ఇంటి రుణం తీర్చేయాలా?

సొంతిల్లు కొనేందుకు బ్యాంకు నుంచి ఇటీవలే రూ.30 లక్షల రుణం తీసుకున్నాను. వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో

Published : 25 Jun 2022 17:35 IST

* సొంతిల్లు కొనేందుకు బ్యాంకు నుంచి ఇటీవలే రూ.30 లక్షల రుణం తీసుకున్నాను. వడ్డీ రేట్లు పెరుగుతున్న నేపథ్యంలో దీన్ని తొందరగా తీర్చేయాలని ఆలోచిస్తున్నాను. ఇది మంచి ఆలోచనేనా?                

  - రవీంద్ర

ఇప్పుడు వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. భవిష్యత్‌లో ఇవి ఇంకా పెరిగేందుకు ఆస్కారం ఉంది. సెక్షన్‌ 24 కింద గృహరుణంపై చెల్లించే వడ్డీకి రూ.2లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. మీ దగ్గర డబ్బు ఉంటే.. ప్రస్తుతం ఉన్న రుణంలో రూ.5 లక్షలు తీర్చేయండి. దీనివల్ల మీ గృహరుణం రూ.25 లక్షలు అవుతుంది. దీనిపై చెల్లించే వడ్డీకి దాదాపు పూర్తి మినహాయింపు వర్తిస్తుంది.


* మాకు ఇటీవలే పాప పుట్టింది. తన స్కూలు ఫీజుకు ఇబ్బంది లేకుండా.. ఇప్పటి నుంచే నెలకు రూ.10వేల వరకూ జమ చేయాలని అనుకుంటున్నాను. దీనికోసం ఎలాంటి పథకాలను ఎంచుకోవాలి?              

- చంద్రశేఖర్‌

ముందుగా మీ పాప భవిష్యత్‌ ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ కల్పించండి. ఇందుకోసం మీ పేరుపై తగిన మొత్తానికి టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. మీ పాప మూడేళ్ల తరువాత స్కూలుకు వెళ్తుందనుకుందాం. అమ్మాయికి కనీసం ఏడేళ్లు వచ్చేదాకా పెట్టుబడిని కొనసాగించండి. చిన్న తరగతుల్లో ఉన్నప్పుడు మీ చేతిలో ఉన్న డబ్బులోంచే ఫీజు చెల్లించే ప్రయత్నం చేయండి. నెలకు రూ.10వేల చొప్పున ఏడేళ్లపాటు మదుపు చేస్తే.. సగటున 12 శాతం రాబడితో దాదాపు రూ.12,10,000 జమ అయ్యేందుకు వీలుంది. పెట్టుబడి కోసం  డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఏడేళ్ల అనంతరం ఈ మొత్తాన్ని నష్టభయం తక్కువగా ఉన్న పథకాల్లోకి మళ్లించొచ్చు. 8 శాతం రాబడితో.. ఏడాదికి రూ.96వేల వరకూ అందుతాయి. ఈ మొత్తాన్ని అమ్మాయి చదువుకు ఉపయోగించుకోవచ్చు.


*చిరు వ్యాపారిని. మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయాలనేది ఆలోచన. కానీ, నెలకు కచ్చితంగా కొంత మొత్తాన్ని కేటాయించలేను. మూడు నెలలకోసారి పెట్టుబడి పెట్టేందుకు వీలవుతుందా?  

- ప్రతాప్‌

 పెట్టుబడుల విషయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం. మీరు నెలనెలా మదుపు చేస్తేనే మంచిది. మీరు ఎంత మదుపు చేయగలరో నిర్ణయించుకోండి. మూడు-నాలుగు నెలలకు అవసరమైన మొత్తాన్ని ముందుగా బ్యాంకులో జమ చేయండి. ఆ తరువాత సిప్‌ను ప్రారంభించండి. ఖాతాలో ఎప్పుడూ నెల పెట్టుబడికి డబ్బు ఉండేలా జాగ్రత్త తీసుకోండి. మీ సంపాదన పెరిగినప్పుడు మీ పెట్టుబడిని పెంచుకునే ప్రయత్నం చేయండి.


* టర్మ్‌ బీమా తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశాను. నాకు బీపీ ఉందని చెప్పి, పాలసీని తిరస్కరించారు. నేరుగా బీమా సంస్థ కార్యాలయం నుంచి పాలసీ తీసుకోవచ్చా?

- ప్రవీణ్‌

ఆన్‌లైన్‌లో పాలసీ కోసం దరఖాస్తు చేసినా.. నేరుగా బీమా సంస్థ కార్యాలయానికి వెళ్లి పాలసీ తీసుకోవాలనుకున్నా.. మీ ఆరోగ్య వివరాలు తప్పకుండా తెలియజేయాలి. మీరు తీసుకుంటున్న పాలసీని బట్టి, బీమా సంస్థ వైద్య పరీక్షల కోసం అడగవచ్చు. ఈ పరీక్షల నివేదికల ఆధారంగా మీకు పాలసీ ఇవ్వాలా? వద్దా? ప్రీమియం లోడింగ్‌ విధించాలా? అన్నది కంపెనీ నిర్ణయిస్తుంది. మీరు రెండు మూడు బీమా సంస్థలను సంప్రదించండి. కాస్త అధిక ప్రీమియంతో మీకు పాలసీ వచ్చేందుకు అవకాశాలున్నాయి. 


- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని