వ్యాపారులు... టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చా?

నేను ప్రైవేటు ఉద్యోగిని. ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయబోతున్నాను.

Published : 25 Jun 2022 17:49 IST

* నేను ప్రైవేటు ఉద్యోగిని. ఈ ఏడాది జూన్‌లో పదవీ విరమణ చేయబోతున్నాను. ఆ సమయంలో నాకు వచ్చే మొత్తాన్ని నెలనెలా వడ్డీ వచ్చేలా మదుపు చేయాలని అనుకుంటున్నాను. ఈక్విటీ ఫండ్లలో పెట్టుబడి పెట్టి, నెలనెలా నాకు కావాల్సిన మొత్తాన్ని తీసుకునే వీలుంటుందా? కాస్త అధిక రాబడి వచ్చేలా ఏ పథకాలను ఎంచుకోవాలి?

- సురేందర్‌

* మీకు వచ్చిన పదవీ విరమణ ప్రయోజనాలను రెండు భాగాలుగా విభజించి పెట్టుబడులకు మళ్లించాలి. ముందుగా 50-60శాతం మొత్తాన్ని సురక్షిత పథకాల్లో మదుపు చేయండి. మిగతా మొత్తాన్ని నష్టభయం ఎక్కువగా ఉండే ఈక్విటీ ఫండ్లకు కేటాయించాలి. మొత్తం డబ్బును ఈక్విటీ పథకాల్లో మదుపు చేసి, నెలనెలా కావాల్సిన మొత్తాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ, ఇది ఏమాత్రం ఆచరణీయం కాదు. మార్కెట్లు పడిపోతే.. ఒక్కసారిగా నష్టాల్లోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, ముందుగా అయిదేళ్లపాటు సురక్షిత పెట్టుబడి పథకాల్లో నుంచి రాబడిని తీసుకోండి. ఆ తర్వాత ఈక్విటీ ఆధారిత పథకాల నుంచి నెలనెలా కొంత మొత్తాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. సురక్షిత పథకాల కోసం పోస్టాఫీసు సీనియర్‌ సిటిజన్‌ స్కీం, మంత్లీ ఇన్‌కం స్కీం, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను పరిశీలించవచ్చు. దీర్ఘకాలం కోసం మంచి పనితీరున్న నాలుగైదు ఈక్విటీ ఫండ్లను ఎంచుకోండి.


* మా అబ్బాయి హైదరాబాద్‌లో ఉన్నప్పుడు తన పేరుమీద పీపీఎఫ్‌ ఖాతా ప్రారంభించాం. ఇప్పుడు తను అమెరికాలో ఉంటున్నాడు. ఈ ఖాతాను రద్దు చేసుకోవాలని అంటున్నారు. నిజమేనా? కొనసాగించేందుకు వీలుండదా?

- విజయ్‌ కుమార్‌

* ప్రవాస భారతీయులు మన దేశంలో కొత్తగా పీపీఎఫ్‌ (ప్రజా భవిష్య నిధి) ఖాతాను ప్రారంభించేందుకు అవకాశం లేవు. మన దేశంలో ఉన్నప్పుడు ప్రజా భవిష్య నిధి (పీపీఎఫ్‌)ను ప్రారంభిస్తే.. విదేశాలకు వెళ్లినా దాన్ని వ్యవధి తీరేంత వరకూ కొనసాగించుకోవచ్చు. ఎన్‌ఆర్‌ఓ ఖాతా ద్వారా పెట్టుబడులు పెట్టేందుకూ వీలుంది. ఇక్కడ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తే సెక్షన్‌ 80సీ మినహాయింపుల్లోనూ క్లెయిం చేసుకోవచ్చు.


* మాకు ఇటీవలే వివాహం అయ్యింది. ఇద్దరమూ ఉద్యోగులమే. రెండేళ్లలో రుణం తీసుకొని ఫ్లాటు కొనాలన్నది ఆలోచన. ఇందుకు వీలుగా మా పెట్టుబడి ప్రణాళిక ఎలా ఉంటే బాగుంటుంది?

- దీపిక

* ముందుగా మీ వార్షికాదాయాలకు 10-12 రెట్ల వరకూ జీవిత బీమా పాలసీని తీసుకోండి. వ్యక్తిగత ప్రమాద, ఆరోగ్య బీమా పాలసీలూ ఉండాలి. మీరు ఫ్లాట్‌ తీసుకునేందుకు రుణం తీసుకుంటారు కాబట్టి, ముందుగా మార్జిన్‌ మనీని సిద్ధం చేసుకోవాలి. దీనికోసం మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటున్న మొత్తాన్ని నెలనెలా రికరింగ్‌ డిపాజిట్‌లో మదుపు చేయండి. రుణం తీసుకున్నప్పుడు ఆ రుణ మొత్తానికీ లోన్‌ కవర్‌ టర్మ్‌ పాలసీని తీసుకోండి. రుణ వాయిదా మీ ఇద్దరి ఆదాయంలో 30-40శాతానికి మించకుండా చూసుకోండి.


* నా వయసు 40. చిన్న వ్యాపారిని. నెలకు రూ.40వేల వరకూ ఆదాయం వస్తుంది. నాకు ఇప్పటి వరకూ ఎలాంటి బీమా పాలసీలు లేవు. వ్యాపారులకు టర్మ్‌ పాలసీ ఇస్తారా? నేను ఎంత మేరకు పాలసీ తీసుకోవాలి? నెలకు రూ.5వేల చొప్పున ఏదైనా పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను.

- రవి

* వ్యాపారులూ టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చు. ఆదాయపు ధ్రువీకరణ కోసం రిటర్నులు చూపించాల్సి ఉంటుంది. మీ ఆదాయం ఆధారంగా చూసినప్పుడు మీకు కనీసం రూ.50లక్షల మేరకు బీమా ఉండాలి. బీమా సంస్థలు కొన్నిసార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాల్సిందిగా సూచిస్తుంటాయి. వైద్య పరీక్షల నివేదికలు, మీ రిటర్నులు పరిశీలించిన తర్వాత మీకు ఎంత మేరకు పాలసీ ఇవ్వాలనేది బీమా సంస్థ నిర్ణయిస్తుంది. ఇక నెలనెలా పెట్టుబడి కోసం హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లను ఎంచుకోండి. కనీసం ఆరు నెలల ఖర్చుకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోండి.


* మా అమ్మాయి వయసు 11. తన పేరుమీద నెలకు రూ.10వేల చొప్పున మదుపు చేయాలని అనుకుంటున్నాం. కనీసం 14 ఏళ్ల వరకూ పెట్టుబడిని కొనసాగించగలం. కాస్త సరక్షితంగా ఉంటూ మంచి రాబడి వచ్చేలా ఉండాలి? ఎలాంటి పథకాలు ఎంచుకోవాలి?

- వినోద్‌

* పిల్లల పేరుమీద పెట్టుబడులు పెట్టడం కన్నా.. తల్లిదండ్రుల పేరుతో ఉండటమే మంచిది. మీరు మదుపు చేయాలనుకుంటున్న రూ.10వేలలో రూ.4వేలు నెలనెలా పీపీఎఫ్‌లో జమ చేయండి. మిగతా రూ.6వేలను ఈక్విటీ ఫండ్లలో సిప్‌ చేయండి. ఇలా చేయడం వల్ల సగటున 10 శాతం వరకూ రాబడిని ఆశించవచ్చు. నెలకు రూ.10వేలు, 14 ఏళ్లపాటు మదుపు చేస్తే.. 10శాతం రాబడి అంచనాతో రూ.33.57లక్షలు అయ్యేందుకు ఆస్కారం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని