గృహ రుణం.. భారం దించుకుందామిలా...

ఆరేళ్ల క్రితం వరకూ గృహరుణాల చలన రేట్లు 8.65 శాతం నుంచి 9.10 శాతం వరకూ ఉండేవి. అక్టోబరు 2019 తర్వాత బ్యాంకులు రెపో ఆధారిత వడ్డీ రేటు విధానానికి మారాయి.

Updated : 09 Dec 2022 05:19 IST

రెపో రేటు మరోసారి పెరగడంతో గృహరుణం మరింత భారం అవుతోంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు తమ వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఈ తప్పనిసరి పరిస్థితులను తట్టుకునేందుకు రుణగ్రహీతలు తమ ప్రణాళికలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వ్యవధి లేదా ఈఎంఐ పెంపు సమాచారం ఇప్పటికే బ్యాంకులు, రుణ సంస్థలు తమ ఖాతాదారులకు సమాచారం ఇవ్వడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో గృహరుణం భారం కాకుండా ఏం చేయాలో చూద్దాం.

ఆరేళ్ల క్రితం వరకూ గృహరుణాల చలన రేట్లు 8.65 శాతం నుంచి 9.10 శాతం వరకూ ఉండేవి. అక్టోబరు 2019 తర్వాత బ్యాంకులు రెపో ఆధారిత వడ్డీ రేటు విధానానికి మారాయి. రెపోను ప్రామాణికంగా తీసుకొని 2.50 శాతం నుంచి 2.75 శాతం వరకూ అధికంగా వడ్డీని వసూలు చేస్తున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో రెపో 4 శాతానికి చేరింది. దీంతో బ్యాంకులు గృహరుణాలను 6.5 శాతం నుంచి 6.75 శాతం వరకే అందించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో రెపో రేటు పెరగడం ప్రారంభమైంది. తాజాగా బుధవారం 35 బేసిస్‌ పాయింట్లను పెంచడంతో 6.25 శాతానికి వచ్చింది. ఫలితంగా మళ్లీ గృహరుణాలు 8.75 నుంచి 9 శాతానికి చేరుకున్నాయి. తక్కువ రేటుకు రుణాలను తీసుకున్న వారికి వడ్డీ భారం లక్షల్లో పెరిగిపోతోంది. 20 ఏళ్లలో తీరాల్సిన రుణం.. 30 ఏళ్ల వరకూ కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

బ్యాంకును సంప్రదించండి...

6.75%-7% శాతం వడ్డీ రేటు ఉన్నప్పుడు రుణం తీసుకున్న వారిపై వడ్డీ రేట్ల ప్రభావం అధికంగా ఉండబోతోంది. అదే 8.5-9 శాతం వడ్డీ రేట్లు ఉన్నప్పుడు రుణం తీసుకున్న వారికి ఈఎంఐ, వ్యవధిలో ముందుతో పోలిస్తే పెద్ద తేడా కనిపించకపోవచ్చు. రుణం తీసుకున్నప్పుడు ఉన్న వడ్డీ ఆధారంగా అప్పుడు వ్యవధి, ఈఎంఐని నిర్ణయిస్తారు. వడ్డీ తగ్గినప్పుడు రుణం చెల్లించాల్సిన వ్యవధి తగ్గుతుంది. ఇప్పుడు మళ్లీ వడ్డీ రేట్లు పెరిగినప్పుడు పాత వ్యవధికి చేరుకుంటారు. ఇప్పటికే కొంత రుణం తీర్చారు కాబట్టి, వ్యవధి, ఈఎంఐలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కేవలం రెండు-మూడేళ్ల వ్యవధి అధికం కావచ్చు. కాబట్టి, మీ రుణం తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ముందుగా ప్రయత్నించండి. వర్తిస్తున్న వడ్డీ రేటు ఎంత? వ్యవధి ఎంత పెరిగింది? ఈఎంఐని పెంచే అవకాశం ఉందా చూసుకోండి. దీనికోసం మీరు రుణం తీసుకున్న బ్యాంకు/ఆర్థిక సంస్థను ముందుగా సంప్రదించండి. ఆన్‌లైన్‌ ఖాతా ఉంటే అందులో ఈ వివరాలన్నీ సరిచూడండి. అప్పుడే సరైన అవగాహన వస్తుంది.

వడ్డీ పెరిగితే..

గృహరుణం రేటు పెరిగినప్పుడు నెలవారీ వాయిదా (ఈఎంఐ) లేదా రుణ వ్యవధి అధికం అవుతుంది. ఉదాహరణకు మీరు రూ.30 లక్షల రుణం, 6.75 శాతానికి 20 ఏళ్ల వ్యవధికి తీసుకున్నారనుకుందాం. దీనికి ఈఎంఐ రూ.22,367 చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు వడ్డీ రేటు 8.75 శాతానికి చేరితే.. వ్యవధి 30 ఏళ్లకు మారడంతోపాటు, ఈఎంఐ రూ.23,610 అవుతుంది. అప్పుడు వడ్డీ భారం రూ.54,96,360 అవుతుంది. వ్యవధి మారకుండా ఈఎంఐ మాత్రమే పెంచుకుంటే రూ.26,520 చెల్లించాల్సి వస్తుంది. మొత్తం వడ్డీ రూ.33,62,730 చెల్లిస్తారు. రుణం తీసుకున్నప్పుడు, ఇప్పటి వడ్డీ రేటు ఆధారంగా వ్యవధి, వడ్డీ భారం మారుతూ ఉంటుంది.

ఏం చేయాలంటే

ఒకసారి గృహరుణ మార్కెట్‌ను పరిశీలించండి. మీ బ్యాంకు/సంస్థ కన్నా తక్కువ వడ్డీ అందిస్తున్న సంస్థలేమైనా ఉన్నాయా చూడండి. మీ ఆదాయం, క్రెడిట్‌ స్కోరు, ఇతర అంశాల ఆధారంగా మీకు ఎంత వడ్డీకి రుణం రావచ్చో తెలుసుకోండి.
మీరు ఇప్పుడు చెల్లిస్తున్న వడ్డీకన్నా కనీసం అరశాతం నుంచి 0.75 శాతం తక్కువున్నా భారం గణనీయంగా తగ్గుతుంది. కొన్నిసార్లు మీ బ్యాంకునే సంప్రదించి, తక్కువ వడ్డీ రేటుకు మారేందుకు ఏదైనా అవకాశం ఉందా అడిగి తెలుసుకోండి. ఇతర బ్యాంకులకు మారినప్పుడు కొన్ని ఖర్చులు ఉంటాయి. మీ మిగులు మొత్తం, అవుతున్న ఖర్చులను చూసుకొని, నిర్ణయం తీసుకోవాలి.


ఇవి పాటించండి..

* ప్రతి రూపాయీ నిజమైన అవసరం కోసమే ఖర్చు చేయాలి. రూ.100 మిగిలినా ఈఎంఐ ఖాతాలోకి మళ్లించేలా చూసుకోవాలి.* మున్ముందు వడ్డీ రేట్లు పెరుగుతాయనే అంచనాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ రోజునుంచే అందుకు సిద్ధం కావాలి. కొంత మొత్తాన్ని పెట్టుబడి రూపంలోకి మళ్లించాలి. స్వల్పకాలిక డెట్‌ ఫండ్లలో సిప్‌ చేయడం మంచిది.* ఒకటికి మించి రుణాలు ఉన్నప్పుడు అందులో అధిక వడ్డీ ఉన్నవాటిని తొందరగా వదిలించుకోవాలి. * రుణానికి ఈఎంఐలు ఎప్పుడూ సకాలంలో చెల్లించండి. లేకపోతే ఆలస్యపు రుసుములు అదనపు భారం అవుతాయి. క్రెడిట్‌ స్కోరు దెబ్బతింటుంది.* కనీసం 3-6 నెలల ఖర్చులు, రుణ వాయిదాలకు సరిపోయే మొత్తాన్ని అందుబాటులో ఉంచుకోవాలి.


వాయిదా పెంచుకోండి...

గృహరుణం వేగంగా తీరాలంటే ఉన్న మార్గం.. వాయిదాలను పెంచుకోవడమే. తక్కువ వడ్డీ ఉన్నప్పుడు అధిక రుణం రావచ్చు. వాయిదా మొత్తమూ తక్కువగానే ఉంటుంది. రుణం తీసుకున్న నాటితో పోలిస్తే ఇప్పుడు మీ ఆదాయం అధికంగానే ఉండొచ్చు. దీనికి అనుగుణంగా ఈఎంఐని పెంచుకోవడం మేలు. పైన పేర్కొన్న ఉదాహరణలో వడ్డీ రేటు పెరగడం వల్ల వ్యవధి 360 నెలలకు చేరింది. ఈఎంఐ రూ.23,610 అయ్యింది. దీనిపై...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు