Home loan: రెపో రేటుకు మారారా?

వడ్డీ రేట్లలో పారదర్శకత కోసం 2016లో ఆర్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు)ను ప్రామాణిక సూచీగా తీసుకొచ్చింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను సవరించినప్పుడల్లా.. ఆ ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు వేగంగా బదిలీ చేసేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చింది.

Updated : 05 Aug 2022 11:58 IST

వడ్డీ రేట్లలో పారదర్శకత కోసం 2016లో ఆర్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ (మార్జినల్‌ కాస్ట్‌ ఆఫ్‌ ఫండ్స్‌ బేస్డ్‌ లెండింగ్‌ రేటు)ను ప్రామాణిక సూచీగా తీసుకొచ్చింది. ఆర్‌బీఐ వడ్డీ రేట్లను సవరించినప్పుడల్లా.. ఆ ప్రయోజనాన్ని రుణగ్రహీతలకు వేగంగా బదిలీ చేసేందుకు వీలుగా దీన్ని తీసుకొచ్చింది. బ్యాంకులు డిపాజిట్ల సమీకరణకు చేసిన వ్యయాల ఆధారంగా ఈ ఎంసీఎల్‌ఆర్‌ను నిర్ణయించుకుంటాయి. ఒక రోజు నుంచి మూడేళ్ల వ్యవధికి ఈ వడ్డీ రేటును నిర్ణయిస్తుంటాయి. బ్యాంకులు తాము కనీసం ఎంత వడ్డీకి రుణాలను ఇస్తాయన్నది ఈ ఎంసీఎల్‌ఆర్‌ నిర్ణయిస్తుంది.
ఆర్‌బీఐ మరోసారి రెపో రేటు పెంచుతుంది అన్న అంచనాలతో ఈ నెల 1 నుంచి దాదాపు అన్ని బ్యాంకులూ ముందుగానే తమ ఎంసీఎల్‌ఆర్‌ను పెంచడం ప్రారంభించాయి. దీంతోపాటు గృహరుణ సంస్థలూ తమ ప్రామాణిక రేటును 25 బేసిస్‌ పాయింట్ల మేరకు పెంచాయి. బ్యాంకులు దాదాపు 10-25 శాతం వరకూ వడ్డీ రేట్లను పెంచాయి. అక్టోబరు 2019 వరకూ బ్యాంకులు ఎంసీఎల్‌ఆర్‌ విధానంలోనే గృహరుణాలను జారీ చేశాయి. ఆ తర్వాత ఆర్‌బీఐ ప్రామాణిక వడ్డీ రేటుగా రెపోను పరిగణించాలని పేర్కొనడంతో.. ప్రస్తుతం రెపో ఆధారిత వడ్డీ రేట్లు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) అందుబాటులోకి వచ్చాయి.
కొంత కాలం క్రితం వరకూ వడ్డీ రేట్లు చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ, పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ఆర్‌బీఐ రెపో రేటును పెంచడం ప్రారంభించింది. ఇప్పటికే 90 బేసిస్‌ పాయింట్లు పెరిగిన ఈ వడ్డీ రేటు.. మరో 25-35 బేసిస్‌ పాయింట్లు పెరుగుతుందని భావిస్తున్నారు. అయినప్పటికీ ఎంసీఎల్‌ఆర్‌తో పోలిస్తే.. రెపో ఆధారిత వడ్డీ రేట్లు తక్కువగానే ఉండే  అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికీ మీ గృహరుణం ఎంసీఎల్‌ఆర్‌లో కొనసాగుతూ ఉంటే.. దాన్ని వెంటనే ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌లోకి మార్చుకునేందుకు ప్రయత్నించండి. దీనికోసం మీ రుణానికి బ్యాంకు ఏ విధానంలో వడ్డీ రేటు వసూలు చేస్తోందో తెలుసుకోండి. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేటు వల్ల పడుతున్న భారం ఎంత? కొత్తగా రెపో ఆధారిత వడ్డీ రేటుకు మారితే మార్పు ఎలా ఉంటుందో లెక్కించుకోండి. దీని ఆధారంగా రెపో రేటుకు మారాలా.. ఎంసీఎల్‌ఆర్‌లోనే కొనసాగాలా అనేది తెలుస్తుంది. రెపోకు మారడం వల్ల వడ్డీ భారం లేదా వ్యవధి తగ్గుతుందనుకుంటే.. బ్యాంకుకు ఆ విషయాన్ని తెలియజేయండి. ఇప్పటికే కొన్ని బ్యాంకులు తమ రుణ గ్రహీతలను రెపో రేటుకు మార్చేశాయి. కొత్తగా మారాలనుకునే వారికి అసలు మొత్తంలో దాదాపు అర శాతం వరకూ ప్రాసెసింగ్‌ ఫీజును చెల్లించాల్సిందిగా అడుగుతున్నాయి. నేడు ఆర్‌బీఐ తీసుకునే నిర్ణయం మీ గృహరుణ రేటును పెంచే అవకాశం ఉంది. దీనికీ సిద్ధంగా ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని