Ask the expert: పదవీ విరమణ... నిధిని జమ చేయాలంటే..?

మా అబ్బాయి పేరిట మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. అతని వయసు ఏడాది. కనీసం నెలకు రూ.5,000 చొప్పున పెట్టుబడి పెట్టాలంటే ఏం చేయాలి?

Updated : 25 Jun 2022 20:37 IST

మా అబ్బాయి పేరిట మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. అతని వయసు ఏడాది. కనీసం నెలకు రూ.5,000 చొప్పున పెట్టుబడి పెట్టాలంటే ఏం చేయాలి?

- శ్రావణి

* మీ అబ్బాయి పేరుతో కాకుండా.. మీ పేరుపైనా మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేయండి. దీనికోసం ముందుగా కేవైసీని పూర్తి చేయాలి. కేవైసీ దరఖాస్తుకు ఆధార్‌, పాన్‌ను జత చేసి మీ సమీపంలోని బ్యాంకు లేదా మ్యూచువల్‌ ఫండ్‌ సలహాదారుడు, స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థ కార్యాలయంలో సంప్రదించండి. మీ బాబు వయసు ఏడాది కాబట్టి, దీర్ఘకాలిక దృష్టితో పెట్టుబడి పెట్టండి. దీనికోసం హైబ్రీడ్‌ ఈక్విటీ ఫండ్లలో మదుపు చేయండి. వీలైనప్పుడు పెట్టుబడిని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చు.

నా వయసు 40. పదవీ విరమణ అవసరాల కోసం నెలకు రూ.12వేల వరకూ మదుపు చేయాలనే ఆలోచనతో ఉన్నాను. డిఫర్డ్‌ యాన్యుటీ పాలసీలను ఎంచుకోవడం మంచిదేనా? దీనివల్ల దీర్ఘకాలంలో ఎంత మేరకు ప్రయోజనం ఉంటుంది?

- సుధీర్‌

* పదవీ విరమణ నిధిని జమ చేసేందుకు అనేక మార్గాలున్నాయి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లు, జాతీయ పింఛను పథకంలాంటివి పరిశీలించవచ్చు. పదవీ విరమణ దాకా వీటిల్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. రిటైర్‌ అయ్యాక అప్పటి వరకూ జమ చేసిన డబ్బుతో వెంటనే పింఛను ఇచ్చే ఇమ్మీడియట్‌ యాన్యుటీ పాలసీలను కొనుగోలు చేయొచ్చు. మీ పెట్టుబడికి దాదాపు 12 శాతం రాబడి వచ్చేలా చూసుకోవాలి. నెలకు రూ.12వేలను 20 ఏళ్లపాటు మదుపు చేస్తే.. సగటున 12 శాతం రాబడితో రూ.1,03,75,551 అయ్యేందుకు అవకాశం ఉంది. ఈ డబ్బుతో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఇమ్మీడియట్‌ యాన్యుటీ పథకాల కొనుగోలుకు వాడుకోవచ్చు. ఆ రోజున ఉన్న వడ్డీ రేట్ల ప్రకారం పింఛను అందుకోవచ్చు.

నా ఆదాయం నెలకు రూ.50,000. ఇంటి రుణ ఈఎంఐ కోసం రూ.28,000 చెల్లిస్తున్నాను. నా ఈపీఎఫ్‌ నుంచి కొంత మొత్తాన్ని తీసుకొని, ఈ రుణానికి చెల్లించడం మంచిదేనా? దీనివల్ల ఈఎంఐ తగ్గుతుందా?

- విజయ్‌

* ఉద్యోగ భవిష్య నిధి (ఈపీఎఫ్‌)పై ప్రస్తుతం 8.5శాతం వడ్డీ చెల్లిస్తున్నారు. గృహరుణం వడ్డీ రేట్లు దాదాపు 7 శాతం వరకే ఉన్నాయి. ఈపీఎఫ్‌పైన వచ్చే వడ్డీకి పూర్తి పన్ను మినహాయింపు వర్తిస్తుంది. అదే విధంగా గృహరుణానికి చెల్లించే వడ్డీ, అసలుకు నిబంధనల మేరకు పన్ను మినహాయింపు ఉంటుంది. మీకు నెలవారీ వాయిదా చెల్లించడం భారమైతే రుణ వ్యవధిని పెంచుకోండి. దీనివల్ల ఈఎంఐ తగ్గుతుంది. భవిష్యత్తులో ఈపీఎఫ్‌పైన వడ్డీ తగ్గి, గృహరుణంపై వడ్డీ పెరిగినప్పుడు మీరు అనుకున్న నిర్ణయం తీసుకోవచ్చు.

రెండేళ్ల నుంచి గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడుతున్నాను. రాబడి పెద్దగా రావడం లేదు. దీనికి బదులుగా నెలకు రూ.10వేల పెట్టుబడిని ఈక్విటీ ఫండ్లలోకి మళ్లించవచ్చా? లేదా బంగారంలోనే కొనసాగాలా?

- కుమార్‌

* భవిష్యత్తులో మీకు బంగారం అవసరం ఉంటుంది అనుకుంటే.. గోల్డ్‌ ఈటీఎఫ్‌లలో మీ పెట్టుబడులను కొనసాగించండి. 2019-2020 మధ్య కాలంలో బంగారంపై మంచి రాబడి వచ్చింది. కానీ, గత 10 ఏళ్లుగా చూస్తే పసిడిపై రాబడి అంత ఆజాజనకంగా లేదు. డబ్బును వృద్ధి చేసుకునేందుకు మదుపు చేయాలని అనుకుంటే.. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో సిప్‌ చేయండి. కనీసం 5-7 ఏళ్లపాటు పెట్టుబడి కొనసాగేలా చూసుకోండి.

కొత్తగా ఉద్యోగంలో చేరాను. మా సంస్థ నుంచి ఆరోగ్య బీమా అందిస్తున్నారు. నేను టర్మ్‌ పాలసీ తీసుకునేందుకు కొన్నాళ్లు ఆగాలా? ఇప్పుడే తీసుకుంటే తక్కువ ప్రీమియం వర్తిస్తుందా?

- హర్ష

* చిన్న వయసులో ఉన్నప్పుడే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. దీనివల్ల ప్రీమియం తక్కువగా ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ప్రీమియమై అధికమవుతుంది. మీపై ఆధారపడిన వారెవరైనా ఉంటే వెంటనే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోండి. మీ వార్షికాదాయానికి కనీసం 10-12 రెట్ల వరకూ ఈ బీమా విలువ ఉండాలి. మంచి క్లెయిం సెటిల్‌మెంట్‌ ఉన్న రెండు కంపెనీలను ఎంచుకొని, ఈ మొత్తాన్ని రెండు పాలసీలుగా తీసుకోండి. దీంతోపాటు, వ్యక్తిగత ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం, అత్యసర నిధిని ఏర్పాటు చేసుకోవడంలాంటివీ ముఖ్యమే.

- తుమ్మ బాల్‌రాజ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని