రుణం తీసుకుంటున్నారా?

పండగల వేళ గృహ, వాహన రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? రుణానికి దరఖాస్తు చేయడం నుంచి మొదలు.. అది మీ చేతికి అందే వరకూ అనేక దశలు ఉంటాయి. మీరు దరఖాస్తు చేయగానే రుణదాత దాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత మీకు రుణం ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తారు.

Updated : 23 Sep 2022 02:43 IST

పండగల వేళ గృహ, వాహన రుణం తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? రుణానికి దరఖాస్తు చేయడం నుంచి మొదలు.. అది మీ చేతికి అందే వరకూ అనేక దశలు ఉంటాయి. మీరు దరఖాస్తు చేయగానే రుణదాత దాన్ని నిశితంగా పరిశీలిస్తారు. ఆ తర్వాత మీకు రుణం ఎంత ఇవ్వాలనేది నిర్ణయిస్తారు. అంతమాత్రాన రుణం అందినట్లు కాదన్నది గుర్తుంచుకోవాలి. ఈ రెండింటి మధ్య తేడా ఉంటుంది. మీ దరఖాస్తును స్వీకరించిన తర్వాత ప్రాథమికంగా మీకు ఎంత మేరకు అప్పు ఇవ్వచ్చనేది బ్యాంకు/ఆర్థిక సంస్థ నిర్ణయిస్తుంది. ఆ విషయాన్నే మీకు తెలియజేస్తుంది. ఆ తర్వాత మీరు ఇచ్చిన సమాచారం, సమర్పించిన పత్రాల ఆధారంగానే రుణ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది. 

ఒకేసారి.. పాక్షికంగా.. 

వ్యక్తిగత రుణాలు, ఆస్తి తాకట్టు రుణాల్లాంటి వాటి విషయంలో మంజూరైన రుణం ఒకేసారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. దీన్ని పూర్తి చెల్లింపు అంటారు. గృహ, విద్యా రుణం తీసుకున్నప్పుడు ముందుగా ఎంత వరకూ ఇస్తారనేది తెలియజేస్తుంది. ఆ తర్వాత బిల్డర్‌, విద్యా సంస్థ నుంచి అందిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని, విడతల వారీగా రుణాన్ని అందిస్తుంది. ఇంటి నిర్మాణం కోసం అప్పు తీసుకున్నప్పుడు.. నిర్మాణ దశలను బట్టి, రుణం విడుదల చేస్తుంది. అదే సిద్ధంగా ఉన్న ఇల్లు కొంటున్నప్పుడు.. అమ్మకందారుతో కుదుర్చుకున్న ఒప్పందం మొత్తాన్ని బట్టి, వారికే ఆ  మొత్తాన్ని చెల్లిస్తుంది.

విద్యా రుణాలు తీసుకున్నప్పుడు బ్యాంకులు ఆయా విద్యా సంస్థలు ఫీజులను వసూలు చేసే వ్యవధి ఆధారంగా రుణాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు నేరుగా విద్యా సంస్థల ఖాతాలోనే జమ చేస్తాయి. కొన్ని బ్యాంకులు రుణగ్రహీత ఖాతాలో జమ చేస్తాయి. ట్యూషన్‌ ఫీజులు కాకుండా... ఇతర ఖర్చులకు ఇచ్చిన రుణాన్ని రుణగ్రహీత ఖాతాకే జమ చేస్తాయి.

తగ్గినా ఆశ్చర్యపోవద్దు.

ముందే అనుకున్నట్లు రుణానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు కొన్ని ప్రాథమిక అంశాలను పరిశీలించి, రుణ మొత్తాన్ని నిర్ణయిస్తాయి బ్యాంకులు. ఈ మొత్తం కొన్నిసార్లు తగ్గేందుకు ఆస్కారం ఉంది. ఉదాహరణకు గృహరుణాన్ని పంపిణీ చేసేటప్పుడు ముందుగా మీరు తీసుకుంటున్న ఇంటిని క్షుణ్నంగా పరిశీలిస్తాయి. ఏ ప్రాంతంలో ఇల్లు తీసుకుంటున్నారు, ఇంటి వైశాల్యం, నిర్మాణ నాణ్యత, స్థలానికి న్యాయపరమైన చిక్కులేమైనా ఉన్నాయా, అనుమతులు ఇలాంటివన్నీ చూస్తుంది. అన్నీ సరిగ్గా ఉంటేనే రుణాన్ని మంజూరు చేస్తుందని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత ఇంటి విలువను గణిస్తుంది. ఈ విలువ మీకు ఇచ్చిన రుణ మంజూరు కన్నా తక్కువగా ఉంటే.. అప్పుడు మీ రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది. ఇంటి విలువ-రుణ నిష్పత్తి ఆధారంగా ఎంత మొత్తం వస్తుందనేది నిర్ణయిస్తుంది. దీంతోపాటు రుణాన్ని ఎంత వ్యవధిలో చెల్లిస్తారన్నదీ పరిశీలిస్తుంది. ఈ అంశాల ఆధారంగానే తుది రుణ మొత్తం విడుదల అవుతుంది.

సొంతంగా చెల్లించాకే.. 

గృహ, వాహన రుణాలు తీసుకునేటప్పుడు రుణగ్రహీత కొంత మేరకు డౌన్‌పేమెంట్‌ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులు గృహ విలువలో 80-90 శాతం వరకూ రుణం ఇస్తాయి. మిగతాది రుణగ్రహీత చెల్లించాలి. వాహన రుణాలకూ ఇలాంటి నిబంధనే ఉంటుంది. ముందుగా ఈ డౌన్‌పేమెంట్‌ లేదా మార్జిన్‌ మనీని చెల్లించామని రుజువులు సమర్పిస్తేనే బ్యాంకు రుణ మొత్తాన్ని విడుదల చేస్తుంది.

రుణాన్ని విడుదల చేసిన వెంటనే ఆ మొత్తంపై బ్యాంకులు వడ్డీని గణిస్తాయి. వెంటనే ఈఎంఐలనూ వసూలు చేస్తాయి. గృహ, విద్యా రుణాల వాయిదాలు ప్రారంభం కావడానికి ముందు కొన్నాళ్లపాటు మారటోరియం విధించే అవకాశం ఉంది. బ్యాంకును సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

రుణం తీసుకోవాలనుకున్నప్పుడు పూర్తి వివరాలను, ఎలాంటి తప్పుల్లేకుండా అందించాలి. అప్పుడే బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ఎలాంటి ఇబ్బందీ పెట్టకుండా అవసరమైన రుణాన్ని అందిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని