ఆ సూచనలు నమ్మొచ్చా?

నా వయసు 30. ఇటీవలే వివాహం అయ్యింది. మేమిద్దరమూ ఉద్యోగులమే. మా ఇద్దరి పేరుమీదా ఉమ్మడిగా టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చా? లేక విడివిడిగా పాలసీ తీసుకోవడం మంచిదా?

Published : 30 Jun 2022 14:19 IST

నా వయసు 30. ఇటీవలే వివాహం అయ్యింది. మేమిద్దరమూ ఉద్యోగులమే. మా ఇద్దరి పేరుమీదా ఉమ్మడిగా టర్మ్‌ పాలసీ తీసుకోవచ్చా? లేక విడివిడిగా పాలసీ తీసుకోవడం మంచిదా?

- సత్యనారాయణ

మీరిద్దరూ మీ వార్షికాదాయానికి 10-12 రెట్ల వరకూ జీవిత బీమా ఉండేలా టర్మ్‌ పాలసీలను ఎంచుకోండి. ఈ పాలసీని ఉమ్మడిగా తీసుకోవడం కాకుండా.. విడివిడిగా తీసుకోవడమే మేలు. కావాల్సిన మొత్తాన్ని రెండు భాగాలుగా విభజించి, రెండు వేర్వేరు సంస్థల నుంచి పాలసీని తీసుకోండి. మీ బాధ్యతలు ఎంత కాలం ఉంటాయన్నది ఆధారంగా పాలసీ వ్యవధి నిర్ణయించుకోండి. మీ ఆరోగ్య, ఆర్థిక, వ్యక్తిగత వివరాలను బీమా సంస్థకు పూర్తిగా తెలియజేయండి.

మా అబ్బాయి వయసు 5 ఏళ్లు. అతని పేరుమీద ప్రతి నెలా రూ.10,000 వరకూ మదుపు చేయాలనే ఆలోచన. అతని ఉన్నత చదువులు, ఇతర ఖర్చులకు ఉపయోగపడేలా ఎలాంటి పెట్టుబడి పథకాలను ఎంపిక చేసుకోవాలి?

- దీప

మీ బాబు ఉన్నత చదువులకు 15 ఏళ్ల సమయం ఉంది. అప్పటివరకూ మీరు పెట్టుబడిని కొనసాగించండి. ప్రస్తుతం విద్యా ద్రవ్యోల్బణం చాలా అధికంగా ఉంది. భవిష్యత్తులో ఉన్నత చదువులకు పెద్ద మొత్తం అవసరం అవుతుంది. అందుకే, మీ పెట్టుబడులు మంచి రాబడినిస్తూ ఈ విద్యా ద్రవ్యోల్బణాన్ని అధిగమించేలా ఉండాలి. అందుకే, మీరు ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు ఎంచుకోవడమే మంచిది. మీరు పెట్టాలనుకుంటున్న రూ.10వేలను డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్లలో క్రమానుగత విధానంలో మదుపు చేయండి. 15 ఏళ్లపాటు నెలకు రూ.10వేల చొప్పున మదుపు చేస్తూ వెళ్తే.. సగటున 12 శాతం రాబడితో రూ.44,73,565 అయ్యేందుకు అవకాశం ఉంది. ఈక్విటీ పెట్టుబడుల్లో కాస్త నష్టభయం ఉంటుందని గుర్తుంచుకోండి.

ఆదాయపు పన్ను మినహాయింపు కోసం రూ.50వేలు ఎన్‌పీఎస్‌లో మదుపు చేయాల్సిందిగా సూచించారు. ఇది మంచి పథకమేనా? నా వయసు 49.  ఎంతకాలం మదుపు చేయాలి? దీనికి ప్రత్యామ్నాయంగా ఏమైనా ఇతర పథకాలు ఉన్నాయా?

- శ్రీనివాస్‌

సెక్షన్‌ 80సీ పరిమితి రూ.1,50,000 ముగిసిన తర్వాత, మరింత పన్ను మినహాయింపు కావాలనుకున్నప్పుడు జాతీయ పింఛను పథకాన్ని (ఎన్‌పీఎస్‌) పరిశీలించవచ్చు. ఇందులో ఎంతైనా మదుపు చేసుకోవచ్చు. కానీ, సెక్షన్‌ 80సీసీడీలో భాగంగా గరిష్ఠంగా రూ.50వేల మేరకు మినహాయింపు లభిస్తుంది. ఇది మంచి పథకమే. ఛార్జీలూ తక్కువగానే ఉంటాయి. ఒకవేళ సెక్షన్‌ 80సీలో పరిమితి దాటకపోతే ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకోవచ్చు. ఎన్‌పీఎస్‌లో మీ పదవీ విరమణ వరకూ పెట్టుబడులు కొనసాగించాలి.

దీర్ఘకాలిక పెట్టుబడి కోసం షేర్లలో మదుపు చేయాలనుకుంటున్నాను. నా డీమ్యాట్‌ ఖాతా ఉన్న సంస్థ.. కొన్ని షేర్లతో ఒక పోర్ట్‌ఫోలియోను సూచిస్తోంది. వీటిని నమ్మొచ్చా?

- నరేశ్‌

సాధారణంగా స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థలు వారి ఖాతాదారులు మదుపు చేసేందుకు తమవంతు సహాయంగా కొన్ని షేర్లను సూచిస్తుంటాయి. వీటితో ఒక పోర్ట్‌ఫోలియోనూ తయారు చేస్తాయి. వీటిని ఆయా స్టాక్‌ బ్రోకింగ్‌ సంస్థల రీసెర్చ్‌ నిపుణులు ఎంపిక చేస్తారు. భవిష్యత్తులో మంచి లాభాలు ఆర్జించేలా పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తారు. మదుపు చేసే విషయంలో ప్రాథమిక అవగాహన కోసం వీటిని పరిశీలించవచ్చు. కానీ, మీకు మీరుగా వీటిపై ఆయా షేర్లపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. షేర్లలో నేరుగా మదుపు చేసినప్పుడు నష్టభయం అధికంగా ఉంటుందన్నది మర్చిపోవద్దు.

- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts