Published : 25 Jun 2022 17:39 IST

అంతర్జాతీయ ఫండ్లలో మదుపు చేయొచ్చా?

నా వయసు 33. అయిదేళ్లుగా నెలకు రూ.40వేలు మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నాను. ఇందులో కొన్ని ఈఎల్‌ఎస్‌ఎస్‌లు, మరికొన్ని లార్జ్‌క్యాప్‌ ఫండ్లు ఉన్నాయి. వీటికి బదులుగా మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో ఎక్కువ రాబడి వస్తుందని విన్నాను. నిజమేనా? మరో ఏడేళ్లు మదుపు చేసి, ఆపేయాలనుకుంటున్నాను. అప్పటికి నా దగ్గర ఎంత మొత్తం జమయ్యే వీలుంది?

- దీపక్‌

* మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేటప్పుడు పథకాల ఎంపికలో వైవిధ్యం పాటించాలి. ఒకే తరహా పథకాల్లో మదుపు చేస్తే నష్టభయం అధికంగా ఉంటుంది. లార్జ్‌, ఫ్లెక్సీ, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ తరహా ఫండ్లు మీ జాబితాలో ఉండాలి. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌లలో పెట్టుబడి మొత్తంలో 20-30 శాతం మించకుండా చూసుకోవాలి. ఈ ఫండ్లు అధిక రాబడినిచ్చినప్పటికీ.. మార్కెట్లు పతనం అయినప్పుడు నష్టపోయే అవకాశాలూ ఎక్కువే. నెలకు రూ.40వేల చొప్పున 12 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగిస్తే.. సగటున 12 శాతం రాబడితో.. దాదాపు రూ.1,15,83,903 అయ్యేందుకు వీలుంది.


మాకు ఇద్దరు 8, 6 ఏళ్ల అబ్బాయిలున్నారు. వీరి పేరుమీద నెలకు రూ.10వేల చొప్పున పెట్టుబడి పెట్టాలనేది ఆలోచన. పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉండాలి?

- ప్రకాశ్‌

* ముందుగా మీ అబ్బాయిల ఆర్థిక అవసరాలకు తగిన రక్షణ ఏర్పాటు చేయండి. దీనికోసం మీ పేరున తగిన మొత్తానికి జీవిత బీమా పాలసీని టర్మ్‌ పాలసీ ద్వారా తీసుకోండి. రూ.10వేలు ఇద్దరి భవిష్యత్‌ అవసరాలకు సరిపోవు. మీ ఆదాయం పెరిగినప్పుడు పెట్టుబడి మొత్తాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. మీరు మదుపు చేయాలనుకుంటున్న మొత్తం రూ.10వేలు విద్యా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడి వచ్చేలా చూసుకోండి. దీనికోసం డైవర్సిఫైడ్‌ ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు పరిశీలించండి.


టర్మ్‌ పాలసీ తీసుకోవాలని అనుకుంటున్నాను. నా వయసు 48. వార్షిక జీతం రూ.8లక్షలు. నాకు ఎంత మేరకు పాలసీ తీసుకునే అర్హత ఉంటుంది?

- శ్రీనివాస్‌

* సాధారణంగా బీమా సంస్థలు ఒక వ్యక్తి వార్షికాదాయానికి 15-20 రెట్ల వరకూ విలువైన టర్మ్‌ పాలసీని ఇస్తాయి. ఇది పూర్తిగా బీమా సంస్థల విచక్షణ మేరకు ఆధారపడి ఉంటుంది. మంచి క్లెయిం సెటిల్‌మెంట్‌ ఉన్న రెండు బీమా సంస్థల నుంచి మీరు పాలసీ తీసుకునేందుకు ప్రయత్నించండి. వార్షికాదాయానికి కనీసం 12-15 రెట్ల వరకూ బీమా ఉండేలా చూసుకోండి.


మా అమ్మాయి పేరుమీద సుకన్య సమృద్ధి పథకంలో మూడు నెలలకోసారి రూ.10వేలు జమ చేస్తున్నాను. దీనికి బదులుగా కాస్త అధిక రాబడి వచ్చే సురక్షిత పథకాలు ఉన్నాయా?

- మధు

* ప్రస్తుతం అందుబాటులో ఉన్న సురక్షిత పథకాల్లో సుకన్య సమృద్ధి యోజనను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బాలికల చదువు, ఇతర ఖర్చులను దృష్టిలో పెట్టుకొని, పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం ఇది. ప్రస్తుతం ఇందులో 7.6శాతం రాబడి లభిస్తోంది. వచ్చే వడ్డీపైనా పన్ను ఉండదు. దీనికి మించి సురక్షిత పథకాలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. కాస్త అధిక రాబడి రావాలంటే.. రూ.5వేలను ఈ పథకంలో జమ చేస్తూ.. మిగిలిన మొత్తాన్ని డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లకు మళ్లించండి. కాస్త నష్టభయం ఉన్నా.. దీర్ఘకాలంలో మంచి రాబడినిచ్చే వీలుంది.


అంతర్జాతీయ మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేసేందుకు అవకాశం ఉంది కదా. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?

- సాగర్‌

* ఇటీవల కాలంలో అంతర్జాతీయ ఫండ్లు మంచి లాభాలనే ఇచ్చాయి. ముఖ్యంగా అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న పథకాల పనితీరు బాగుంది. పెట్టుబడుల్లో వైవిధ్యం కోసం అంతర్జాతీయ ఫండ్లలో 10-12 శాతం వరకూ మదుపు చేయొచ్చు. మీరు పెట్టుబడి పెట్టిన దేశాల్లోని స్టాక్‌ మార్కెట్‌ పనితీరు ఆధారంగా మీకు వచ్చే లాభాలు ఆధారపడి ఉంటాయి. దీంతోపాటు మారకపు విలువ ప్రభావమూ ఉంటుంది. రూపాయి బలహీనపడితే.. అక్కడి మార్కెట్‌ లాభాలతోపాటు, ఇక్కడ రూపాయలూ అధికంగా వస్తాయి. ఒకవేళ బలపడితే.. ఆ మేరకు లాభాలు కాస్త తగ్గే అవకాశం ఉంది.


- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని