మ్యూచువల్‌ ఫండ్లు.. ఒకే రంగంలో మదుపు చేస్తారా?

దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి.

Published : 21 Jun 2024 00:26 IST

దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయడం ఒక మార్గం. ఇందులో వైవిధ్యమైన పథకాలు అందుబాటులో ఉన్నాయి. కాస్త నష్టభయం భరించగలిగిన వారు కొన్ని ప్రత్యేక రంగాల్లో ఉన్న వృద్ధిని అందుకోవాలని భావించే వారికి థీమాటిక్‌ ఫండ్లు (ఒకే రంగంలో మదుపు చేసేవి) అందుబాటులో ఉన్నాయి.

భివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలో ఎన్నో రంగాలు కీలకంగా ఉంటాయి. మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ రంగంలోని సంస్థలూ బహుళ జాతి కంపెనీలూ, బ్యాంకులు, ఆర్థిక సేవలు, వాహన, వినియోగ వస్తువులు, ఫార్మా, ఐటీ రంగాల్లోని సంస్థలు ఇందులో ఉంటాయి. వీటిలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని, అందులోని కంపెనీల్లోనే మదుపు చేసేవే థీమాటిక్‌ లేదా సెక్టోరియల్‌ ఫండ్లు. ఆర్థిక వ్యవస్థను కాస్త అర్థం చేసుకోగలిగిన వారు వీటిలో మదుపు చేసి, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఆర్జించే అవకాశం ఉంటుంది.
థీమాటిక్‌ ఫండ్లు తమ పెట్టుబడుల్లో 80 శాతం వరకూ ఎంచుకున్న రంగంలోని సంస్థలకే కేటాయిస్తాయి. అన్ని రకాల షేర్లలోనూ మదుపు చేసే ఫండ్లలాగా కాకుండా, ఆర్థిక వ్యవస్థలోని ఒకే రంగంపై దృష్టి కేంద్రీకరించి, ఆ రంగం నుంచి ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటాయన్నమాట. 

పెట్టుబడులు ఎలా?

నిర్ణీత రంగంలోని కంపెనీల షేర్లలో మంచి పనితీరున్న వాటిని ఎంచుకొని, మదుపరులకు లాభాలను తీసుకురావడమే ఈ థీమాటిక్‌ షేర్ల ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా ఫండ్‌ మేనేజర్లు పథకం వ్యూహానికి తగ్గట్లుగా షేర్లను ఎంపిక చేసుకొని, పోర్ట్‌ఫోలియోను నిర్మిస్తారు. ఎంచుకున్న షేర్ల పనితీరును బట్టి, వాటిని సర్దుబాటు చేస్తుంటారు. ఆయా రంగానికి చెందిన ప్రామాణిక సూచీతో వీటిని పోల్చి చూస్తారు. ఫండ్‌ పనితీరు ఎంచుకున్న రంగం పురోగతి మీద ఆధారపడి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో ఆ రంగం కీలకంగా ఉన్నప్పుడు మంచి రాబడులు వచ్చేందుకు అవకాశాలు పెరుగుతాయి. లేకపోతే, స్వల్పకాలంలో నష్టాలు వచ్చే ఆస్కారమూ ఉంది.

లాభాలేమిటి?

సెక్టోరియల్‌ ఫండ్లు నిర్ణీత రంగాలపై ఆధారపడి ఉన్నప్పటికీ, మీ మొత్తం పోర్ట్‌ఫోలియోకు వైవిధ్యం జోడించే అవకాశం ఉంది. నష్టభయాన్ని పరిమితం చేసుకునేందుకు ఇవి తోడ్పడతాయి. 

  • దీర్ఘకాలంలో ఆయా కంపెనీల విలువ పెరిగినప్పుడు.. పెట్టుబడులు మంచి లాభాలను అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో డైవర్సిఫైడ్‌ ఫండ్లతో పోల్చి చూసినా అధిక రాబడే అందుతుందని చెప్పొచ్చు. వేగంగా అభివృద్ధి చెందుతున్న ధోరణులను ఇవి అందుకుంటాయి. కాబట్టి, వృద్ధికి అవకాశాలు అధికం.
  • పెట్టుబడి పెట్టే పథకం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే మదుపు నిర్ణయం తీసుకోవాలి. 
  • కొన్నిసార్లు మార్కెట్‌ పోకడలు నిర్ణీత రంగాలకు వ్యతిరేకంగా ఉండొచ్చు. ఇలాంటప్పుడు నష్టం వచ్చే సందర్భాలుంటాయి. కాబట్టి, ఫండ్‌ విలువలో హెచ్చుతగ్గులు సహజమని గుర్తించాలి.
  • భౌగోళిక, రాజకీయ పరిస్థితులు థీమాటిక్‌ ఫండ్లకు నష్టం చేకూరుస్తాయి. కాబట్టి, వీటికి ప్రభావితం కాని రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ఒకే రంగానికి పరిమితమైన ఫండ్లను ఎంచుకునేటప్పుడు అవి మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. దీర్ఘకాలిక లక్ష్యాలు, నష్టభయం భరించే శక్తిని బట్టి సరైన పథకాన్ని ఎంచుకోవాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని