Credit Card: కార్డు రుణం ఎప్పుడంటే..

క్రెడిట్‌ కార్డు.. కొనుగోళ్లు చేయడానికే కాదు.. అత్యవసరాల్లో వెంటనే అప్పు ఇచ్చే సాధనంగానూ వాడుకోవచ్చు. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇవి వేగంగా అందుతాయి. ఎలాంటి పత్రాలనూ సమర్పించాల్సిన అవసరమూ ఉండదు.

Published : 28 Apr 2023 00:08 IST

క్రెడిట్‌ కార్డు.. కొనుగోళ్లు చేయడానికే కాదు.. అత్యవసరాల్లో వెంటనే అప్పు ఇచ్చే సాధనంగానూ వాడుకోవచ్చు. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే ఇవి వేగంగా అందుతాయి. ఎలాంటి పత్రాలనూ సమర్పించాల్సిన అవసరమూ ఉండదు. ఇలా రుణం తీసుకుంటున్నప్పుడు కొన్ని విషయాలను అర్థం చేసుకున్నాకే ముందుకెళ్లాలి. అవేమిటో చూద్దామా..

క్రెడిట్‌ కార్డులతో కొనుగోళ్లు చేయొచ్చు. కొన్నిసార్లు అనుమతించిన పరిమితి లోపు ఏటీఎం నుంచి డబ్బునూ తీసుకోవచ్చు. ఇవే కాకుండా క్రెడిట్‌ కార్డుపై వ్యక్తిగత రుణాన్నీ తీసుకోవచ్చు. క్రెడిట్‌ కార్డును వాడుతున్న తీరు, క్రెడిట్‌ స్కోరును బట్టి కార్డు సంస్థలు ఈ అప్పును ఇస్తాయి.

ముందుగానే..: క్రెడిట్‌ కార్డు ఉన్న వారందరికీ ఈ రుణం అందకపోవచ్చు. బ్యాంకులు, కార్డు సంస్థలు ఆయా కార్డులపై ఎంత మేరకు రుణం ఇస్తామనే సంగతిని ముందుగానే తెలియజేస్తాయి. అవసరం ఉన్నప్పుడు ఒక్క క్లిక్‌ చేస్తే చాలు.. మీ ఖాతాలో నగదు జమ అవుతుంది. ఇది ఎలాంటి హామీ లేని రుణమే. కార్డుతో నగదు తీసుకున్నప్పుడు బిల్లుతో కలిపి చెల్లించాల్సి వస్తుంది. నగదు తీసుకున్న రోజు నుంచీ 36 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కార్డుతో రుణం తీసుకున్నప్పుడు నిర్ణీత వ్యవధి ఉంటుంది. 16-18 శాతం వడ్డీ ఉంటుంది. గరిష్ఠంగా 36 నెలల పాటు రుణ వ్యవధిని ఎంచుకోవచ్చు. కాబట్టి, దీర్ఘకాలిక వ్యవధితో రుణం కావాలనుకున్నప్పుడు కార్డు రుణాన్ని ఎంచుకోవచ్చు.

పరిమితి తగ్గదు..: కార్డును ఉపయోగించి ఏటీఎం నుంచి నగదు తీసుకున్నారనుకోండి.. కార్డు పరిమితి ఆ మేరకు తగ్గుతుంది. రుణం తీసుకున్నప్పుడు కార్డు పరిమితితో సంబంధం ఉండదు. దీనివల్ల మీ కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు.

పత్రాలు లేకుండానే..: క్రెడిట్‌ కార్డును తీసుకునేటప్పుడు మీరు సమర్పించిన పత్రాల ఆధారంగానే కార్డుపై వ్యక్తిగత రుణం ఇస్తాయి బ్యాంకులు. కాబట్టి, ప్రత్యేకంగా ఇతర పత్రాలను అందించాల్సిన అవసరం ఉండదు.

అవసరమైతేనే..: మీ కార్డు వివరాలను ఆన్‌లైన్‌లో పరిశీలించినప్పుడు మీకు ముందుగానే రుణం మంజూరైన విషయం తెలుస్తుంది. వడ్డీ ఎంత? వ్యవధి, ఈఎంఐ మొత్తం ఇలా అన్ని వివరాలూ తెలుసుకొని ఉండాలి. కేవలం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఈ వెసులుబాటును ఉపయోగించుకునేందుకు ప్రయత్నించాలి.

బిల్లుతోపాటే: ఈ రుణం తీసుకున్నప్పుడు.. ఈఎంఐని కార్డు బిల్లుతో పాటే వడ్డీ, అసలును చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి, వాయిదా చెల్లించేందుకు మరో తేదీ ఉండదు. కొన్ని కార్డు సంస్థలు అయిదేళ్ల వ్యవధిని ఇస్తున్నాయి. కానీ, మూడేళ్లకు పరిమితం చేసుకోవడం ఎప్పుడూ మంచిది.

తీసుకోవచ్చా?: తప్పనిసరిగా డబ్బు అవసరమైనప్పుడు మాత్రమే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వెసులుబాటు ఉంటే ఇతర మార్గాలను అన్వేషించాలి. క్రెడిట్‌ కార్డుపై రుణాలకు అధిక వడ్డీ రేటు ఉంటుంది. మీ మొత్తం ఈఎంఐలు ఆదాయంలో 40 శాతం మించకుండా చూసుకోండి. కార్డు బిల్లులు సకాలంలో చెల్లించకపోతే అప్పుల ఊబిలో చిక్కుకుపోతాం. రుణ చరిత్ర, క్రెడిట్‌ స్కోరూ దెబ్బతింటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని