ప్రమాదంలో ఆర్థిక ధీమా

ప్రమాదం జరిగినప్పుడు గాయాలు అవడంతోపాటు, కొన్నిసార్లు శాశ్వత వైకల్యమూ సంభవిస్తుంది. ప్రమాద తీవ్రత అధికంగా ఉంటే మరణించే ఆస్కారమూ ఉంది.

Published : 21 Jun 2024 00:26 IST

ప్రమాదం జరిగినప్పుడు గాయాలు అవడంతోపాటు, కొన్నిసార్లు శాశ్వత వైకల్యమూ సంభవిస్తుంది. ప్రమాద తీవ్రత అధికంగా ఉంటే మరణించే ఆస్కారమూ ఉంది. ఇలాంటప్పుడు ఎదురయ్యే ఆర్థిక ఒత్తిడి నుంచి కాపాడేది వ్యక్తిగత ప్రమాద బీమా. దీన్ని దృష్టిలో పెట్టుకునే రిలయన్స్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌ ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది. దీని పేరు
రిలయన్స్‌ పర్సనల్‌ యాక్సిడెంట్‌ 360 షీల్డ్‌. వ్యక్తిగతంగా, కుటుంబం అంతటికీ వర్తించేలా ఈ పాలసీని తీసుకునే వీలుంది. పాలసీదారుడికి అనుకోని ప్రమాదం జరిగినప్పుడు ఆసుపత్రి ఖర్చులు, ఔట్‌ పేషెంట్‌ ఖర్చులు చెల్లించడంతోపాటు, గృహ, వాహన, విద్య, వ్యక్తిగత రుణాల వంటి వాటికీ కవరేజీ వర్తిస్తుంది. శాశ్వత వైకల్యం సందర్భాల్లో తీవ్రతను బట్టి, పాలసీ మొత్తానికి రెండు రెట్ల వరకూ పరిహారం చెల్లిస్తుంది. కోలుకునే వరకూ ఆదాయాన్ని అందించేలానూ పాలసీని ఎంచుకోవచ్చు. క్లెయిం చేసుకోని ఏడాదిలో క్యుములేటివ్‌ బోనస్‌నూ అందిస్తుంది. ప్రయాణ బీమా సౌకర్యాన్నీ ఇదే పాలసీలో పొందవచ్చు. ప్రయాణం రద్దయినప్పుడు రూ.25వేల వరకూ పరిహారం అందిస్తుంది. సాహస క్రీడల్లో గాయపడిన సందర్భంలోనూ పరిహారం అందుకునే ఏర్పాటు ఉంది. ఈ పాలసీని రూ.5 లక్షల నుంచి రూ.25 కోట్ల వరకూ తీసుకునే వీలుంది.


రక్షణ సంస్థల షేర్లలో

రక్షణ రంగంలోని కంపెనీలకు గత కొంతకాలంగా విశేషంగా వృద్ధి అవకాశాలు లభిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం రక్షణ కొనుగోళ్ల విషయంలో దేశీయ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. దీనికి తోడు ఎగుమతులనూ గణనీయంగా ప్రోత్సహిస్తోంది. దీనివల్ల మన దేశం నుంచి వార్షిక రక్షణ ఎగుమతులు రూ.20,000 కోట్లకు మించిపోవటం గమనార్హం. అంతేగాక వచ్చే అయిదారేళ్లలో రక్షణ ఎగుమతులను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో రక్షణ రంగంలోని ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలకు అధిక ఆదాయాలు, లాభాలు నమోదు చేసే అవకాశం కలుగుతోంది. అందుకే గత కొంతకాలంగా ఈ రంగంలోని కంపెనీల షేర్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఇంకా పెరిగే అవకాశమూ కనిపిస్తోంది. ఈ సానుకూలతను పరిగణనలోకి తీసుకొని మోతీలాల్‌ ఓస్వాల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ‘మోతీలాల్‌ ఓస్వాల్‌ నిఫ్టీ ఇండియా డిఫెన్స్‌ ఇండెక్స్‌ ఫండ్‌’ అనే పథకాన్ని ఆవిష్కరించింది. రక్షణ రంగంలోని కంపెనీలపై పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఆర్జించాలన్నది ఈ ఫండ్‌ ప్రధాన లక్ష్యం. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 24వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ ఇండియా డిఫెన్స్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు. స్వప్నిల్‌ మయేకర్, రాకేష్‌ షెట్టి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు. మదుపరులు కనీసం అయిదేళ్లపాటు ఇందులో పెట్టుబడిని కొనసాగించగలిగితే అధిక లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. 


ఉత్పత్తి పరిశ్రమల్లో

ఉత్పత్తి రంగంలోని కంపెనీలపై పెట్టుబడి పెట్టే వ్యూహంతో బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యూచువల్‌ ఫండ్, ఒక నూతన పథకాన్ని ఆవిష్కరించింది. ‘బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 24వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీస పెట్టుబడి రూ.1,000. నిఫ్టీ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్‌ టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. జితేంద్ర శ్రీరాం దీనికి ఫండ్‌ మేనేజర్‌గా వ్యవహరిస్తారు. 
సేకరించిన నిధుల్లో కనీసం 80 శాతం ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి పెడతారు. కొంత సొమ్మును రుణ పత్రాలకు, రీట్‌/ ఇన్విట్‌లకు కేటాయించే అవకాశం ఉంది. మనదేశంలో ఉత్పత్తి రంగం సమీప భవిష్యత్తులో అత్యంత క్రియాశీలకంగా మారనుంది. ఆటోమొబైల్, రక్షణ ఉత్పత్తులు, నౌకల నిర్మాణం, హెలీకాఫ్టర్లు/ విమానాల విడిభాగాలు, యుద్ధ విమానాలు మనదేశంలో ఉత్పత్తి కావటంతో పాటు వాటిని వివిధ దేశాలకు ఎగుమతి చేసే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి అత్యంత లాభాదాయకంగా ఉంటుందని అంచనాలున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని