లాభాలనిచ్చే సరికొత్త వ్యూహం...

స్టాక్‌ మార్కెట్లో విజయం సాధించేందుకు ఎన్నో మార్గాలు, వ్యూహాలు ఉంటాయి. సూచీలు పెరుగుతున్న వేళ.. నిష్క్రియాత్మక పెట్టుబడిని (ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) ఎంచుకోవడం ద్వారా రాబడిని ఆర్జించడం ఇప్పుడు చాలామంది పాటిస్తున్న వ్యూహం. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు,

Published : 12 Aug 2022 00:37 IST

స్టాక్‌ మార్కెట్లో విజయం సాధించేందుకు ఎన్నో మార్గాలు, వ్యూహాలు ఉంటాయి. సూచీలు పెరుగుతున్న వేళ.. నిష్క్రియాత్మక పెట్టుబడిని (ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌) ఎంచుకోవడం ద్వారా రాబడిని ఆర్జించడం ఇప్పుడు చాలామంది పాటిస్తున్న వ్యూహం. ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్లు, ఇండెక్స్‌ ఫండ్లను ఇందుకోసం ఎక్కువగా పరిశీలిస్తున్నారు. దీనికి మరింత శక్తిని ఇచ్చే ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ ఇప్పుడు సరికొత్త వ్యూహం. ప్రపంచంలో పలు మార్కెట్లలో ఇప్పటికే దీన్ని పాటించడం ప్రారంభించారు. మన దేశంలో ఈ వ్యూహం ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది.

పెట్టుబడి ప్రధాన లక్ష్యం.. మంచి రాబడిని సాధించడమే. ఇదే వ్యూహంతో ఫ్యాక్టర్‌ ఇన్వెస్టింగ్‌ పనిచేస్తుంది. మెరుగైన రాబడిని అందుకునేందుకు తోడ్పడే పెట్టుబడులను ఎంపిక చేసుకోవడమే దీని లక్ష్యం. ఫండమెంటల్‌ ఆధారంగా షేర్లను ఎంపిక చేసుకోవడం ఒక విధానమైతే.. షేర్ల ధరలను ఆధారంగా వాటి గమనాన్ని అర్థం చేసుకోవడం రెండోది. తక్కువ హెచ్చుతగ్గులు, ధరల కదలిక, విలువ, డివిడెండు చెల్లింపు, పేరు వంటి ఇతర అంశాలూ షేర్ల ఎంపికలో కీలకమే.
ఫ్యాక్టర్‌ ఆధారిత పోర్ట్‌ఫోలియోలో.. కొన్ని అంశాలను ప్రాతిపదికగా తీసుకొని, షేర్ల ఎంపిక జరుగుతుంది. ఉదాహరణకు.. విలువ ఆధారంగా కంపెనీలను ఎంచుకొని, వాటిలో మదుపు చేయడం. నిఫ్టీ 50 లేదా నిఫ్టీ 500 ఇండెక్స్‌ షేర్ల నుంచి వీటిని ఎంచుకుంటారు. నిఫ్టీ 50లో మంచి రాబడినిచ్చే 20 కంపెనీలతో పెట్టుబడుల జాబితా తయారవుతుంది. ఇందులోనూ పెట్టుబడిపై వస్తున్న రాబడి, షేరు ఆర్జిస్తున్న ఆదాయం, పుస్తక విలువ, డివిడెండ్‌ రాబడి ఇలా కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలిస్తారు.

ఒకే విధానం కాకుండా..
ఏదో ఒక వ్యూహం ఆధారంగా షేర్లను ఎంపిక చేసుకొని, పెట్టుబడులు కొనసాగించడం వల్ల దీర్ఘకాలంలో లాభాలను ఆర్జించండం అంత తేలిక కాకపోవచ్చు. ఉదాహరణకు మార్కెట్‌ పరిస్థితులు బాగున్నప్పుడు.. ఆ దశలో కొన్ని షేర్లు మంచి పనితీరును చూపిస్తాయి. కానీ, మరో దశలో అది నిలదొక్కుకోకపోవచ్చు. మార్కెట్‌ చక్ర గమనంలో ఒకే వ్యూహం ఎప్పుడూ సరిపోకపోవచ్చు. ఇక్కడే బహుళ వ్యూహాలు పాటించాల్సి ఉంటుంది. ఉదాహరణకు నిఫ్టీ అల్ఫా లో వోలటాలిటీ 30 ఇండెక్స్‌. పేరులోనే ఉన్నట్లు.. ఇందులో తక్కువ హెచ్చుతగ్గులు ఉంటాయి. అస్థిరత తక్కువగా ఉంటూ.. రాబడి కాస్త అధికంగా లభించేలా ఇవి పనిచేస్తాయి. ఇక్కడ షేర్లను నిఫ్టీ 100, నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 50 నుంచి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. దీనిద్వారా ఒకే ఇండెక్స్‌ లేదా ఈటీఎఫ్‌ ద్వారా పెట్టుబడిదారుడు.. బహుళ వ్యూహాలను పరిశీలించే ఫండ్లలో మదుపు చేసేందుకు ప్రయత్నించవచ్చు.

లాభాలేమిటి?
ఫ్యాక్టర్‌ ఆధారిత వ్యూహం.. యాక్టివ్‌, ప్యాసివ్‌ ఫండ్‌ నిర్వహణ వ్యూహాలను మిళితం చేస్తుంది. దీనివల్ల మదుపరులు యాక్టివ్‌గా నిర్వహించే ఇండెక్స్‌ ఫండ్లలో పెట్టుబడులను ఎంచుకోవచ్చు. ఆ తర్వాత నిష్క్రియా విధానంలో నిర్వహించే ఈటీఎఫ్‌ సూచీ ఫండ్లలోనూ పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. మొత్తం ప్రక్రియ నిబంధనల మేరకు జరుగుతుంది. కాబట్టి, పెట్టుబడి నిర్ణయాల్లో మానవ ప్రమేయం అంతగా ఉండదు. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు పెట్టుబడుల సమీక్ష జరుగుతుంది. కాబట్టి, పెట్టుబడిదారుడు రీబ్యాలెన్సింగ్‌ కోసం ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అనిశ్చితి సమయంలోనూ పెట్టుబడులను ఆరోగ్యకరంగా నిర్వహించేందుకు, వైవిధ్యమైన మార్గాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇది తోడ్పడుతుంది. ఒకే వ్యూహం, మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న షేర్లలో పెట్టుబడులు ఉండవు. కాబట్టి, నష్టభయం తగ్గుతుంది.

పెట్టుబడుల్లో ఈక్విటీలకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఫ్యాక్టర్‌ ఆధారిత ఈటీఎఫ్‌లను పరిశీలించవచ్చు. దీనివల్ల అటు యాక్టివ్‌, ఇటు ప్యాసివ్‌ పెట్టుబడుల ద్వారా వచ్చే ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చు. మదుపరులు తమ ఆర్థిక లక్ష్యాలు, సాధించాల్సిన రాబడికి అనుగుణంగా పెట్టుబడి వ్యూహాలను పాటించాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో ఫ్యాక్టర్‌ ఆధారిత పెట్టుబడులే మంచి లాభాలను అందిస్తాయని అంచనా వేయొచ్చు.

- చింతన్‌ హారియా, హెడ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని