Business news: 20 లక్షల కార్ల ఉత్పత్తి లక్ష్యం

సెమీ కండక్టర్‌ చిప్‌సెట్ల లభ్యత మెరుగవుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 20 లక్షల కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు. 2021-22 కంపెనీ వార్షిక నివేదికలో వాటాదార్లకు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

Updated : 08 Aug 2022 04:16 IST

2022-23పై మారుతీ సుజుకీ ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ

దిల్లీ: సెమీ కండక్టర్‌ చిప్‌సెట్ల లభ్యత మెరుగవుతున్నందున, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022-23) 20 లక్షల కార్లు ఉత్పత్తి చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నట్లు మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) ఛైర్మన్‌ ఆర్‌సీ భార్గవ వెల్లడించారు. 2021-22 కంపెనీ వార్షిక నివేదికలో వాటాదార్లకు ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సవాలుతో కూడిన ఈ లక్ష్యాన్ని చేరడంలో, మధ్యస్థాయి ఎస్‌యూవీ గ్రాండ్‌ విటారా ముఖ్య భూమిక పోషిస్తుందని భార్గవ పేర్కొన్నారు. వార్షిక నివేదిక ప్రకారం..
* 2021-22లో మారుతీ సుజుకీ 13.4 శాతం వృద్ధితో 16.52 లక్షల కార్లను విక్రయించింది. తొలి త్రైమాసికంలో కొవిడ్‌ మహమ్మారి ప్రభావం, సెమీ కండక్టర్ల కొరత వల్ల దేశీయ విక్రయాలు బాగా తగ్గాయి.
* ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి కంపెనీ వద్ద 2.7 లక్షల కార్ల బుకింగ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. గిరాకీ ఉన్న కార్లు తయారు చేయలేకపోవడంతో, మార్కెట్‌ వాటా దాదాపు 50 శాతం నుంచి 43.4 శాతానికి తగ్గింది.
  హ్యాచ్‌బ్యాక్‌లకు గిరాకీ తగ్గుతున్నందునే
మారుతీ సుజుకీకి హ్యాచ్‌బ్యాక్‌ మోడళ్ల అమ్మకాలే ఇటీవలి వరకు అధికంగా ఉండేవి. అయితే 2020-21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ విభాగంలో విక్రయాలు 5 శాతం, 2018-19తో పోలిస్తే 29 శాతం మేర తగ్గాయి. ఇదే సమయంలో ఎస్‌యూవీలకు గిరాకీ పెరుగుతుంది. అందువల్ల  మారుతీ సుజుకీ కూడా తమ ఎస్‌యూవీ మోడళ్లను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. బ్రెజాను రీమోడలింగ్‌ చేసి గ్రాండ్‌ విటారాగా అంతర్జాతీయంగా విడుదల చేస్తుండటం మారుతీకి కలిసొస్తుందని భార్గవ తెలిపారు. మరిన్ని మోడళ్లను కూడా తీసుకురావడం ద్వారా ఎస్‌యూవీ విభాగంలో మార్కెట్‌ వాటా పెంచుకుంటామని తెలిపారు.

* గ్రాండ్‌ విటారాను టయోటా హైబ్రిడ్‌ సాంకేతికతతో కర్ణాటక ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. దేశీయంగా ఈ తరహా సరికొత్త సాంకేతికతతో రూపొందుతున్న తొలి కారు ఇదే.

2024-25లో విద్యుత్తు కారు
సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌ గుజరాత్‌ ప్లాంట్‌లో 2024-25 నుంచి విద్యుత్‌ మోడళ్ల ఉత్పత్తి ప్రారంభిస్తుంది. మారుతీ సుజుకీ ఇండియా ఆ వాహనాలను విక్రయిస్తుంది. విద్యుత్తు వాహనాలకు గిరాకీ బాగా పెరిగే వరకు, కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు సీఎన్‌జీ, ఇథనాల్‌, బయోగ్యాస్‌, హైబ్రిడ్‌ మోడళ్లను ప్రోత్సహించాలని భార్గవ సూచించారు.

కొత్తప్లాంటు తొలిదశపై రూ.11000 కోట్ల పెట్టుబడి
‘హరియాణాలో కొత్త తయారీ ప్లాంట్‌  తొలి దశ నిర్మాణం కోసం రూ.11,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నామ’ని భార్గవ తెలిపారు. ‘2025లో ఇక్కడ ఉత్పత్తి ప్రారంభమవుతుంది. తదుపరి ఏడాది రెండో ప్లాంట్‌ కార్యకలాపాలు ప్రారంభిస్తాం. ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల తయారీ ప్లాంట్‌గా దీన్ని తీర్చిదిద్దుతాం. హరియాణాతో పాటు దేశ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అని మారుతీ సుజుకీ ఛైర్మన్‌ వివరించారు.
* దేశీయ ప్రయాణికుల వాహన విక్రయాలు 2021-22లో 30,69,499గా నమోదయ్యాయి. 2020-21లో ఇవి 27,11,457 మాత్రమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని