్కెట్లో కొనసాగితే అంత లాభాన్ని అందుకునేందుకు వీలవుతుంది.

ఆర్థిక క్రమశిక్షణ, సహనంతో పెట్టుబడి పెట్టండి. ఒక ఆర్థిక లక్ష్యాన్ని సాధించిన తర్వాత సిప్‌ను ఆపేయొచ్చు. మరో లక్ష్యం కోసం కొత్త పెట్టుబడి ఖాతాను ప్రారంభించాలి. ఇలా పెట్టుబడుల ప్రయాణం కొనసాగుతూనే ఉండాలి.

అధిల్‌ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని