సిప్‌ చేస్తేనే మేలు...

నా వయసు 48. గృహరుణం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. నా అర్హత మేరకు రూ.40 లక్షల వరకూ వస్తుంది. కానీ,

Published : 30 Jun 2022 14:20 IST

నా వయసు 48. గృహరుణం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. నా అర్హత మేరకు రూ.40 లక్షల వరకూ వస్తుంది. కానీ, ఇంత మొత్తం తీసుకోవడం ఇష్టం లేదు. కొంత నా దగ్గరున్న మొత్తాన్ని చెల్లించి, మిగతా రుణం తీసుకోవచ్చా? ఈఎంఐ అధికంగా చెల్లించడం ద్వారా వడ్డీ భారం తగ్గుతుందా?

- అమర్‌

గృహరుణానికి చెల్లించే వడ్డీకి రూ.2లక్షల వరకూ ఆదాయపు పన్ను మినహాయింపు లభిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేట్లు 6.5శాతం నుంచి 7.5శాతం వరకూ ఉన్నాయి. ఈ లెక్కన మీరు రూ.30లక్షల గృహరుణం తీసుకుంటే.. వడ్డీకి వర్తించే మినహాయింపు పూర్తిగా వినియోగించుకోవచ్చు. మీ దగ్గర మిగతా మొత్తం ఉంటే.. రూ.30లక్షల మేరకు రుణం తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న డబ్బు సరిపోకపోతే అప్పుడు అవసరం మేరకే రుణం తీసుకోండి. తక్కువ వ్యవధిని ఎంచుకున్నప్పుడు ఈఎంఐ అధికంగా ఉంటుంది. దీనివల్ల అసలు చెల్లింపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, వడ్డీ భారం తగ్గుతుంది.


పన్ను ఆదా కోసం ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఎంచుకోవాలనే ఆలోచనతో ఉన్నాను. కనీసం రూ.90వేలు మదుపు చేయాలనేది లక్ష్యం. నెలనెలా క్రమానుగత పద్ధతిలో మదుపు చేయడం మంచిదా? లేదా మార్చిలో ఒకేసారి పెట్టుబడి పెడితే లాభమా?

- సందీప్‌

సాధారణంగా పన్ను ప్రణాళికను ఎప్పుడూ ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌ నుంచే ప్రారంభించాలి. ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకుంటే.. మార్కెట్ల పనితీరును బట్టి మీకు యూనిట్లు వస్తాయి. ఒకేసారి మదుపు చేస్తే.. అప్పుడున్న మార్కెట్‌ సూచీల ఆధారంగా యూనిట్ల కేటాయింపు జరుగుతుంది. దీనికి బదులుగా నెలనెలా క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్‌) ద్వారా మదుపు చేయడమే మంచిది. మార్కెట్‌ సగటు వల్ల దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చేందుకు అవకాశం ఉంటుంది.


నేను కొన్ని ఈక్విటీ ఫండ్లలో మదుపు చేశాను. అవి దాదాపు 14 శాతం వరకూ రాబడిని అందించాయి. వీటి నుంచి ఆ లాభాలను వెనక్కి తీసుకొని, ఏదైనా ఇతర పెట్టుబడులకు మళ్లించొచ్చా? అలాగే కొనసాగించడం మంచిదా?

- కృష్ణ

మీకు ఈక్విటీ ఫండ్లపై 14 శాతం రాబడి వచ్చిందంటున్నారు. ఇది మంచి రాబడే. మీకు ఇప్పుడు వాస్తవంగా డబ్బు అవసరమైతేనే ఈ లాభాలను వెనక్కి తీసుకోండి. లేదా 1-2 ఏళ్లలో కావాలనుకుంటే ఆ పెట్టుబడిని సురక్షితమైన పథకాల్లోకి మళ్లించండి. 4-5 ఏళ్ల తర్వాత కావాలి అనుకుంటే.. వాటిని ఇప్పుడున్నట్లుగానే కొనసాగిస్తూ వెళ్లండి.


నా వయసు 62. రూ.10లక్షలను మదుపు చేసి, నెలనెలా వడ్డీ అందుకోవాలని ఆలోచన. వడ్డీ హామీ పథకాలతో పోలిస్తే డెట్‌ ఫండ్లలో డివిడెండ్‌ ఆప్షన్‌లో అధిక ప్రతిఫలం వచ్చే అవకాశం ఉందా? ఏం చేయాలి?

- నరేందర్‌

ప్రస్తుతం డెట్‌ ఫండ్లలో వచ్చే రాబడి చాలా తగ్గింది. వీటిలో డివిడెండ్‌ ఆప్షన్‌ తీసుకుంటే.. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌ పడుతుంది. రానున్న రోజుల్లో వడ్డీ రేట్లు కొంత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో డెట్‌ ఫండ్లపై వచ్చే రాబడీ తగ్గే వీలుంది. ఇలాంటి సమయంలో మీరు డెట్‌ ఫండ్లకన్నా.. పోస్టాఫీసులో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌ స్కీంను ఎంచుకోండి. ఇందులో ప్రస్తుతం 7.4శాతం రాబడి లభిస్తోంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ మొత్తాన్ని చెల్లిస్తారు.


నేను పదేళ్ల క్రితం ఒక ఎండోమెంట్‌ పాలసీని తీసుకున్నాను. ఏడాదికి రూ.40 వేల ప్రీమియం చెల్లిస్తున్నాను. మరో 10 ఏళ్ల వ్యవధి ఉంది. దీన్ని రద్దు చేసుకొని, యూనిట్‌ ఆధారిత పాలసీని తీసుకోవచ్చా? దీనివల్ల లాభం ఎక్కువగా వస్తుందని అంటున్నారు. నిజమేనా?

- ప్రణీత్‌

మీరు తీసుకున్న ఎండోమెంట్‌ పాలసీని కొనసాగించడం ఇష్టం లేకపోతే.. దాన్ని రద్దు చేసుకోవచ్చు. ఎండోమెంట్‌ పాలసీలతో పోలిస్తే యూనిట్‌ ఆధారిత పాలసీలు అధిక రాబడినిచ్చే అవకాశం ఉంది. కానీ, ఈ పాలసీల్లో రుసుములు కాస్త అధికంగానే ఉంటాయి. దీనికి ప్రత్యామ్నాయంగా మీరు మంచి పనితీరున్న మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను ఎంచుకోవచ్చు. బీమా కోసం టర్మ్‌ పాలసీని తీసుకోవడం మర్చిపోవద్దు.  

- తుమ్మ బాల్‌రాజ్‌

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts