Credit Card- UPI: యూపీఐతో క్రెడిట్‌ కార్డు జత చేస్తే మంచిదేనా?

Credit Card- UPI: దేశంలో కొన్ని కోట్ల మంది ఇప్పుడు యూపీఐ   ఆధారిత చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ డెబిట్‌ కార్డు ద్వారా బ్యాంకు ఖాతాను యూపీఐ యాప్‌లకు అనుసంధానం చేసి, లావాదేవీలు నిర్వహించేందుకు వీలయ్యేది.

Updated : 20 Mar 2023 10:02 IST

దేశంలో కొన్ని కోట్ల మంది ఇప్పుడు యూపీఐ (UPI) ఆధారిత చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటి వరకూ డెబిట్‌ కార్డు ద్వారా బ్యాంకు ఖాతాను యూపీఐ యాప్‌లకు అనుసంధానం చేసి, లావాదేవీలు నిర్వహించేందుకు వీలయ్యేది. ఇప్పుడు డెబిట్‌ కార్డులతోపాటు, క్రెడిట్‌ కార్డు (Credit Card)లనూ యూపీఐకి జత చేసుకునే వీలుంది. ఇది ఎంత వరకూ ప్రయోజనం, పాటించాల్సిన జాగ్రత్తలేమిటి?  తెలుసుకుందాం.

గదు రహిత లావాదేవీల నిర్వహణలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేజ్‌ (UPI) ఒక విప్లవాత్మక మార్పు. క్షణాల్లో డబ్బును బదిలీ చేయడం, రెండంచెల భద్రత ఇలా ఎన్నో అంశాలతో సురక్షితమైన మార్గంగా యూపీఐని వినియోగిస్తున్నారు. ఇప్పటి వరకూ డెబిట్‌ కార్డుల ద్వారా సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతా మాత్రమే దీనికి జత చేయడానికి సాధ్యం అయ్యేది. డబ్బు నేరుగా బ్యాంకు ఖాతా నుంచి డెబిట్‌ అవుతుంది. యూపీఐ సేవలను మరింత విస్తరించడంతోపాటు, రూపే క్రెడిట్‌ కార్డు (Credit Card)ల వాడకాన్ని ప్రోత్సహించే క్రమంలో క్రెడిట్‌ కార్డులను యూపీఐతో జత చేసేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. ఇప్పుడు అన్ని నెట్‌వర్క్‌ల కార్డులనూ యూపీఐతో అనుసంధానం చేసుకునేందుకు వీలు కల్పిస్తోంది. మన దగ్గర డబ్బు లేకపోయినా క్రెడిట్‌ కార్డును వినియోగించి అవసరమైన కొనుగోళ్లు చేయొచ్చు.

మన దేశంలో కొన్ని ఫిన్‌టెక్‌ సంస్థలు ‘ఇప్పుడు కొనండి.. తర్వాత చెల్లించండి (బీఎన్‌పీఎల్‌)’ సేవలను ప్రారంభించాయి. ఈ యాప్‌లు 15 నుంచి 30 రోజుల స్వల్ప వ్యవధికి రుణాలను ఇస్తుంటాయి. క్రెడిట్‌ కార్డు (Credit Card)లను యూపీఐకి అనుసంధానించుకునే వీలుండటంతో ఇప్పుడు ఈ ప్రయోజనం రుణం తీసుకోకుండానే అందినట్లయ్యింది. మొబైల్‌ ఫోనును వినియోగించి, యూపీఐ (UPI) యాప్‌ల ద్వారా చెల్లింపులు చేయడానికి వీలవుతుంది కాబట్టి, క్రెడిట్‌ కార్డును వెంట తీసుకెళ్లే అవసరం ఉండదు. వ్యాపారి కోడ్‌ను స్కాన్‌ చేసి, క్రెడిట్‌ కార్డుతో చెల్లించేయొచ్చు. మొబైల్‌ రీఛార్జీలు, విద్యుత్‌ బిల్లులు ఇలా ఏమైనా సరే యూపీఐతో జత చేసిన క్రెడిట్‌ కార్డు ద్వారానే చెల్లించేయొచ్చు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కేవలం కొనుగోళ్లకు, బిల్లుల చెల్లింపుల కోసమే యూపీఐతో అనుసంధానమైన క్రెడిట్‌ కార్డును వాడొచ్చు.బిట్‌ కార్డులాగా ఇతరుల బ్యాంకు ఖాతాలోకి డబ్బు బదిలీ చేయడం సాధ్యం కాదు.

మంచిదేనా?

బ్యాంకు నుంచి బ్యాంకుకు నిధుల బదిలీ చేయడం యూపీఐ ద్వారా చాలా సులభం. యూపీఐ చెల్లింపులకు క్రెడిట్‌ కార్డు (Credit Card)ను అనుమతించడంతో కార్డులను వాడేవారికి యూపీఐని దగ్గర చేసినట్లు అవుతుంది. ఇవన్నీ బాగానే ఉన్నా.. వినియోగదారులు కార్డును ఉపయోగించుకునే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కార్డును వాడినప్పుడు మీరు స్వల్పకాలిక రుణాన్ని తీసుకున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. బ్యాంకు ఖాతా నుంచి అప్పటికప్పుడు డెబిట్‌ కాకపోయినా.. వ్యవధి లోపు బిల్లు చెల్లించాలి. అందువల్ల మీకు ఆ రోజు నాటికి డబ్బు సర్దుబాటు అవుతుందని అనుకున్నప్పుడే క్రెడిట్‌ కార్డుతో యూపీఐ (UPI) చెల్లింపులు చేయండి. లేకపోతే అప్పుల ఊబిలో చిక్కుకుపోయే ప్రమాదం ఉంది. కేవలం అత్యవసరాల్లో మాత్రమే కార్డును వినియోగించుకునేందుకు ప్రయత్నించండి. అప్పుడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా క్రెడిట్‌ కార్డు సౌకర్యం, యూపీఐ చెల్లింపు రెండూ మీకు ప్రయోజనం చేకూరుస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు