గృహరుణం తీసుకోవాలా? వేచి చూడాలా?
భారతీయ రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేటును పెంచలేదు. అప్పు తీసుకున్న, తీసుకోబోయే వారికి ఇది కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. ఈ విరామం ఎంత కాలం ఉంటుందనే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది.
భారతీయ రిజర్వు బ్యాంకు కీలక వడ్డీ రేటును పెంచలేదు. అప్పు తీసుకున్న, తీసుకోబోయే వారికి ఇది కొంత ఉపశమనం కలిగించినప్పటికీ.. ఈ విరామం ఎంత కాలం ఉంటుందనే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. రుణాలు ఖరీదైనప్పుడు రుణగ్రహీతలకు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వారి రుణ అర్హత తగ్గుతుంది. ఫలితంగా కొనే ఇంటి విస్తీర్ణంపై ప్రభావం పడొచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో గృహరుణం తీసుకోవాలా? మరికొంత కాలం వేచి చూడాలా? అనే ఆలోచన చాలామందిలో ఉంటుంది. దీనికి సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వార్షిక రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 5.66 శాతానికి తగ్గింది. అంతకు క్రితం నెలలో 6.44 శాతంతో పోలిస్తే ఇది 15 నెలల కనిష్ఠ స్థాయికి చేరుకుంది. ఈ ద్రవ్యోల్బణ కదలికలను ఆర్‌బీఐ పరిశీలిస్తూనే ఉంటుంది. రాబోయే ద్రవ్య విధాన సమీక్ష నాటికి వడ్డీ రేట్లలో దిద్దుబాటు చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి, ఇప్పటికే ఇంటి కొనుగోలుకు సిద్ధం అయితే.. వడ్డీ రేట్లలో హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించండి. గృహరుణాలు సాధారణంగా చలన వడ్డీ విధానంలో ఉంటాయి. రెపో రేటు మారినప్పుడల్లా ఇవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి, రుణాల వడ్డీ రేటు గురించి ఆలోచించకుండా.. వ్యక్తిగతంగా సిద్ధమవ్వాలి. కొంచెం ప్రణాళికతో ముందుకెళ్తే ఇంటి యజమాని కావాలనే కలను సాకారం చేసుకోవచ్చు.
ఆర్థిక ఆరోగ్యం బాగుందా?
కొత్తగా రుణం తీసుకునే వారు పరిశీలించాల్సిన ముఖ్యమైన విషయం ఆర్థికంగా స్థిరంగా ఉన్నారా లేదా అని. గృహరుణం దీర్ఘకాలం కొనసాగుతుంది. కాబట్టి, నెలవారీ చెల్లింపుల విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదనే విషయాన్ని తెలుసుకోండి. రుణం సాధారణంగా ఇంటి విలువలో 75-80శాతం వరకూ లభిస్తుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ వంటి ఇతర ఖర్చులూ ఉంటాయి. వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే.. ఆస్తి విలువలో కనీసం 30-40 శాతం వరకూ మీరు భరించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తం రుణం ద్వారా పొందవచ్చు. మీరు ఆర్థికంగా బలంగా లేకపోయినా, మార్జిన్ మొత్తం తక్కువగా ఉన్నా రుణం తీసుకునే విషయాన్ని మరోసారి ఆలోచించాలి. మెరుగైన ఆర్థిక స్థితికి చేరేంత వరకూ సొంతింటి నిర్ణయాన్ని వాయిదా వేయాలి.
స్కోరు బాగుందా?
రుణ వడ్డీ రేట్లను ఇప్పుడు క్రెడిట్ స్కోరుతో ముడి పెడుతున్నాయి బ్యాంకులు. మీకు మంచి క్రెడిట్ స్కోరుంటే.. వడ్డీలో రాయితీ లభిస్తుంది. దీర్ఘకాలంలో ఇది మీ డబ్బును ఆదా చేస్తుంది. మీ క్రెడిట్ స్కోరు పేలవంగా ఉంటే.. అధిక వడ్డీ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇది మీ రుణాన్ని మరింత ఖరీదైనదిగా మారుస్తుంది. 750 పాయింట్లకు మించి స్కోరుంటే సులభంగా రుణాలు లభిస్తాయి. రుణగ్రహీత ఇప్పటికే తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లిస్తూ ఉంటే.. బ్యాంకులు తక్కువ స్కోరునూ పరిగణనలోకి తీసుకుంటాయి. క్రెడిట్ స్కోరు బాగుంటే రుణం పొందే అవకాశాలు మెరుగ్గా ఉండటంతోపాటు, వడ్డీ రేట్ల కోసం చర్చించే వీలూ ఉంటుంది. రుణం కోసం దరఖాస్తు చేసే ముందు మీ క్రెడిట్ స్కోరు మంచి స్థితిలో ఉందో లేదో స్వయంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి.
వడ్డీ తగ్గితే..
సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గుతాయని అనుకుందాం. కానీ, ఇది ఎప్పుడన్నది ఊహించలేం. ప్రస్తుతం వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ సహన స్థాయిలోనే ఎక్కువ కాలం కొనసాగితే వడ్డీ రేట్లను తగ్గించవచ్చు. మీరు ఇల్లు కొనాలని నిర్ణయం తీసుకుంటే.. వడ్డీ రేట్లు తగ్గే వరకూ వేచి చూడాల్సిన అవసరం లేదు. మీరు చలన వడ్డీ విధానంలోనే రుణం తీసుకుంటారు. కాబట్టి, రెపో రేటు తగ్గినప్పుడల్లా దానికి అనుసంధానంగా ఉన్న గృహరుణంపై వడ్డీ తగ్గుతుంది. కాబట్టి, ఇబ్బందేమీ ఉండదు.
చర్చించండి..
బ్యాంకు లేదా గృహరుణ సంస్థను సంప్రదించే ముందు మీరు కొంత పరిశోధన చేయండి. వడ్డీ రేట్లను పోల్చి చూసుకోండి. మీకు వర్తించే వడ్డీ రేటును నిర్ణయించడంలో క్రెడిట్ స్కోరు కీలకం. దీనితోపాటు మీకు స్థిరమైన ఆదాయం, రుణ-ఆదాయ నిష్పత్తి తక్కువగా ఉన్నప్పుడు రాయితీ వడ్డీకి రుణం వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మీరు దీర్ఘకాలంగా ఖాతాను కొనసాగిస్తున్న బ్యాంకులో రుణం తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. మీ ఆర్థిక వివరాలన్నీ వారి దగ్గరే ఉంటాయి. కాబట్టి, రుణం తీసుకునేటప్పుడు అది కొంత సహాయం చేస్తుంది.
తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవద్దు. కొంచెం సమయాన్ని వెచ్చించి అన్ని లెక్కలూ వేసుకోండి. ఆ తర్వాతే రుణానికి దరఖాస్తు చేయండి.
వడ్డీ రేట్లు గరిష్ఠ స్థాయిలో ఉన్నప్పుడు రుణం తీసుకోవాలా, వేచి చూడాలా అనేది మీ ఆర్థిక పరిస్థితిపైనే ఆధారపడి ఉంటుంది. ముందే అనుకున్నట్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా 10-20 ఏళ్లపాటు నిరంతరాయంగా వాయిదాలను చెల్లిస్తాను అనుకున్నప్పుడే గృహరుణం తీసుకోవడం శ్రేయస్కరం.
ధరలు పెరుగుతాయి..
మీరు ఇల్లు కొనాలనుకునే ప్రదేశంలో మెరుగైన వసతులు ఉంటే.. ఇల్లు కొనుగోలు గురించి వేచి చూడటంలో అర్థం లేదు. ఎందుకంటే.. అక్కడ స్థిరాస్తుల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటాయి. మీరు ఆలస్యం చేస్తే ఇల్లు కొనడం మరింత ఆర్థిక భారం అవుతుంది. వడ్డీ రేట్లు తగ్గే వరకూ స్థిరాస్తుల ధరలు ఎదురు చూడవు. వడ్డీ రేటు తగ్గినా, ఆస్తి ధర పెరిగితే.. మీకు భారం తప్ప ప్రయోజనం ఉండదు.
అధిల్ శెట్టి, సీఈఓ, బ్యాంక్‌బజార్
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత