ఆరోగ్య బీమా.. టాపప్‌ చేస్తున్నారా?

వైద్య ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీన్ని తట్టుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరిగా మారింది. మరోవైపు అధికంగా ఉన్న ప్రీమియం రేట్లు కలవరపెడుతున్నాయి.

Published : 21 Jun 2024 00:26 IST

వైద్య ద్రవ్యోల్బణం ఎప్పటికప్పుడు పెరుగుతోంది. దీన్ని తట్టుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీ తప్పనిసరిగా మారింది. మరోవైపు అధికంగా ఉన్న ప్రీమియం రేట్లు కలవరపెడుతున్నాయి. ప్రాథమిక పాలసీని తీసుకొని, దీనికి టాపప్‌ చేయించడం వల్ల కొంత భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. మరి, ఈ టాపప్‌ను ఎంచుకునేటప్పుడు ఏయే అంశాలను చూడాలి? తెలుసుకుందాం...

రోగ్య బీమా పరిమితికి మించి అదనంగా ఖర్చయినప్పుడు, టాపప్‌ పాలసీలు ఆ అధిక మొత్తాన్ని చెల్లిస్తాయి. తక్కువ ప్రీమియంతో ఎక్కువ ఆరోగ్య బీమా రక్షణ పొందాలనుకున్నప్పుడు వీటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. 

  • టాపప్‌ పాలసీని ఎంచుకునే ముందు ప్రస్తుతం మీ దగ్గర ఉన్న ప్రాథమిక పాలసీ ఎంత ఉందన్నది గమనించండి. దాని నిబంధనలూ చూసుకోండి. పాలసీ తగ్గింపులు, సహ చెల్లింపులు, పరిమితుల్లాంటివి స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడే టాపప్‌ పాలసీని ఎంచుకునేటప్పుడు ఏయే ఖర్చులకు వర్తించేలా తీసుకోవచ్చనే విషయంలో స్పష్టత వస్తుంది.
  • మీ ప్రాథమిక పాలసీ కనీసం రూ.5లక్షల మేరకు ఉండేలా చూసుకోవాలి. ఆ తర్వాతే టాపప్‌ పాలసీని తీసుకునేందుకు ప్రయత్నించాలి. ఈ పాలసీలు ఎలాంటి పరిమితి లేకుండా ఎంచుకోవచ్చు. కాబట్టి, ఎంత మేరకు ప్రీమియం చెల్లించడానికి ఇబ్బంది ఉండదో చూసుకోండి. దాన్ని బట్టి, టాపప్‌ చేయండి.
  • నగదు రహిత చికిత్స కోసం బీమా సంస్థలు ఆసుపత్రులతో ఒప్పందం చేసుకుంటాయి. టాపప్‌ పాలసీల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. కొన్ని టాపప్‌ పాలసీలు నగదు రహిత చికిత్సకు అనుమతి ఇవ్వకపోవచ్చు. బిల్లు చెల్లించిన తర్వాత, ఆ ఖర్చులను తిరిగి పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీలైనంత వరకూ నగదు రహిత చికిత్సకు అనుమతినిచ్చే ఆరోగ్య బీమా టాపప్‌ పాలసీలనే తీసుకోండి. 
  • ప్రాథమిక పాలసీలో కొన్ని షరతులు ఉంటాయి. ముఖ్యంగా వేచి ఉండే వ్యవధి, నిర్ణీత వ్యాధులకు శాశ్వత మినహాయింపులాంటి నిబంధనలు ఉండొచ్చు. టాపప్‌ పాలసీలకూ ఇలాంటివి ఉంటాయి. పరిమితులు, షరతులను అర్థం చేసుకునేందుకు పాలసీ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. మీ ఆరోగ్య అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవడం తప్పనిసరి. 
  • క్లెయిం పరిష్కారం ఎలా ఉంటుందో ముందే బీమా సంస్థను అడిగి తెలుసుకోండి. గత చరిత్రను పరిశీలించండి. కంపెనీ సేవా కేంద్రం పనితీరు, క్లెయింల నిర్వహణ ప్రక్రియను అంచనా వేయండి. 
  • టాపప్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియానికీ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 80డీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని