డ్రైవర్‌ లేని విద్యుత్‌ కారు

డ్రైవర్‌ అక్కర్లేని విద్యుత్‌ వాహనం ‘అపోలో ఆర్‌టీ6’ను చైనాకు చెందిన కృత్రిమ మేధ, సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ బైదూ ఆవిస్కరించింది. బైదూకు చెందిన రోబో టాక్సీలో ఇదీ భాగం కానుంది. పూర్తి స్థాయి విద్యుత్‌ వాహనమైన ఈ కారులో స్టీరింగ్‌ ఉంటుంది. అవసరం లేదనుకుంటే తీసేయవచ్చు.

Published : 22 Jul 2022 03:11 IST

ఆవిష్కరించిన చైనా సంస్థ బైదూ

ధర 37,000 డాలర్లు

నగరాలకే పరిమితం

హాంకాంగ్‌: డ్రైవర్‌ అక్కర్లేని విద్యుత్‌ వాహనం ‘అపోలో ఆర్‌టీ6’ను చైనాకు చెందిన కృత్రిమ మేధ, సెర్చ్‌ ఇంజిన్‌ సంస్థ బైదూ ఆవిస్కరించింది. బైదూకు చెందిన రోబో టాక్సీలో ఇదీ భాగం కానుంది. పూర్తి స్థాయి విద్యుత్‌ వాహనమైన ఈ కారులో స్టీరింగ్‌ ఉంటుంది. అవసరం లేదనుకుంటే తీసేయవచ్చు. దీని ధర 250,000 యువాన్లు (37,000 డాలర్లు లేదా సుమారు రూ.29 లక్షలు). స్టీరింగ్‌ లేకపోవడం వల్ల కలిసొచ్చే స్థలంలో అదనపు సీటు లేదా గేమింగ్‌ కన్సోల్‌, వెండింగ్‌ మెషీన్‌ వంటివి ఏర్పాటు చేసుకోవచ్చు.

టాక్సీ వ్యయంలో సగం ధరకే: ప్రస్తుతం టాక్సీలపై వెచ్చిస్తున్న వ్యయంలో సగానికే రోబోటాక్సీ వచ్చేలా ప్రయత్నిస్తున్నట్లు బైదూ వరల్డ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ రాబిన్‌ లీ అంటున్నారు. ‘ఖర్చు భారీగా తగ్గితే, చైనా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో వాహనాలను తీసుకురావడానికి వీలవుతుంద’న్నారు.

ఆర్‌టీ6 పరిమితులు ఇవీ..: సాంకేతికత విషయంలో ఆర్‌టీ6కు అయిదింట నాలుగో స్థాయి(లెవల్‌ 4) దక్కింది. అంటే డ్రైవర్‌ లేకుండా దీనిని నిర్వహించవచ్చు. అయితే ప్రీలోడెడ్‌ మ్యాప్‌తో మాత్రమే ఇది పనిచేస్తుంది. అంటే పరిమిత ప్రాంతాల్లోనే నిర్వహించవచ్చు. ప్రస్తుతానికి నగర రహదారులపై అనుమతిస్తారు. లెవల్‌ 3లో అయితే జాతీయ రహదారులపై హ్యాండ్స్‌ ఫ్రీ డ్రైవింగ్‌కు అనుమతి ఉటుంది.  

ఇప్పటికే ఒకటి ఉంది కానీ..: బైదూ సంస్థ ఇప్పటికే, అపోలో గో అనే అటానమస్‌ టాక్సీ సర్వీసులను నిర్వహిస్తోంది. వీటిలో డ్రైవర్‌ అక్కర్లేకపోయినా.. భద్రత నిమిత్తం డ్రైవర్‌ సీటులో సిబ్బందిని నియమించారు. బీజింగ్‌, షాంఘై, షెంజెన్‌, గ్వాంఝు వంటి నగరాల్లో ఈ సేవలను ఆవిష్కరించారు.

అమెరికానే ముందు: అమెరికాకు చెందిన ఆల్ఫాబెట్‌ వేమో ఇప్పటికే ఫీనిక్స్‌, ఆరిజోనాలలో డ్రైవర్‌ రహిత టాక్సీ సేవలను అందిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని