చెక్కులకు అదనపు భద్రత...

డిజిటల్‌ చెల్లింపులు జోరందుకున్నప్పటికీ.. అధిక విలువగల లావాదేవీలకు ఇప్పటికీ చెక్కులు కీలకంగానే ఉన్నాయి. చెక్కులో పేర్కొన్న మొత్తాన్ని దిద్దడం, ఫోర్జరీ సంతకాలు వంటి ఇబ్బందులున్నప్పటికీ.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇవి ఎంతో ప్రధానమైనవిగానే చెప్పొచ్చు. ఈ మోసాలకు తావు లేకుండా

Published : 05 Aug 2022 00:47 IST

డిజిటల్‌ చెల్లింపులు జోరందుకున్నప్పటికీ.. అధిక విలువగల లావాదేవీలకు ఇప్పటికీ చెక్కులు కీలకంగానే ఉన్నాయి. చెక్కులో పేర్కొన్న మొత్తాన్ని దిద్దడం, ఫోర్జరీ సంతకాలు వంటి ఇబ్బందులున్నప్పటికీ.. బ్యాంకింగ్‌ వ్యవస్థలో ఇవి ఎంతో ప్రధానమైనవిగానే చెప్పొచ్చు. ఈ మోసాలకు తావు లేకుండా ఇప్పుడు పాజిటివ్‌ పే సిస్టమ్‌ (పీపీఎస్‌) అందుబాటులోకి వచ్చింది. దీంతో చెక్కులకు మరింత అదనపు భద్రత లభిస్తోంది. చెక్కు మొత్తం, చెక్కు తీసుకున్న వ్యక్తి వివరాలు బ్యాంకుకు ముందుగా తెలియజేస్తే తప్ప.. బ్యాంకులు చెక్కులను అంగీకరించవు.

రూ.5 లక్షలు అంతకంటే.. అధిక విలువ చెక్కులకు చెల్లింపులు చేసేముందు ఖాతాదారుల నుంచి బ్యాంకులు పీపీఎస్‌ నిర్ధారణ తీసుకుంటాయి. ఈ నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఈ ప్రక్రియను అభివృద్ధి చేసింది. ఆర్‌బీఐ ఇప్పటికే దీని అమలు గురించి మార్గదర్శకాలను జారీ చేసింది. చెక్కుల చెల్లింపులో భద్రతను పెంచడం, చెక్కుల ట్యాంపరింగ్‌ కారణంగా జరిగే మోసాలను తగ్గించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఖాతాదారులు అన్ని చెక్కుల కోసం సదుపాయాన్ని ఉపయోగించుకునే విచక్షణ ఉంటుంది. అయితే, రూ.5 లక్షలు అంతకంటే ఎక్కువ మొత్తాలకు ఇది తప్పనిసరి.

పీపీఎస్‌ నిర్ధారణ కింద ఖాతాదారులు చెక్కు నెంబరు, తేదీ, మొత్తాన్ని అంకెలు, అక్షరాల్లో తెలియజేస్తూ.. చెక్కును తీసుకున్న వ్యక్తి పేరు, లావాదేవీ కోడ్‌ను బ్యాంక్‌కు తెలియజేయాలి. వివరాలను ఎస్‌ఎంఎస్‌, మొబైల్‌ యాప్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం ద్వారా రోజులో ఎప్పుడైనా.. లేదా సంబంధిత బ్యాంకు శాఖ, సేవా కేంద్రంలో (పనివేళల్లో) నమోదు చేయొచ్చు. చెక్కు చెల్లింపు కోసం వచ్చినప్పుడు బ్యాంకు అన్ని వివరాలూ ధ్రువీకరించుకొని, ఏ విధమైన వ్యత్యాసం లేకుంటే.. దాన్ని క్లియర్‌ చేస్తుంది. ఒకసారి నమోదు చేసిన తర్వాత వాటిని మార్చడం కుదరదు. కాకపోతే.. చెక్కును చెల్లింపు చేయకుండా నిలిపివేసే అధికారం ఖాతాదారుడికి ఉంటుంది. చెక్కులు ఇచ్చే ఖాతాదారులు అది చెల్లింపు కోసం వచ్చినప్పుడు ఖాతాలో తగిన మొత్తం ఉండేలా చూసుకోవాలి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని