లక్ష కోట్లకు చేర్చిన ఉక్కు మహిళ!

తక్కువమంది ఎంచుకునే రంగంలో అడుగుపెట్టడానికి సంకోచించేవారే ఎక్కువ. అమ్మాయిలను చదివించడమే గొప్పనుకునే రోజుల్లో ఆ సాహసం చేశారు సోమ మోండల్‌. ఓ మహిళ.. నాయకురాలన్న ఊహే కష్టమైన వేళ  ఆ స్థానాన్ని అధిరోహించారు.

Updated : 28 Oct 2022 17:24 IST

తక్కువమంది ఎంచుకునే రంగంలో అడుగుపెట్టడానికి సంకోచించేవారే ఎక్కువ. అమ్మాయిలను చదివించడమే గొప్పనుకునే రోజుల్లో ఆ సాహసం చేశారు సోమ మోండల్‌. ఓ మహిళ.. నాయకురాలన్న ఊహే కష్టమైన వేళ  ఆ స్థానాన్ని అధిరోహించారు. అంతేనా.. అంచెలంచెలుగా ఎదుగుతూ సెయిల్‌ తొలి మహిళా ఛైర్‌పర్సన్‌ అయ్యారు. కొద్దికాలంలోనే ఆ సంస్థ వ్యాపారాన్ని లక్ష కోట్లు దాటించారు. ఆ నాయకురాలి కథే ఇది!

‘చుట్టుపక్కల ఇళ్లల్లో అమ్మాయిలు చిన్నతనం నుంచే ఇంటిపనులు, నలుగురిలో ఎలా మెలగాలో తెలుసుకుంటోంటే.. మా ఇంట్లో మాత్రం చదువుకే ప్రాధాన్యం. ఈ విషయంలో ఎవరేం చెప్పినా వినేవారు కాదు. అదే నన్ను ఈ స్థానంలో నిలబెట్టింది’ అని చెబుతారు సోమ. వీళ్లది భువనేశ్వర్‌, బంగాలీ కుటుంబం. నాన్న అగ్రికల్చర్‌ ఎకనామిస్ట్‌. అమ్మాయైనా, అబ్బాయైనా చదువు ముఖ్యమనే వారాయన. అయినా ఇంజినీరింగ్‌లో చేరతానంటే మాత్రం ససేమిరా అన్నారు. ‘అప్పట్లో అమ్మాయిలు ఇంజినీరింగ్‌లో చేరడం అరుదు. బదులుగా డిగ్రీ లేదా వైద్యవిద్య ఎంచుకోమన్నారు. కానీ అమ్మ నాకు అండగా నిలిచింది. చదువుకోవాలన్న తన కల నెరవేరలేదు. ఆ పరిస్థితి నాకు రాకూడదన్నది ఆమె భావన. ఎవరో ఒకరు అడుగు ముందుకేయనిదే మార్గం ఎలా ఏర్పడుతుందంటూ నాన్నని ఒప్పించింది. తనన్న ఆ మాటలు నా మనసులో నాటుకుపోయాయి. ఆమే నాకు స్ఫూర్తి’ అని గుర్తు చేసుకుంటారు సోమ.

ఎన్‌ఐటీ రవుర్కెలా నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ పట్టా పొందారు. అప్పట్లో ఏ డిగ్రీ చదివినా.. అమ్మాయిలు ఉపాధ్యాయ వృత్తిలో, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేవారు. సోమా మాత్రం కార్పొరేట్‌ ఉద్యోగం చేయాలనుకున్నారు. 1984లో అల్యూమినియం తయారీ సంస్థ నాల్కోలో ట్రైనీగా చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ 2014లో మొదటి మహిళా డైరెక్టర్‌ అయ్యారు. ‘తరగతిలో 200 మంది ఉంటే అమ్మాయిలు నలుగురైదుగురే. ఎలాంటి వివక్షనీ ఎదుర్కోలేదు. కానీ ఏ విషయంలో పోటీపడాలన్నా తెగ సిగ్గు పడేవాళ్లం. చదివేదొక్కటే అయినప్పుడు ఏ విషయంలో భయపడుతున్నామన్న ప్రశ్న ఓసారి ఎదురైంది. ఆలోచించగా.. నలుగురినీ నడిపించే నాయకత్వం దిశగా అమ్మాయిల ఆలోచనలు వెళ్లడం లేదని అర్థమైంది. ఆ స్థాయికి చేరాలని అప్పుడే అనుకున్నా. అమ్మ అండతో నాకు నచ్చిన సంస్థలో అడుగుపెట్టా. కష్టపడుతూ వెళ్లా. ఫలితమే ఉన్నతహోదాలు’ అంటారు   62 ఏళ్ల సోమ.

2017లో సెయిల్‌లో అడుగుపెట్టి తొలి మహిళా డైరెక్టర్‌ అయ్యారు. కొత్త మార్కెటింగ్‌ వ్యూహాలతో డిస్ట్రిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ను పెంచి అమ్మకాలు పెరిగేలా చేశారు. నెక్స్‌, సెయిల్‌ సెక్యూర్‌ వంటి కొత్త బ్రాండ్‌లు ప్రారంభించి లాభాల బాట పట్టించారు. అదే ఆమెకు ఛైర్‌పర్సన్‌ హోదానీ తెచ్చిపెట్టింది. గత మార్చిలో సంస్థ పగ్గాలు చేపట్టి రూ.51,481 కోట్లుగా ఉన్న వ్యాపారాన్ని రూ.1.03లక్షల కోట్లకు చేర్చారు. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా మాన్యుఫాక్చరింగ్‌లో మార్పులు, ఉత్పత్తుల పెరుగుదలతోపాటు అప్పులపై దృష్టిపెట్టి నష్టాల దిశగా సాగుతున్న సంస్థను లాభాలబాట పట్టించారు.


‘నా ప్రయాణాన్ని తరచి చూసుకుంటే.. పరిస్థితులకు తగ్గట్టుగా మారడం, అవసరమైనప్పుడు ముందుకొచ్చి బాధ్యతలు తీసుకోవడం.. ఇవే నన్ను నడిపించాయనిపిస్తుంది. కెరియర్‌, కుటుంబం మధ్య నలిగిపోతున్నామన్న భావనతో నాయకత్వం దిశగా ఆలోచించం. మావారు పోయాక ముగ్గురు పిల్లల్నీ, అమ్మానాన్నల్నీ చూసుకుంటూనే కెరియర్‌నీ కొనసాగిస్తున్నా. రెంటినీ ఇష్టమైన బాధ్యతగా తీసుకోవడం వల్లే ఇదంతా సాధ్యమవుతోంది. సవాళ్లకు భయపడకండి. నేర్చుకోవడానికి వెనుకాడకండి. అవకాశాలు వచ్చినప్పుడు వెనకడుగేయకండి. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి. అపజయాలు, వెనకబడటమూ మామూలే.. అలాగని ప్రయత్నం ఆపొద్దు. అప్పుడే విజయం.’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని