బ్యాంకు ఖాతా... ఆ వివరాలు పరిశీలించండి

ఆర్థిక ప్రయాణంలో తొలి అడుగు బ్యాంకు పొదుపు ఖాతా నుంచే ప్రారంభం అవుతుంది. ఇంతటి కీలకమైన పొదుపు ఖాతా ద్వారా చేసే ప్రతి లావాదేవీనీ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి.

Published : 17 Feb 2023 00:17 IST

ఆర్థిక ప్రయాణంలో తొలి అడుగు బ్యాంకు పొదుపు ఖాతా నుంచే ప్రారంభం అవుతుంది. ఇంతటి కీలకమైన పొదుపు ఖాతా ద్వారా చేసే ప్రతి లావాదేవీనీ ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. నిర్ణీత వ్యవధిలో జరిగిన వ్యవహారాలకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు బ్యాంకు నెలవారీ స్టేట్‌మెంట్‌ తెలియజేస్తుంది. దీని ద్వారా ఎలాంటి వివరాలు తెలుసుకోవచ్చు? ఉపయోగాలేంటి? వంటి వివరాలు తెలుసుకుందాం.

మీరు ఎవరికైనా డబ్బు బదిలీ చేశారనుకోండి.. దానికి ధ్రువీకరణ ఎలా? బ్యాంకు స్టేట్‌మెంట్‌ను చూస్తే సరిపోతుంది. ఇదొక్కటే కాదు. అనేక సందర్భాల్లో బ్యాంకు ఖాతా మనకు ఉపయోగపడుతుంది. రుణం తీసుకోవాలన్నా, టర్మ్‌ బీమా పాలసీ చేయాలన్నా ఖాతా వివరాల నివేదిక కావాల్సిందే.

చాలామంది హడావుడిగా ఖర్చు చేసేస్తుంటారు. తర్వాత మర్చిపోతారు. కొంతకాలం గడిచిన తర్వాత డబ్బు ఎక్కడ ఖర్చైందో తెలుసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు తరచూ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేసుకోవడం వల్ల ఇలాంటి గందరగోళానికి తావుండదు. అందుకే, ప్రతినెలా వివరాలను సరి చూసుకుంటే ఖర్చులను ఎప్పటికప్పుడు నిర్ధారించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన లావాదేవీల పక్కన వివరాలనూ రాసుకుంటే భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది.  

రుసుముల సంగతి..

బ్యాంకులు మనకు తెలియకుండానే అనేక రుసుములను వసూలు చేస్తుంటాయి. వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ అవసరం. కొన్నిసార్లు సాంకేతిక కారణాల వల్ల బ్యాంకులు ఒకే రకమైన ఛార్జీని రెండు మూడుసార్లు వసూలు చేస్తాయి. వీటిని బ్యాంకు దృష్టికి తీసుకెళ్తే తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. మనం చూసుకోకపోతే నష్టపోయినట్లే. డెబిట్‌ కార్డు, స్టేట్‌మెంట్లు, పాస్‌బుక్‌, క్రెడిట్‌ కార్డు, కనీస నిల్వ ఇలా అనేక రకాల ఛార్జీల వివరాలు ఇందులో ఉంటాయి.

మోసపూరిత లావాదేవీలు లేకుండా..

ఈ మధ్యకాలంలో మోసపూరిత లావాదేవీల సంఘటనలు పెరిగిపోతున్నాయి. వీటిని రుజువు చేయడానికి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ ఓ ఆధారం. మనకు తెలియకుండా ఏమైనా మోసపూరిత లావాదేవీ జరిగితే దాన్ని స్టేట్‌మెంట్‌లో గుర్తించేందుకు వీలవుతుంది.

ఖర్చుల నియంత్రణకు..

డిజిటల్‌ లావాదేవీలు పెరిగిన నేపథ్యంలో ఖాతాలో ఎంత డబ్బుందో చూసుకోకుండానే ఖర్చు చేస్తున్నాం. ఒక్కోసారి స్థాయికి మించి ఖర్చు చేసేస్తుంటాం. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. దీన్ని నివారించడానికి బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌ను తరచూ పరిశీలించడం ఒక మార్గం. ఎక్కడైనా అనవసర ఖర్చు చేస్తున్నట్లయితే దాన్ని నియంత్రించుకోవచ్చు. ఖర్చులు పెరిగిపోతున్నట్లు గుర్తించిన వెంటనే స్టేట్‌మెంట్‌ను తనిఖీ చేసుకోవాలి. అప్పుడే వృథా ఖర్చులకు అడ్డుకట్ట పడుతుంది.  

మిగులు నిధులతో..

ఒక పొదుపు ఖాతాకు మించి ఉన్నవారెందరో. అన్నింటిలోనూ కొంత డబ్బును జమ చేస్తుంటారు. ఇలా కొన్ని ఖాతాల్లో డబ్బు అలా ఊరికే ఉండిపోతూ ఉంటుంది. దాన్ని పట్టించుకోరు. మీ బ్యాంకు ఖాతాలన్నింటినీ కనీసం ప్రతి మూడు నెలలకోసారి వివరంగా పరిశీలించండి. అవసరానికి మించి ఖాతాలో ఉన్న సొమ్మును మంచి రాబడినిచ్చే పెట్టుబడి మార్గాల్లోకి మళ్లించవచ్చు. బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌తో పాటు ఇ-మెయిళ్లు, ఎస్‌ఎంఎస్‌లనూ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. అనుమానం వస్తే తగిన ఆధారాలతో బ్యాంకును సంప్రదించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని