వ్యక్తిగత రుణం తీసుకున్నారా?

అవసరం ఏమిటన్నది చూడకుండా.. అప్పులు ఇస్తున్న సంస్థలు ఎన్నో. వ్యక్తిగత రుణం తీసుకున్న చాలామంది.. వాటిని సకాలంలో తీర్చలేక ఇబ్బంది ఎదుర్కొంటుండం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. ఎలాంటి చిక్కులు రాకుండా చూసుకోవచ్చు.

Published : 12 Aug 2022 00:37 IST

అవసరం ఏమిటన్నది చూడకుండా.. అప్పులు ఇస్తున్న సంస్థలు ఎన్నో. వ్యక్తిగత రుణం తీసుకున్న చాలామంది.. వాటిని సకాలంలో తీర్చలేక ఇబ్బంది ఎదుర్కొంటుండం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సందర్భాల్లో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే.. ఎలాంటి చిక్కులు రాకుండా చూసుకోవచ్చు.

రుణం తీసుకునేటప్పుడు నెలవారీ వాయిదా బ్యాంకు ఖాతా నుంచి నేరుగా వెళ్లేలా ఈసీఎస్‌ (ఎలక్ట్రానిక్‌ క్లియరింగ్‌ సిస్టం)కు అనుమతినిస్తాం. కాబట్టి, సమయానికి బ్యాంకులో వాయిదాకు సరిపడా డబ్బు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. గతంలో ఆదివారాలు, సెలవు దినాల్లో ఈసీఎస్‌ ఉండేది కాదు. కానీ, ఇప్పుడు ఇలాంటి వెసులుబాట్లు లేవు. ఎప్పుడైనా సరే.. నిర్ణీత తేదీ నాడు బ్యాంకు/ ఆర్థిక సంస్థకు వాయిదా వెళ్లిపోతుంది. మీ రుణ వాయిదాకు ఒక రోజు ముందు.. తర్వాత రోజు మీ బ్యాంకు ఖాతా వివరాలు పరిశీలించడం మర్చిపోకండి.
* ఒకవేళ వాయిదాలకు చెల్లించాల్సిన డబ్బు మీ దగ్గర లేదనుకుందాం.. ఇలాంటి సమయంలో మీ దగ్గరున్న అత్యవసర నిధి లేదా ఇతర పొదుపు మొత్తాన్ని తాత్కాలికంగా ఈ అవసరానికి ఉపయోగించుకోవచ్చు. మళ్లీ చేతిలో డబ్బు రాగానే మీరు డబ్బును తీసిన ఖాతాలో జమ చేయాలి.
* వ్యక్తిగత రుణం తీసుకున్నప్పుడు.. కనీసం రెండు మూడు ఈఎంఐలకు సరిపడా మొత్తాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. కాస్త రాబడి వచ్చేలా.. లిక్విడ్‌ ఫండ్లలో మదుపు చేయడం ఉత్తమం. అత్యవసర నిధి ఏర్పాటు చేసుకునేటప్పుడు వ్యక్తిగత రుణ వాయిదాలనూ లెక్కలోకి తీసుకోవాలి.
* అనుకోని పరిస్థితుల్లో రుణ వాయిదాలు చెల్లించడం సాధ్యం కాలేదనుకుందాం. ఈ విషయాన్ని బ్యాంకు/ఆర్థిక సంస్థకు ముందుగానే తెలియజేయండి. మీ పరిస్థితిని వివరించండి. మీ వాయిదాలను తాత్కాలికంగా నిలిపి వేయాల్సిందిగా కోరవచ్చు. సాధారణంగా బ్యాంకులు దీన్ని అంగీకరిస్తాయి. రుణ సంస్థలు జరిమానా విధించే అవకాశమే ఎక్కువ. కానీ, విషయాన్ని ముందే తెలియజేయడం వల్ల మీపై ఒత్తిడి పెట్టకపోవచ్చు.
* రుణమేదైనా.. దానికి తగిన బీమా పాలసీ తీసుకోవడం మర్చిపోవద్దు. అనుకోకుండా ఏదైనా జరిగినప్పుడు కుటుంబ సభ్యులపై రుణ భారం ఉండకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని బీమా సంస్థలు ఉద్యోగం కోల్పోయిన సందర్భంలోనూ రుణ వాయిదాలను చెల్లించే పాలసీని అందుబాటులోకి తెచ్చాయి. ఇలాంటి వాటిని పరిశీలించవచ్చు.
* ఆర్‌బీఐ గుర్తింపు పొందిన సంస్థల నుంచే రుణం తీసుకోవడం ఎప్పుడూ సురక్షితం. అడగకుండానే అప్పు ఇస్తామంటూ వెంటపడే సంస్థల ఒత్తిడితో అప్పు తీసుకున్న తర్వాత.. ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు.
* రుణం తీర్చినా వేధిస్తున్న కొన్ని దారుణ యాప్‌ల సంగతి మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సంఘటనలు ఎదురైతే పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు. ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ కింద ఫిర్యాదును నమోదు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని