గృహరుణం టాపప్‌ ఎప్పుడంటే

నాలుగైదేళ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నారా? అప్పటితో పోలిస్తే ఇప్పుడు మీ ఇంటి విలువా, మీ నికర వేతనం రెండూ పెరిగి ఉంటాయి.

Updated : 06 Jan 2023 00:52 IST

నాలుగైదేళ్ల క్రితం ఇంటి రుణం తీసుకున్నారా? అప్పటితో పోలిస్తే ఇప్పుడు మీ ఇంటి విలువా, మీ నికర వేతనం రెండూ పెరిగి ఉంటాయి. ఈ నేపథ్యంలో మరోసారి రుణం ఇస్తామంటూ ఇటీవలి కాలంలో బ్యాంకులు, గృహరుణ సంస్థలూ రుణగ్రహీతలను సంప్రదిస్తున్నాయి. ఇప్పటికే మీరు తీసుకున్న రుణాన్ని ‘టాపప్‌’ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాయి. మరి, దీనిని అంగీకరించే ముందు తెలుసుకోవాల్సిన విషయాలేమిటో చూద్దామా...

గృహరుణంపై వడ్డీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే 8.5-9 శాతానికి చేరుకున్నాయి. భవిష్యత్‌లో మరో 35-50 బేసిస్‌ పాయింట్ల మేరకు పెరిగే అవకాశాలున్నాయని అంచనాలున్నాయి. కొత్తగా రుణం ఇచ్చేందుకు బ్యాంకులు పోటీ పడుతూనే, ఇప్పటివరకూ క్రమశిక్షణతో వాయిదాలను చెల్లించే వారికి తిరిగి అప్పు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. బ్యాంకులు/రుణ సంస్థలకు ఇప్పటికే ఆయా రుణగ్రహీతల గురించి తెలుసు కాబట్టి, పెద్దగా ఇబ్బంది లేకుండా రుణాలను ఇస్తున్నాయి.

గృహరుణానికి చెల్లించే వడ్డీకి ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 24 ప్రకారం రూ.2లక్షల వరకూ, అసలుకు సెక్షన్‌ 80సీ పరిమితి మేరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. టాపప్‌ రుణానికి సాధారణంగా ఇలాంటి వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇంటిని విస్తరించడంలాంటి వాటికి వాడినప్పుడే మినహాయింపు వర్తిస్తుంది. దీనికి సంబంధించి తగిన ఆధారాలు అందించాల్సి ఉంటుంది.

వ్యవధి ఎక్కువ..: డబ్బు అవసరం ఉన్నప్పుడు వ్యక్తిగత రుణం, బంగారంపై అప్పులాంటివి కాకుండా గృహరుణ టాపప్‌ను ఎంచుకోవచ్చు. గృహరుణ వ్యవధిని బట్టి, టాపప్‌ రుణ కాల పరిమితినీ నిర్ణయిస్తారు. అంటే గృహరుణం 15 ఏళ్లు చెల్లించాల్సి ఉంటే, టాపప్‌ రుణమూ 15 ఏళ్ల వ్యవధికి ఇస్తారు. మిగతా అప్పులకు ఇంత వ్యవధి ఉండదు. మీ బ్యాంకు టాపప్‌ నిబంధలు ఎలా ఉన్నాయన్నది ముందే      తెలుసుకోవాలి.

వివిధ వ్యవధుల్లో: ఒకేసారి డబ్బుతో అవసరం లేదు అనుకుంటే.. టాపప్‌ రుణంలోనే ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. దీనికి గృహరుణంతో పోలిస్తే కాస్త అధిక వడ్డీ ఉంటుంది. దీర్ఘకాలం వరకూ అవసరమైనప్పుడే డబ్బును తీసుకునే వీలుంటుంది. ఉపయోగించుకున్న మొత్తానికే వడ్డీ విధిస్తారు. కాబట్టి, పెద్దగా భారం ఉండదు.

సులువుగా: ఇప్పటికే రుణగ్రహీతకు సంబంధించిన అన్ని వివరాలూ బ్యాంకు దగ్గర ఉంటాయి. రుణ వాయిదాలను ఎలా చెల్లిస్తున్నారనేదీ తెలుస్తుంది. రుణగ్రహీత వాయిదాలన్నీ సరిగ్గా చెల్లించిన వివరాలు, ఆదాయం ధ్రువీకరణ, ఇతర కొన్ని పత్రాలు అందిస్తే చాలు. టాపప్‌ రుణం ఎంతివ్వాలన్నది ఆదాయం, గృహరుణం మొత్తం, తనఖా పెట్టిన ఆస్తి మార్కెట్‌ విలువ తదితరాలను బట్టి ఆధారపడి ఉంటుంది.

తక్కువ వడ్డీ రేటు: సాధారణంగా ఈ టాపప్‌ రుణాలపై వడ్డీ రేట్లు గృహరుణం వడ్డీకి సమానంగానే ఉంటాయి. కాబట్టి, ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ వడ్డీకి లభిస్తున్న రుణాలుగా వీటిని చెప్పుకోవచ్చు.

ఇప్పుడు కొన్ని బ్యాంకులు/రుణ సంస్థలు టాపప్‌ రుణాలను ముందుగానే మంజూరు చేస్తున్నాయి. అధిక వడ్డీకి అప్పులు తీసుకునే బదులు.. డబ్బు అవసరం ఉన్నప్పుడు దీన్ని ఎంచుకోవడం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని